రాష్ట్రీయం

గుదిబండగా మారిన రాజీవ్ స్వగృహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: రియల్ ఏస్టేట్ రంగంలోకి దిగినందుకు ప్రభు త్వం చేతులు కాలిపోయాయి. రోజు రోజుకు వడ్డీల భారం మోయలేక ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఒక్క అడుగు ముందుకు వేయలేక చతికిలబడిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.504 కోట్లు పెట్టుబడి పెట్టగా అది వడ్డీల భారంతో కలిసి సుమారు రూ.700 కోట్లకు చేరుకున్నా పెట్టుబడిలో నయా పైసా తిరిగి రాబట్టుకోలేక నానా తంటాలు పడుతోంది. చదరపు అడుగుకు మొదట్లో ఖరారు చేసిన ధరపై రూ. 1000 తగ్గించినా సర్కారీ ఇళ్లను కొనే నాథుడు లేకుండా పోయాడు. వీటిని ప్రభుత్వ ఉద్యోగులకు మరింత కారుచౌకగా అట్టగట్టడానికి ఈ నెల 16న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి మంతనాలు కూడా జరపనుంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రియల్ ఏస్టేట్ బూమ్ ఒక్కసారిగా ఎగబాకి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మధ్య తరగతి ప్రజానీకానికి సొంతింటి కల కలగానే మిగలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పెద్దగా లాభాపేక్ష లేకుండా నిర్మాణ వ్యయం తిరిగి వస్తే చాలని అప్పట్లో ప్రభుత్వ భావించింది. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్యర్యంలో రాజీవ్ స్వగృహ పేరిట 2008లో పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ స్థలాలను గుర్తించి నాగోలు బండ్లగూడ, పోచారం వద్ద బహుళ అంతస్తులతో ఫ్లాట్ల నిర్మాణాన్ని చేపట్టింది. సింగిల్, డబుల్, త్రిపుల్, డీలక్స్ అంటూ నాలుగు కేటగిరీలుగా ఫ్లాట్లను నిర్మించారు. రియల్ ఏస్టేట్ రంగంలో ప్రభుత్వానికి అనుభవం కొరవడటంతో రాజీవ్ స్వగృహాల నిర్మాణం నత్తనడకన కొనసాగి నాలుగేళ్ల తర్వాత అంటే 2012నాటికి నాగోల్‌లో 2746, పోచారంలో 2603 మొత్తంగా 5349 ఫ్లాట్లలో కొన్నింటిని మాత్రం పూర్తి చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా పూర్తి చేశారు. బుకింగ్‌ల డిమాండ్ ఆధారంగా నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. నిర్మాణ ప్రారంభంలో చదరపు అడుగు ధర కేవలం రూ.2100 మాత్రమే ఉంటుందని కార్పొరేషన్ ప్రకటించింది. మార్కెట్ కంటే తక్కువ ధరకు లభిస్తుందని మధ్య తరగతి ప్రజానీకం ఆసక్తి కనబర్చింది. కొనుగోలుదారులు అమిత ఆసక్తి కనబర్చడంతో ప్రైవేట్ అపార్టుమెంట్‌ల నిర్మాణం కంటే తమ నిర్మాణాల్లో నాణ్యత పాటించామని అప్పటి హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శాలినీమిశ్రా వీటి ధరను ఏకంగా చదరపు అడుగుకు రూ.2100 నుంచి రూ.2950 పెంచడం పెద్ద తప్పిదంగా మారింది. మధ్య తరగతి ప్రజలు భరించదగిన (అఫ్రడబుల్ ప్రైస్) వ్యయంతో ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వ ఆలోచన విధానం, ధర పెంపుతో ఒక్కసారిగా మారిపోయింది. రాజీవ్ స్వగృహ నిర్మాణాలు ప్రారంభించినప్పుడు చ.అ 2100 ధరతో బుక్ చేసుకున్న 502 ఫ్లాట్లు మాత్రమే అమ్ముడుపోగా పెరిగిన ధర వల్ల మిగతా ఫ్లాట్లు అలాగే మిగిలిపోయాయి. మరోవైపు వడ్డీల భారం తడిసిమోపయింది. వీటిని ఎలాగోలా వదులుకోవడమే మేలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించడంతో నిర్మాణాలు పూర్తి అయిన వాటికి చదరపు అడుగుకు రూ.2800, అసంపూర్తిగా (సెమి ఫినిఫ్డ్) ఫ్లాట్లకు రూ.2200 ధర తగ్గించి ఇ-వేలం పాటలు నిర్వహించగా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీంతో ఇలా అయితే వీటిని విక్రయించలేమని కార్పొరేషన్ చేతులెత్తేసింది. నిర్మాణ వ్యయానికే తమకు ఫ్లాట్లను ఇస్తే కొంటామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు వీటిని కేటాయించడానికి సిఎం కూడా ఆమోదం తెలిపారు. దీంతో నిర్మాణాలు పూర్తి అయిన వాటి ధర చ.అ రూ.1900 అసంపూర్తిగా మిగిలిపోయిన వాటి ధర చ.అ రూ.1700గా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కసారిగా వెయ్యి రూపాయల ధర తగ్గించడంతో ఉద్యోగ సంఘాలు ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాయి. అయితే వారు స్వయంగా నాగోల్, పోచారం స్వగృహలను సందర్శించాక ఇంకా ధర తగ్గించాలని కోరుతున్నారు. నిర్మాణాలు ప్రారంభించి ఎనిమిదేళ్లు, పూర్తి అయి నాలుగేళ్లు కావడంతో పాడుబడిన ఇళ్లకు అంత ధర చెల్లించాలా? అని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు విక్రయించడానికి మార్గదర్శకాలతో పాటు ధర నిర్ణయంపై ఈ నెల 16న ఉద్యోగ సంఘాలతో గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కార్పొరేషన్ ఉన్నతాధికారులో కీలక సమావేశం జరుగబోతుంది. ధర తగ్గించైనా ప్రభుత్వానికి గుదిబండగా మారిన రాజీవ్ స్వగృహాలను వదులుకోవాలని భావిస్తుంది.