తెలంగాణ

ప్రాజెక్టులపై కేసుల రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చే ఎన్నికల నాటికి వీటిని పూర్తి చేయాలని భావిస్తుండగా, అదే సమయంలో దాదాపు అన్ని ప్రాజెక్టులపైనా కేసులు ఉన్నాయి. ప్రతి కేసులోనూ కాంగ్రెస్ నాయకులు ఉన్నారనీ దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అధికార పక్షం భావిస్తోంది. పాలమూరు- రంగారెడ్డి ద్వారా దక్షిణ తెలంగాణను, కాళేశ్వరం ద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా కోటి ఎకరాలకు సాగునీటిని ఇచ్చి చూపిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. అన్ని ప్రాజెక్టులపైనా కాంగ్రెస్ నాయకులే కేసులు వేయించారని, ప్రాజెక్టులు- కేసులు, కాంగ్రెస్ నేతల పాత్రపై జనంలోకి తీసుకు వెళ్లడం గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్యుల సమావేశంలో చర్చించారు.
తాజాగా గ్రీన్ ట్రిబ్యునల్ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలకు వివరిస్తామని అధికార పక్షం చెబుతోంది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే మంచినీటి సరఫరా పనులు చేస్తున్నట్టు, దీనికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదించింది. అయితే ఈ కేసులో నిర్వాసితులకు పరిహారం అనే సమస్య ఏమీ లేనప్పటికీ స్టే అనే ప్రచారం జరగగానే మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పందిస్తూ నిర్వాసితులకు అన్యాయం జరగవద్దనే ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందంటూ ప్రకటన జారీ చేశారు. దాదాపు ఆరువందల ఎకరాల అటవీ భూముల్లో పనులకు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన హర్షవర్ధన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కరవుతో అల్లాడే పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన నాయకులే ట్రిబ్యునల్‌కు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోందని అధికార పక్షం విమర్శిస్తోంది.
ప్రాజెక్టుల నిర్మాణానికి జివో 123 ద్వారా భూ సేకరణ జరుపుతుంటే దీనికి వ్యతిరేకంగా 29 రిట్‌పిటిషన్లు దాఖలు అయినట్టు అధికార పక్షం తెలిపింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ఐదు పిల్స్ దాఖలు అయ్యాయి. డిండి ప్రాజెక్టుపైన ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టుపైన ఒక పిటిషన్ దాఖలైంది. జివో 123పై దాఖలైన 29 పిటిషన్లలో మల్లన్నసాగర్‌పై పది, పాలమూరు రంగారెడ్డిపై ఎనిమిది, మిడ్‌మానేరు గౌరవల్లిపై మూడు అనంతగిరి రిజర్వాయర్ పరిధిలో రెండు పిటిషన్లు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో రెండు కేసులు వేశారు. హైకోర్టులో పిల్ వేసిన వారిలో బిజెపి నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి కూడా ఉన్నారు. ఆయన తరఫున న్యాయవాదిగా కాంగ్రెస్ నాయకులు బి నరసింహారెడ్డి కుమార్తె రచనారెడ్డి వాదిస్తున్నారని అధికార పక్షం తెలిపింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌కు చెందిన కెకె మహేందర్‌రెడ్డి కేసులు వేశారు. కెకె మహేందర్‌రెడ్డి ఆరు కేసులు, పేరి ప్రభాకర్, రచనారెడ్డి, వంగ అని కేసులు వేశారు. చనిపోయిన వారి పేరు మీద కూడా కేసులు వేశారని అధికార పక్షం ఆరోపణ. మల్లన్నసాగర్‌పై దామోదర రాజనర్సింహ సన్నిహితులు పి జనార్దన్ కేసు వేశారు. టిడిపి కార్యకర్త దామోదర్‌రెడ్డి భార్య నాగజ్యోతి కాంగ్రెస్ మద్దతుతో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసు వేశారని ఆరోపించారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో కేసులు వేసిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ అనుచరులు బడకల్ పవన్ కుమార్ ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ నేత హర్షవర్ధన్‌రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారని అధికార పక్షం తెలిపింది. మంచినీటి సరఫరా పనులకు సైతం ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులు పూర్తయితే తమకు రాజకీయంగా సమాధి తప్పదనే భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోందని అధికార పక్షం వాదన.
ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అధికార పక్షం భావిస్తోంది. ముందు కేసుల చిక్కు ముడి నుంచి బయటపడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తరువాత ఏ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు ఏ విధంగా కేసులు వేశారో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కేసుల వల్ల మూడు నాలుగు నెలలు ఆలస్యం కావచ్చు, నాలుగు నెలలు పని నిలిచి పోవచ్చు అంతే తప్ప ప్రాజెక్టుల నిర్మాణం మాత్రం ఆగదు అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రాజెక్టుల కేసుల ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పారు.