ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్‌లో ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 18: ఏపి ఎంసెట్-2017ను తొలిసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ బాధ్యతలను టిసిఎస్, ఏపి ఆన్‌లైన్‌కు ప్రభుత్వం అప్పగించింది. కాకినాడ జెఎన్‌టియు ప్రవేశ పరీక్షల పర్యవేక్షణ బాధ్యతలను వహిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 39 ప్రవేశ పరీక్షా కేంద్రాలను, అలాగే హైదరాబాద్‌లో మరో 3 కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. అవసరమైతే పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో అధికారులున్నారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 24,25,26,27 తేదీల్లో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 28న పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2.30నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రాల్లో 40 వేల కంప్యూటర్లు
ఆన్‌లైన్ పరీక్ష కోసం పరీక్షా కేంద్రాల్లో సుమారు 40వేల కంప్యూటర్లను ఏర్పాటుచేస్తున్నారు. టిసిఎస్, ఏపి ఆన్‌లైన్ సంస్థలు ఈ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 9వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గతేడాది ఎంసెట్‌కు 350 రూపాయలు ఫీజు వసూలు చేయగా, ఈ ఏడాది ఫీజు 450 రూపాయలుగా నిర్ణయించారు. ప్రతీ విద్యార్థి వివరాలను ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక కంప్యూటర్‌ను కేటాయిస్తారు. అది కూడా ‘క్యాండిడేట్ స్పెసిఫిక్ టెర్మినల్’ పేరుతో ఎవరికి నిర్దేశించిన కంప్యూటర్‌ను వారే వినియోగించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రానికి వెళ్ళిన తరువాత పాస్‌వర్డ్‌ను విద్యార్థికి ఇస్తారు. పరీక్ష రాసే సమయంలో సదరు కంప్యూటర్‌లో మిగిలిన సాఫ్ట్‌వేర్ మొత్తం నిర్వీర్యం అవుతుంది. ఎవరైనా విద్యార్థికి పరీక్ష మధ్యలో కంప్యూటర్ మొరాయించిన పక్షంలో, కంప్యూటర్ పనిచేయని సమయాన్ని పరిగణలోకి తీసుకుని, మరో కంప్యూటర్‌ను కేటాయిస్తారు. కోల్పోయిన సమయాన్ని తిరిగి కేటాయిస్తారు. ప్రశ్నలను తెలుగు, ఆంగ్లంలో ఇస్తారు. అలాగే విద్యార్థుల ఉపయోగార్ధం రఫ్ పేపర్లను వారి పేరుమీద అందజేస్తారు. గతంలో ఆఫ్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు జరిగినపుడు విద్యార్థులు పెన్నుతో డాట్స్ పెట్టేవారు! పొరపాటున డాట్‌ను ఒకచోట పెట్టాల్సింది మరోచోట పెట్టినట్టయితే, దిద్దివేత సమయంలో మార్కులు కోల్పోయి విద్యార్థులకు నష్టం వాటిల్లేది. ఇపుడు ఆన్‌లైన్‌లో పరీక్ష కావడంతో ప్రశ్నలకు జవాబులను మార్చుకునే అవకాశం (దిద్దివేత) ఉంటుంది. కాగా ఏటా మాదిరిగానే పరీక్ష జరిగిన రోజే కీని వెబ్‌సైట్‌లో ఉంచుతారు. విద్యార్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించి, నిపుణులచే వాటిని పరిశీలిస్తారు. తర్వాతే ఫైనల్ కీ విడుదల చేస్తారు. మే 8వ తేదీకి ఫలితాలను విడుదల చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఎంసెట్-2017 కన్వీనర్, కాకినాడ జెఎన్‌టియు రిజిస్ట్రార్ ఆచార్య సిహెచ్ సాయిబాబు ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ఈ సంవత్సరం ఇంజనీరింగ్‌కు సుమారు 2 లక్షల 20వేల మంది, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సుమారు 70వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నంత మాత్రానే విద్యార్థులు ఏ విధమైన ఇబ్బంది పడాల్సిన పనిలేదని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆచార్య సాయిబాబు తెలియజేశారు.