రాష్ట్రీయం

వాస్తవిక బడ్జెట్‌కే ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: బడ్జెట్ రూపకల్పనపై సిఎం కె చంద్రశేఖర్‌రావు శనివారం నుంచి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశాలు ప్రారంభించారు. మూడు రోజులపాటు సమావేశాలు జరుగుతాయని అధికారులు అంటున్నారు. మార్చి 8నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 8న గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 10న బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. 2016-17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లక్షా 35వేల కోట్లుకాగా, దాదాపు లక్షా నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తేలింది. చివరి నెలను కలుపుకుని లక్షా ఐదు వేల కోట్ల వరకు తేలవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. మొదటిసారిగా కేంద్రం ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ రూపకల్పనలో సులభమైందని అధికారులు అంటున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, వ్యయంపై స్పష్టమైన అవగాహన ఉన్నందున వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా బడ్జెట్‌కు రూపకల్పన చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈసారి బడ్జెట్‌లో కుల వృత్తుల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. మత్స్య కారులు, గొర్రెల పెంపకం దారులు, చేనేత వృత్తి పనివారికి బడ్జెట్‌లో వరాలు ప్రకటించనున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చేలా బడ్జెట్ రూపకల్పనకు సిఎం కెసిఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గత ఏడాది సైజుకన్నా పెద్దగా ఈసారి బడ్జెట్ ఉండదని అధికారులు సూత్రప్రాయంగా వెల్లడించారు. కరెన్సీ రద్దువల్ల ఆశించిన స్థాయిలో ఆదాయంలో వృద్ధిలేదని, దానికి తగ్గట్టుగానే బడ్జెట్ గత ఏడాదికన్నా స్వల్ప పెరుగుదల మాత్రమే ఉంటుందని అధికారుల వాదన. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన నెల రోజుల తరువాత రాష్ట్రం బడ్జెట్ పెడుతున్నందున కేంద్రం నుంచి ఏ శాఖకు ఏవిధంగా నిధులు అందుతాయో స్పష్టత వచ్చింది. మంత్రులంతా తమ తమ శాఖల డిమాండ్లను దీనికి అనుగుణంగా రూపొందించి, ఆర్థిక శాఖకు అందించారు. నీటిపారుదల శాఖకు ముందుగా ప్రకటించినట్టుగానే 25వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. సంక్షేమ పథకాలకు గత ఏడాది మాదిరిగానే వ్యయం చేయనున్నారని, అయితే ఈసారి కుల వృత్తులకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు. 75 శాతం సబ్సిడీతో పెద్దఎత్తున గొర్రె పిల్లల పంపిణీ చేపట్టనున్నారు. శాఖలవారీగా మంత్రులు అందజేసిన నివేదికలను అధికారులు సిఎంకు శనివారం అందించారు. ఈసారి పంటలు బాగా ఉంటాయని, ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నోట్ల రద్దుతో తక్షణం ఆదాయం కొంతపడిపోయినా, పన్నుల ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగితే రాష్ట్రానికి ఆ మేరకు వాటా పెరుగుతుందన్నది అంచనా.