రాష్ట్రీయం

శివశంకర్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ పుంజుల శివశంకర్ సోమవారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన శివశంకర్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శివశంకర్ మృతి పట్ల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు. సమాచారం తెలియడంతోనే సిఎం కె చంద్రశేఖర్ రావు హుటాహుటిన శివశంకర్ నివాసానికి వెళ్ళి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. శివశంకర్ కుటుంబీకులకు సానుభూతి ప్రకటించారు. శివశంకర్ మృతిపట్ల ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని వ్యాఖ్యానిస్తూ, శివశంకర్ కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
న్యాయవాద వృత్తినుంచి అంచెలంచెలుగా..
1929 సంవత్సరం ఆగస్టు 10న హైదరాబాద్ నగర శివారులోని మామిడిపల్లిలో జన్మించిన శివశంకర్ హిందూ కళాశాలలో బిఎ, ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌బి విద్యాభ్యాసం చేశారు. ఆయన భార్య పి లక్ష్మీభాయి దేశంలోనే రెండు ‘డి.లిట్’లు చేసిన ఏకైక మహిళగా ఖ్యాతి గడించారు. శివశంకర్ న్యాయవాదిగా, ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. 1979లో సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1985లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989-91 మధ్యకాలంలో రాజ్యసభలో విపక్ష నేతగా వ్యవహారించారు. 1994లో సిక్కిం గవర్నర్‌గా నియమితులయ్యారు. అనంతరం కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో తెనాలి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికై, కాంగ్రెస్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎదురులేని మనిషిగా, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి పాటుపడే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాల్లో స్థానం సంపాదించడమే కాకుండా వారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరయ్యారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె మంత్రివర్గంలో కీలకమైన విదేశీ వ్యవహారాలు, న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా పని చేశారు.
కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్‌కు..
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా గుర్తింపు తెచ్చుకుని వివిధ పదవుల్లో రాణించిన శివశంకర్ 2004లో ఆ పార్టీని వీడి 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆయన కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ గూటికే చేరాల్సి వచ్చింది. అయితే వయోభారం, అనారోగ్యం కారణంగా పార్టీకి, రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. కాగా తన రాజకీయ వారసునిగా కుమారుడు సుధీర్ కుమార్‌ను తీసుకొచ్చారు. ఒక దఫా ఎమ్మెల్యేగా గెలిపించుకున్నా, తర్వాత దురదృష్టవశాత్తు కుమారుడు మరణించారు. ఇటీవల కోడలు అలేఖ్య పుంజాలకు కూచిపూడి నృత్యంలో పద్మశ్రీ అవార్డు లభించింది.
అధికార లాంఛనాలతో..
తెలుగు బిడ్డ శివశంకర్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను ఆదేశించారు. కేంద్ర మంత్రిగా, న్యాయమూర్తిగా, గవర్నర్‌గా, బిసి నాయకుడిగా శివశంకర్ ప్రజలకు ఎన్నో సేవలందించారని సిఎం కెసిఆర్ కొనియాడారు.
బిజెపి నేతల సంతాపం
మాజీ గవర్నర్, న్యాయకోవిదుడు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన పి శివశంకర్ మృతి తెలంగాణ ప్రజలకు తీరని లోటని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర నేతలు ఎన్ ఇంద్రసేనారెడ్డి, జి కిషన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో శివశంకర్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

చిత్రం..శివశంకర్‌కు నివాళులర్పిస్తున్న సిఎం కెసిఆర్ తదితరులు