ఆంధ్రప్రదేశ్‌

ఎవరు అడ్డుపడ్డా ఆగేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 1: రాష్ట్ర అభివృద్ధి విషయంలో, రాజధాని నిర్మాణం విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడ్డా ఆగేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానికి భవిష్యత్తులో ఎప్పటికీ వరద ముప్పు రాకుండా చూస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని చారిత్రక సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొండవీటి వాగు వరద నీటి ఎత్తిపోతల పథకానికి సిఎం చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. రాజధాని గ్రామాలను ఏటా ముంచెత్తుతున్న కొండవీటి వాగుకు పలు ప్రాంతాల్లో డైవర్షన్ స్కీములు ఏర్పాటు చేయాలని సింగపూర్ మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో నిపుణులైన ఇంజనీర్ల పరిశీలన అనంతరం సీతానగరం వద్ద బకింగ్‌హాం కెనాల్‌లోకి నీటిని మళ్లించేందుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొండవీటి వాగు వల్ల ఇప్పటి వరకు ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని, ఇకపై ఇదే కొండవీటి వాగు ద్వారా ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. గత నూరేళ్లుగా పంటలు దెబ్బ తినడంతో పాటు గ్రామాలను వరద నీరు ముంచెత్తిందని గుర్తుచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ వాగుకు తోడయ్యే మరికొన్ని వాగులను కలిపి క్యాచ్‌మెంట్ ఏరియాగా గుర్తించడంతో పాటు అక్కడ రిజర్వాయర్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా ఐదువేల క్యూసెక్కుల నీటిని అదనంగా కృష్ణాడెల్టా కాల్వలకు తరలిస్తామని వివరించారు. గతంలో తాము 90లక్షల నిధులతో విస్తరణ పనులు చేపట్టామని, అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముంపు సమస్యను గాలికొదిలేసిందని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33వేల 500 ఎకరాల భూములు అందించారని, ఇది చరిత్రాత్మకమన్నారు. రైతుల, ప్రజల విశ్వసనీయతను తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణం జరక్కుండా ఉండేందుకు కొండవీటి వాగుతో పాటు మరికొన్ని చిన్న సమస్యలను ఉటంకిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టులో రైతులచే కేసులు వేయించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవటంతో తిరిగి రైతులను ఏదోరకంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయినా రైతులు విజ్ఞత ప్రదర్శించారని ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణమే తమ లక్ష్యమని ప్రకటించారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పనులను మూడు నెలల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలనూ రాజకీయం చేస్తున్నారు
ప్రతిపక్ష వైసిపి రోడ్డు ప్రమాదాలను సైతం రాజకీయం చేయటం దౌర్భాగ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్‌కు నోరుతెరిస్తే సెంట్రల్ జైలు తప్ప మరొకటి గుర్తుకురావటం లేదని నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ఇలాంటి వారి వల్ల నష్టం జరుగుతుందన్నారు. ప్రమాదానికి కలెక్టర్‌కు, పోలీసులకు లింకేమిటని ప్రశ్నించారు. గత రెండున్నరేళ్లుగా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో కృష్ణాడెల్టాలో ఎకరానికి 50 నుంచి 60బస్తాల దిగుబడి రావడం శుభ పరిణామమన్నారు. కొండవీటి వాగు ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని వెల్లడించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా పరిష్కారానికి నోచుకోని కొండవీటి వాగు ముంపు నియంత్రణకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కనుగొందన్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, ఎంపి గల్లా జయదేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, మంగళగిరి మునిసిపల్ చైర్మన్ గాంధీ చిరంజీవి, ఇరిగేషన్‌శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ తదితరులు మాట్లాడుతూ రైతుల కల నేటికి నెరవేరిందన్నారు. గుంటూరు కలెక్టర్ కాంతీలాల్ దండే, ఇఎన్‌సి వెంకటేశ్వరరావు, సిఇ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... కొండవీటి వాగు
ఎత్తిపోతల పథకం శంకుస్థాపన స్థూపం ఆవిష్కరించిన
ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు