రాష్ట్రీయం

ఆరుతడి... తడారుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 9: తెలంగాణ, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి సకాలంలో సాగర్ జలాలు అందక కృష్ణా, ప.గో జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల్లోని పత్తి, పొగాకు, మిర్చి, తదితర ఆరుతడి వాణిజ్య పంటలు ఎండుముఖం పడుతుండటంతో రైతాంగం కలవరం చెందుతున్నది. నాట్ల సమయంలో జనవరిలో అదీ కేవలం 10 రోజులపాటు 2.5 టిఎంసిల నీరు సరఫరా జరిగింది. ఆ నీరు ఏ మాత్రం సరిపోకపోవటంతో జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణమూర్తి నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును కలిసి, పరిస్థితిని వివరించినప్పుడు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6వ తేదీ వరకు కనీసం 3.5 టిఎంసిల నీరు వదలాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కంటితుడుపులా గత నెల 20 నుంచి 24 వరకు మాత్రమే నీటిని విడుదల చేసి ఆపై సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీనిపై తిరిగి రెండుసార్లు బోర్డు అధికారులను సంప్రదించినప్పటికీ ఫలితం కన్పించడం లేదు. ఖమ్మం జిల్లా పాలేరు దిగువ 102 కిమీ నుంచి సాగర్ మూడో జోన్ ప్రారంభమవుతుంది. దీనికింద కృష్ణాలో నూజివీడు, మైలవరం, తిరువూరు, గన్నవరం, నందిగామ, ప.గో జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఇదిలాఉంటే ఈ ప్రాంతంలో సాగర్ జలాలపై ఆధారపడ్డ మంచినీటి చెరువులు కూడా నీరు లేక అడుగంటి వెలవెలపోతూ కన్పిస్తున్నాయి.
కృష్ణాజిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 2484 ఆవాస ప్రాంతాలుంటే వీటిల్లో దాదాపు 382 ఎస్‌ఎస్ ట్యాంకులు ఉన్నాయి. వీటిని నింపిన తర్వాత మంచినీటిని గృహావసరాలకు వదలుతారు. వీటిలో చాలావరకు నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. ప్రధానంగా ఇవన్నీ పాతకాలం నాటివి కావటంతో నిల్వ సామర్థ్యం అంతంతమాత్రమే. ఒకసారి నింపితే రెండు నెలలకే ఖాళీ అవుతుంటాయి. గత ఏడాది నీరు-చెట్టు పథకం కింద పనులు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. ఎక్కడా సరిగా పూడిక తొలగించలేదు. నందివాడ మండలంలో అత్యధికంగా 30 చెరువులుంటే కృత్తివెన్నులో 17, బాపులపాడు, ఉంగుటూరులో 11 చొప్పున చెరువులున్నాయి. తక్షణం 0.36 టిఎంసిల నీటిని మంచినీటి అవసరాలకు వదలాలంటూ గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఇప్పటికే జలవనరులశాఖకు లేఖలు రాశారు. రైవస్ కాలువ కింద 271 చెరువులు, బందరు కాలువ కింద 31, కృష్ణా తూర్పు కాలువ పరిధిలో 50 చెరువులున్నాయి. వీటిని సాగర్ జలాలతోనే నింపాల్సి ఉంది. ఇక కాలువలకు వచ్చిన నీటిని చెరువులకు తరలించేందుకు రూ.70 లక్షలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. జనవరి మాసంలో నామమాత్రంగానే సాగర్ జలాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం పులిచింతలలో 0.3 టిఎంసిలు, ప్రకాశం బ్యారేజీలో 2.8 టిఎంసిలు నీరు నిలువ ఉంది. ప్రస్తుతానికి చెరువులు నింపేందుకు 0.36 టిఎంసిల నీరు అవసరం. ఇప్పట్లో వర్షాలు పడే స్థితి లేదు. ఈ ప్రాంతానికి ఇంకా 6.4 టిఎంసిల నీరు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 2వేల క్యూసెక్కులకు మించి రాలేదు. దానివల్ల కాలువల చివరి వరకు నీరు చేరటం లేదు. ఈనెల 10తేదీన సాగర్ జలాశయం నుంచి నీరు విడుదల కాగలదని భావిస్తున్నారు. అదే జరిగితే ఆ నీరు కృష్ణాజిల్లాకు చేరటానికి కనీసం వారం రోజులు పడుతుంది.

చిత్రాలు....సాగర్ జలాలు అందక కృష్ణా జిల్లా ఏకొండూరు మండలంలో ఎండిపోతున్న మొక్కజొన్న, పత్తి పంటలు