రాష్ట్రీయం

నిండుసభలో నేరస్థులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 21: శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన సభలోకి ప్రవేశించిన సమయంలో ‘అవినీతిలో నెంబర్ వన్’.. అంటూ వైసిపి సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబు ఆగ్రహిస్తూ సభలో నేరస్థులు ప్రవేశించటం దురదృష్టకరమన్నారు. రౌడీయిజం తనదగ్గర సాగదని ఆయన హెచ్చరించారు. మంగళవారం ఉదయం బడ్జెట్‌పై వైసిపి సభ్యుడు రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌లో లోటుపాట్లను ఎత్తిచూపారు. ఆయన ప్రసంగించిన అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుకు స్పీకర్ అవకాశమిచ్చారు. దీంతో వైసిపి సభ్యులు పోడియం వద్దకు చేరి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘ఇది మంచి పద్ధతి కాదు. మీకు అవకాశం ఉంటుంది. సభా సంప్రదాయాలను గౌరవించాల’ని వైసిపి సభ్యులను శ్రీనివాసులు కోరారు. వైసిపి సభ్యులు మరింత రెచ్చిపోయి తప్పనిసరిగా సమయం కేటాయించాలని, రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడాల్సింది చాలా ఉందని పట్టుపట్టారు. స్పీకర్ కోడెల జోక్యం చేసుకుంటూ ‘విలువైన సమయాన్ని వృథా చేయొద్దు. మీకు 50 నిమిషాల వ్యవధి ఇచ్చాం’ అన్నారు. అజెండాలోని అంశాలపై ఒకవిడత చర్చించిన తరువాత మరోసారి తిరగేయటం కుదరదని స్పష్టం చేశారు. ‘సభలో కొత్త పద్ధతులొద్దు. మరో ఎమ్మెల్యే మాట్లాడటానికి సమయం ఇస్తాం. రాజేంద్రనాథ్‌రెడ్డితోనే మాట్లాడించుకోండ’ని సలహా ఇచ్చారు. వైసిపి సభ్యులు పోడియం వద్దే భీష్మించి నినాదాలు చేయటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. స్పీకర్ కోడెల అసహనం వ్యక్తం చేస్తూ పంచాయతీ సమావేశాల్లో సైతం రీబ్యాక్ ఉండదని గుర్తుచేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని స్పీకర్ అన్నిసార్లు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రతిపక్షంలో మార్పు రావడం లేదని, హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.
ఈ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ‘ప్రతిపక్షం హుందాగా ప్రవర్తించాలి. సభలో చర్చ జరగాలి. వీళ్లకు స్పీకర్ అంటే గౌరవం లేదు. నలభై ఏళ్లలో ఇంతటి అవినీతికర పార్టీని నేను చూడలేదు. దివాళాకోరుగా వ్యవహరిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. అవినీతిలో నెంబర్ వన్, అభివృద్ధిలో నెంబర్ వన్ అంటూ సభలో తానన్న మాటలను రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకర్‌ను ముఖ్యమంత్రి కోరారు. వైసిపి ఎమ్మెల్యేలు వ్యంగ్యోక్తులు విసురుతున్న నేపథ్యంలో కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ ‘అవినీతిలో మీరు నెంబర్ వన్. అభివృద్ధిలో మేం నెంబర్ వన్’ అన్నారు. దీంతో రెచ్చిపోయిన వైసిపి సభ్యులు ‘అవినీతిలో నెంబర్ వన్.. దొంగబాబు’ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘సహనంతో ఉన్నవాళ్లను కూడా వీళ్లు రెచ్చగొడుతున్నారు. ఇది పద్ధతి కాదు. నోటికొచ్చినట్లు మాట్లాడితే..’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ‘సభలోకి కొందరు నేరస్థులు ప్రవేశించారు. గొడవకు దిగుతూ నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. గిల్లికజ్జాలు పెట్టుకుంటే కుదరదు. గొడవే కావాలనుకుంటున్నారా’ అంటూ ఆగ్రహంతో ముఖ్యమంత్రి ఊగిపోయారు. ‘మీడియా పాయింట్ వద్దకూడా ఇదేరకంగా సిగపట్లు పడుతున్నారు. అక్కడ కూడా మార్షల్స్‌ను పెట్టిస్తా. రౌడీయిజం నాదగ్గర చెల్లదం’టూ ఆయన గద్దించారు. ఆగని వైసిపి సభ్యులు ‘ఓటుకు నోటు’ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ అవన్నీ చర్చించేందుకు శాసనసభ వేదిక కాదని, అవినీతిపై చర్చకు మీరు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు.