రాష్ట్రీయం

టిటిడిలో భారీ స్కాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 21: శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు నకిలీ విఐపి టికెట్లు అందించి అడ్డదారుల్లో కోట్లు దండుకున్న వారి పాపం పండింది. తిరుమల వన్‌టౌన్ సిఐ వెంకటరవి ఈ దళారీల ముఠా గుట్టు రట్టు చేశారు. తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వీరికి అన్ని రకాలుగా సహకరించిన టిటిడిలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ధర్మయ్య పరారీలో ఉన్నాడు. రిమాండ్‌లో ఉన్న నిందితులను మరోమారు కస్టడీలోకి తీసుకుని ఈ మొత్తం వ్యవహారం వెనుక మరెవరైనా పెద్దల పాత్ర ఉందేమో ఆరా తీసేందుకు తిరుమల పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రూ.500 విలువ చేసే ఒక్కో టిక్కెట్టుకు ఈ మోసగాళ్లు రూ.4000 నుంచి రూ.5000 వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నకిలీ లెటర్‌ప్యాడ్‌లు, టికెట్లను తయారు చేయించడానికి వినియోగించిన కంప్యూటర్లతో పాటు 480నకిలీ డోనర్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారిని సమీపం నుంచి దర్శించుకోవాలని ప్రతి భక్తుడు ఆశిస్తాడు. భక్తుల ఈ బలహీనతను ఆసరా చేసుకుని విఐపి దర్శనాలంటేనే భారీ వ్యాపారంగా మారింది. టిటిడిలో పరపతి ఉన్న అధికారులను, ఉద్యోగులను దళారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఏటా స్వామివారి బడ్జెట్ రూ. 2,400కోట్లయితే, ఈ అక్రమ వ్యాపారంతో దళారీల దగ్గర నుంచి పరపతి ఉన్న టిటిడి అధికారులు, ఉద్యోగులు జరిపే వ్యాపారం రూ. 5వేల కోట్ల పైమాటే ఉంటుందన్న అంచనా పోలీసులు వేస్తున్నారు. కాగా, రూ.10 లక్షలు నుంచి రూ.కోటి వరకు విరాళాలిచ్చే దాతలకు ఎల్-2 దర్శన సౌకర్యం కల్పిస్తామని టిటిడి ప్రకటించింది. ఈ నేపథ్యంలో దళారీలు నకిలీ డోనర్ పుస్తకాలను ముద్రించారు. మార్చి 11వ తేదీ ఉదయం డోనర్‌ల జాబితాలో 23మంది ఐదు బృందాలుగా ఎల్-2లో స్వామివారిని దర్శించుకునేందుకు నకిలీ టికెట్లతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించారు. ఆంధ్రాబ్యాంక్ సిబ్బంది స్కాన్ చేసినప్పుడు అవి నకిలీ టికెట్లని గుర్తించారు. దీంతో విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఆ భక్తులను పోలీసులకు అప్పగించి విచారణ ప్రారంభించడంతో కుంభకోణం గుట్టు రట్టయ్యింది. తిరుమల డిఎస్పీ మునిరామయ్య ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేశారు.
కంప్యూటర్ పరిజ్ఞానంలో నైపుణ్యం ఉన్న బీదర్‌కు చెందిన కరణం వేణుగోపాల్, అలియాస్ కులకర్ణిని, తిరుపతికి చెందిన వెంకటేష్ రాజు అలియాస్ రాజు, కె.వెంకటాచలపతి అనే దళారీలను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిచ్చిన సమాచారం మేరకు తిరుపతికి చెందిన వెంకటరమణ, పార్థసారథి అలియాస్ పవన్‌కుమార్, నాగభూషణం అలియాస్ భూషణం, విజి నాయుడు, గణేష్, శ్రీనివాసులు అలియాస్ శ్రీను, రాజ అలియాస్ రాజులను మంగళవారం అరెస్ట్ చేశారు.
ఈసందర్భంగా డిఎస్పీ మునిరామయ్య ఒక ప్రకటనలో వివరాలు తెలియజేస్తూ ఈ ముఠా వెనుక గతంలో జెఇఓ కార్యాలయంలో పనిచేసిన సూపరింటెండెంట్ ధర్మయ్య సహకారం ఉందని రూఢీగా తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారన్నారు. ధర్మయ్య సహకారంతో పలువురు ఐఏఎస్ అధికారులకు సంబంధించి లెటర్‌ప్యాడ్లు తయారు చేసి విఐపి దర్శన టికెట్టు పొందేవారని, ఒక్కో టికెట్టును రూ.4వేల నుంచి రూ.5వేల వరకు విక్రయించేవారని, వచ్చిన సొమ్మును అందరూ పంచుకునే వారన్నారు. 2015 ఆగస్టులో నకిలీ లెటర్ల ద్వారా 13టికెట్లు పొందడానికి ఈ ముఠా ప్రయత్నించిందన్నారు. అయితే అది ఇబ్బందికరంగా మారడంతో నకిలీ డోనర్ పాస్ పుస్తకాలను తయారు చేసి టిటిడి దాతలకు కల్పిస్తున్న ఎల్-2 బ్రేక్ దర్శనం టికెట్లను పొందాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో బీదర్‌కు చెందిన కరణం వేణుగోపాల్ తనకు పరిచయం ఉన్న పుత్తూరుకి చెందిన పరంధామయ్య ద్వారా ఒరిజినల్ డోనర్ పుస్తకాన్ని, కోయంబత్తూరుకి చెందిన డోనర్ పాస్ బుక్‌ను సంపాదించాడు. వీటిని హైదరాబాదుకు చెందిన మురహరి అలియాస్ మురారి అనే వ్యక్తికి మెయిల్ ద్వారా పంపించి నకిలీ పుస్తకాలు తయారు చేయించారు. 1500 నకిలీ డోనర్ పుస్తకాలను మురారి తయారు చేయించి వేణుగోపాల్‌కు అందించాడు. వేణుగోపాల్ తనవద్ద ఉన్న లాప్‌టాప్, కలర్ ప్రింటర్ సహాయంతో అన్నదానం, గోసంరక్షణశాల డైరెక్టర్ల సంతకాలను ఫోర్జరీ చేసి, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు సంతకాన్ని, స్టాంప్‌ను స్కాన్ చేసి ఒరిజినల్ డోనర్ పుస్తకం నుంచి కోరల్‌డ్రా ప్రోగ్రామ్ ద్వారా నకిలీ డోనర్ పుస్తకాలపై ముద్రించారు. వాటిని దళారులైన వెంకటేష్, తిరుపాల్ నాయక్, పరంధామయ్య, పార్థసారథి, గణేష్‌ల ద్వారా భక్తులకు విక్రయించేవారు. రూ. 10లక్షలు విరాళం ఇచ్చిన దాతల పేర్లతో మరో 20పుస్తకాలను ముద్రించి ఎల్-2 బ్రేక్ దర్శనాన్ని భక్తులకు అధిక మొత్తానికి విక్రయించేవారు. కాగా ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ ఏడాది జనవరి 1 నుంచి దాతలకు పాస్ పుస్తకాలతో పనిలేకుండా ఆన్‌లైన్ ద్వారా వన్‌టైం పాస్‌వర్డ్‌ను పంపి దర్శన టికెట్లు పొందే సౌకర్యాన్ని కల్పించింది. ఈ పరిస్థితిని గమనించిన వేణుగోపాల్ తన పరిజ్ఞానంతో బార్‌కోడ్‌ను సైతం స్కాన్ అయ్యేలా చేసి ఆన్‌లైన్లో డోనర్ టికెట్లు పొందినట్లుగా నకిలీ టికెట్లు తయారు చేశాడు. ఈ టికెట్లను దళారుల ద్వారా మార్చి 11న భక్తులకు విక్రయించాడు. పోలీసులు వేణుగోపాల్‌ను అరెస్టు చేసి అతని వద్ద ఉన్న ల్యాప్‌టాప్ రెండు ప్రింటర్లు, ఉపయోగించని 80 డోనార్ పాస్‌పుస్తకాలు, 400 ఖాళీ డోనర్ పుస్తకాలను సీజ్ చేశారు. వీరితోపాటు మరో 8మంది దళారీలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. టిటిడి చరిత్రలో బయటపడ్డ కుంభకోణాల్లో అతి పెద్దదయిన ఈ కేసును చేధించడంలో తిరుమల టు టౌన్ సిఐ వెంకటరవి, ఎస్‌ఐఎం తులసీరాం, ఏఎస్‌ఐ సాయిబాబా, వన్‌టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ, తిరుమల క్రైం ఎస్‌ఐ ఈశ్వర్, సాంకేతిక పర్యవేక్షణ బృందానికి చెందిన సిబ్బంది ఉమాశంకర్, గోపికృష్ణ, వెంకటేష్, రామచంద్ర, హెడ్ కానిస్టేబుల్‌లు వెంకటముని, రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్‌లు తిరుపతిరావు, మునేంద్రబాబు, గణేష్, శ్రీనివాసమూర్తి, సుబ్రమణ్యంలు కీలక పాత్ర పోషించారు. వీరిని తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి అభినందించారు.