రాష్ట్రీయం

పాపం పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా శాసన సభ సమావేశాలు జరగడం ప్రజా ప్రతినిధుల్లో, స్థానికుల్లో ఆనందం మాట ఎలా ఉన్నా భద్రతా సిబ్బందికి పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బందోబస్తుకోసం 13 జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 3వేల మంది పోలీసుల్లో అత్యధికులు సకాలంలో తిండి, కొద్దిసేపైనా నిద్ర, కనీసం స్నానం చేసే సదుపాయం లేక అల్లాడిపోతున్నారు. శాసనసభ భవనాలకు కూతవేటు దూరంలోనే వారు బహిరంగ మలమూత్ర విసర్జనకు దిగాల్సి రావటం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అపహాస్యం పాలుచేస్తోంది. ఏసి కార్లలో వచ్చే ప్రజాప్రతినిధులు నేరుగా సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ కూడిన సభల్లోకి లేదా తమ కార్యాలయాల్లోకి వెళుతుంటే.. వారికి రక్షణగా వచ్చే సాయుధ పోలీసులు వెలుపల మండుటెండలో మాడిపోతున్నారు. టిఎ, డిఎల చెల్లింపులూ ఒకేలా లేకపోగా వారి జిల్లాల ఎస్పీల ఇష్టాఇష్టాలపై ఆధారపడుతున్నారు. నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు డిఎస్పీలు, ఆరుగురు సిఐలు, 18 మంది ఎస్‌ఐలు, 26 మంది ఎఎస్‌ఐలతోసహా మొత్తం 166 మంది వచ్చారు. సాధారణంగా అక్కడ టౌన్ పోలీసులు ఆరు కి.మీలు దాటితే రోజుకు రూ.125లు, రూరల్ పోలీసులు 8 కి.మీలు దాటితే రూ.200ల చొప్పున భృతి చెల్లిస్తుంటే 15రోజులుగా ఇల్లూవాకిలి వదిలి అమరావతికి వచ్చిన వారికి మాత్రం అదనపు భత్యాలు లేవంటున్నారు. వీరిలో కొందరికి స్థానిక పోలీస్ అధికారులు, పాఠశాలలు, ఖాళీ ప్రభుత్వ భవనాల్లో ఆశ్రయం కల్పిస్తే అక్కడ ఉండలేనివారు విజయవాడ, గుంటూరు, మంగళగిరి లాడ్జీల్లో మడత మంచాలను ఆశ్రయిస్తున్నారు. భోజనాలు, అల్పాహారాలకు రోజుకు కనీసం ఐదారు వందలకు పైగానే ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇక్కడకు వచ్చే సమయంలో కొందరు ఖర్చుల కింద 2వేలు లేదా 3వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నా ఆ తర్వాత జీతంలో మినహాయిస్తున్నారంటూ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధి ఎదుట వాపోయారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చినవారికి కూడా టిఎ, డిఏలు లేవు. అదేమని ప్రశ్నిస్తే ‘ఇక్కడ చేసే డ్యూటీనే అక్కడ చేస్తున్నారు.. ఇంకేమి కావాల’ని తమ ఉన్నతాధికారులు గర్జిస్తున్నారంటూ వాపోతున్నారు.
ఇక శాసనసభ, శాసనమండలిలో విధులు నిర్వర్తించే దాదాపు వంద మంది మార్షల్స్ బాధలు చెప్పనలవికావు. ఉదయం 8 గంటల నుంచి సభ ఆ రోజుకి వాయిదా పడేవరకు వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. విశాఖ జిల్లా నుంచి వచ్చిన ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుళ్లు నయాపైసా డిఏకు నోచుకోవటం లేదు.
అసెంబ్లీ భవనాల పరిసరాల్లో బందోబస్తు నిర్వర్తించేందుకు నెల్లూరు, కడప, కర్నూలు నుంచి ఎపిఎస్‌పి బెటాలియన్‌ల నుంచి దాదాపు 200 మందికి పైగా రాగా, వీరందరికీ కూతవేటు దూరంలోనే రేకుల షెడ్లు ఏర్పాటుచేసి అక్కడ వసతి కల్పించారు. మండుటెండలో పగలు, ఆపై రాత్రి కూడా అందులో ఒక నిముషం నిద్రపోటానికి సాధ్యపడటం లేదు. స్నానపు గదులు లేవు. ఆపై మరుగుదొడ్లు కూడా లేవు. గతంలో అక్కడ పనిచేసే ఎల్ అండ్ టి కంపెనీ కార్మికులకోసం ఏర్పాటైన పెద్ద తొట్టెలో మోటార్ల ద్వారా నీటిని నింపుతుంటే వారితోపాటే అందరూ క్యూలైన్‌లో నిలబడి స్నానం చేయాల్సి వస్తోంది. మరుగుదొడ్లు లేక చెట్లచాటున బహిరంగంగా మలవిసర్జన చేస్తున్న తీరు చూస్తుంటే స్వచ్ఛాంధ్ర నినాదం అపహాస్యం పాలవుతోంది. తొలిరోజుల్లో మంచినీటి సదుపాయం లేదు. ప్రధాన గేట్లు దగ్గర ఉన్నవారు సైతం లోపలికి వెళ్లి దాహార్తి తీర్చుకోటానికి ఉన్నతాధికారులు అడ్డుపడటంతో తొలిరోజుల్లో తమ వెంట వాటర్ బాటిళ్లను తెచ్చుకోవాల్సిరాగా తాజాగా వెలుపల మంచినీటి సదుపాయం కల్పించినప్పటికీ ఎండవేడిమికి వేడినీరు తాగాల్సి వస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి సిఎం నివాస గృహం మీదుగా కరకట్ట పొడవునా దాదాపు 88 కి.మీల పొడవునా అడుగడుగునా రాత్రి, పగలు బందోబస్తు కొనసాగుతుంటే వీరికి విశ్రాంతికోసం అక్కడక్కడ టెంట్లు ఏర్పాటుచేసినా మంచినీటి సదుపాయం కాని, మరుగుదొడ్ల సౌకర్యం కాని లేవు. అయితే క్రమశిక్షణ పేరుతో తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ తమనోళ్లు నొక్కేస్తున్నారంటూ ప్రతిఒక్కరూ వాపోతున్నారు. కొందరు ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో తమప్రాంత సిబ్బందికి మధ్యాహ్న సమయంలో భోజన ప్యాకెట్లు అందజేస్తున్నారు. డిజిపి నండూరి సాంబశివరావు హయాంలో కొంతమేర అమలవుతున్న సంక్షేమ పథకాలు ఊరట నిస్తుండటం వల్లనే నోరు మెదపలేకపోతున్నామని చెబుతున్నారు.
ఇక అసెంబ్లీ సమావేశాలకు వివిధ జిల్లాల నుంచి డ్యూటీకి వచ్చే ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి వారి జీతాలను బట్టి టిఎ, డిఎలు వస్తున్నాయి. ఆశ్చర్యకర విషయమేమంటే ఐదేళ్లకోసారి ఎన్నికల డ్యూటీకెళ్లే ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ ముగిసినప్పటికీ అదేరోజు టిఎ, డిఎ చేతికందే వరకు బ్యాలెట్ బాక్స్‌లను వాహనాల్లోకి ఎక్కించరు. పాపం! పోలీసుల పరిస్థితి అందుకు భిన్నంగా వుంది.

చిత్రాలు..పోలీసుల కోసం వేసిన షెల్టర్లు * సదుపాయం లేని ఒకే హాలులో అవస్థలు