రాష్ట్రీయం

సత్యానిదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 31: ‘వంద మంది దోషులు తప్పించుకోవచ్చు గాని, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు’ అనేది న్యాయశాస్త్ర వౌలిక సూత్రం. అయితే ఇక్కడ ఓ నిర్దోషి ఎనిమిదేళ్ళు జైలుజీవితం గడిపాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సత్యంబాబును శుక్రవారం హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దర్యాప్తు అధికారుల తీరును తప్పుబడుతూ, సత్యంబాబుకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇక్బాల్ బాషా, శంషాద్‌బేగం దంపతుల కుమార్తె ఆయేషామీరా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కళాశాలలో బి ఫార్మసీ చదువుతూ అక్కడే శ్రీ దుర్గా హాస్టల్‌లో ఉండేది. దురదృష్టవశాత్తు 2007 డిసెంబర్ 26న హాస్టల్‌లోనే హత్యకు గురైంది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసు నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఆయన క్యాబినెట్‌లోని మున్సిపల్ మంత్రి కోనేరు రంగారావు మనుమడి ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. న్యాయవాద వర్గాలు, ప్రజా, పౌర సంఘాలు, ప్రతిపక్ష తెలుగుదేశం, ఆయేషా తల్లిదండ్రులు ఇలా అన్ని వర్గాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశాయి. జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది కూడా. కమిషన్ సభ్యురాలైన నిర్మలా వెంకటేశన్ నగరానికి చేరుకుని న్యాయ విచారణ చేపట్టారు. కోనేరు మనుమడితోపాటు, హాస్టల్ వార్డెన్ ఐనంపూడి పద్మ, ఆమె భర్త కృష్ణారావు ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నిందితులను గుర్తించే పనిలో భాగంగా పోలీసులు.. గుర్వీందర్ సింగ్ అలియాస్ లడ్డూ అనే చైన్‌స్నాచర్‌ను తెర మీదకు తీసుకువచ్చి అభాసు పాలయ్యారు. స్నాచింగ్‌లకు పాల్పడుతూ యువతులపై అత్యాచారానికి పాల్పడే అలవాటు ఉన్న లడ్డూని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాని చేతులు, కాలి ముద్రలు తేడా రావడంతో న్యాయనిపుణుల సలహా మేరకు సాంకేతిక కారణాలతో లడ్డూ నిందితుడు కాదని వెనక్కు తగ్గిన పోలీసుల ప్రజల నుంచి నిందారోపణలు మోయాల్సి వచ్చింది.
ఆయేషామీరా కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వేట సాగిస్తున్న పోలీసులు నందిగామ మండలం అనాసాగర్‌కు చెందిన పిడతల సత్యంబాబును ఇందులో ఇరికించేశారు. తాపీ పని చేసుకుంటూ చలాకీగా తిరుగుతున్న సత్యంబాబును పట్టుకొచ్చి ఆయేషాపై అత్యాచారం, హత్య చేశాడంటూ ప్రాధమిక ఆధారాలు సృష్టించి 2008 ఆగస్టు 15న అరెస్టు చేశారు. విజయవాడ జైలులో రిమాండులో ఉన్న సత్యంబాబుకు నరాల సంబంధ వ్యాధి సోకింది. దీంతో కోర్టు ఆదేశాలతో హైదరాబాద్ తరలించి వైద్య చికిత్సలు అందించారు. అప్పటికే అతని కాళ్ళు రెండు చచ్చుబడి నడవలేని స్థితి. అతని కాళ్ళకు, చేతులకు బేడీలు వేసి ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువస్తుండగా సూర్యాపేట వద్ద తప్పించుకున్నట్లు పోలీసులు వింత ప్రచారం తెర మీదకు తీసుకువచ్చారు. ఆగి ఉన్న బస్సు కిటికీ నుంచి నడవలేని సత్యంబాబు దూకి పారిపోయాడని కథ అల్లారు. అప్పట్లో అతన్ని ఎన్‌కౌంటర్ చేసేందుకే వ్యూహం పన్నారంటూ పోలీసులపై ఆరోణపలు తీవ్రంగా వచ్చాయి. పౌరసంఘాలు గోల చేయడంతో వ్యూహం మార్చుకున్న పోలీసులు సత్యంబాబును హఠాత్తుగా తెరమీదకు తీసుకువచ్చి పెనుగంచిప్రోలు వద్ద సంచరిస్తుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద సత్యంబాబునే అసలు దోషిగా నిర్ధారించిన పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో అతనిపై ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన సాక్ష్యాల ఆధారంగా విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు జీవితఖైదు విధిస్తూ 2009 సెప్టెంబర్ 29 తీర్పు చెప్పింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పిడతల సత్యంబాబు నిర్దోషిగా హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.
ఆ పోలీసు అధికారులు వీరే..
ఆయేషామీరా హత్య జరిగినప్పుడు నగర పోలీసు కమిషనర్‌గా సివి ఆనంద్ ఉన్నారు. ఇప్పుడు ఈయన తెలంగాణ క్యాడర్‌లో పని చేస్తున్నారు. ఘటన జరిగినప్పుడు ఇబ్రహీంపట్నం సిఐగా పని చేసిన సుంకర మురళీమోహనరావు ప్రస్తుతం డిఎస్పీ హోదాలో గోదావరి జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. స్టేషన్ ఎస్‌ఐగా ఉన్న జి శ్రీనివాస్ ఇప్పుడు విజయవాడలోని సిఎంఎస్ సిఐగా పని చేస్తున్నారు. ఇక ఘటన జరిగినప్పుడు పని చేసిన ఇద్దరు ఏసిపిలు లక్కరాజు విజయ్‌కుమార్, ప్రకాశరావులు ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు. హత్య జరగ్గానే ఎస్‌ఐ శ్రీనివాస్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆతర్వాత సిఐ మురళీమోహనరావు దర్యాప్తు చేపట్టారు. కేసు స్వభావాన్ని బట్టి ఏసిపి రంగంలోకి దిగి దర్యాప్తు సాగించారు. హైకోర్టు తాజా తీర్పుతో అప్పటి పోలీసు అధికారులపై ప్రభుత్వం ఏలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలని పౌర హక్కుల సంఘాలు డిమాండు చేస్తున్నాయి. ఇక ఆయేషాను హతమార్చిన దోషులెవరో తేల్చాల్సి ఉంది.

సత్యం బాబును కోర్టుకు తరలిస్తున్న పోలీసులు (ఫైల్ ఫొటో)