రాష్ట్రీయం

పెరిగిన విద్యుత్ డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: భానుడి భగభగలకు ఒక్కసారి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. విద్యుత్ వినిమయం పెరగడంతో డిస్కాంలు విద్యుత్ కొరత తలెత్తకుండా పటిష్టమైన చర్యలుతీసుకుంటున్నాయి. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో మార్చి నెలలోనే రోజుకు 185.371 ఎంయుకు చేరుకుంది. ఏప్రిల్ నెలలోనే ఈ డిమాండ్ 185 ఎంయుకు చేరుకుంటే, మే నెల నాటికి 200 ఎంయుకు చేరుకుంటుందని విద్యుత్ శాఖ అంచనావేస్తోంది. విద్యుత్ కొరత లేదని ఎంత డిమాండ్ వచ్చినా తట్టుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పదివేల మెగావాట్ల డిమాండ్ ఉన్నా విద్యుత్ కొరతకు తావులేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం సగటున రోజుకు అన్ని మార్గాల ద్వారా తెలంగాణలో 9100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ సరఫరా కూడా ఈ నెలలోనే ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వార్ధా-డిచ్‌పల్లి గ్రిడ్ నుంచి 700 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ ట్రాన్స్‌కో పొందుతోంది. చత్తీస్‌గడ్ నుంచి వార్ధా-డిచ్‌పల్లి ద్వారా విద్యుత్ సరఫరా చేసే వ్యవస్ధ పూర్తయింది. బెంగళూరులోని సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్, ఢిల్లీలోని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అనుమతి వచ్చిన వెంటనే అధికారికంగా ఈ కారిడార్‌ను ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. యూనిట్ ధర రూ.3.90 పైసలుంటే, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పంపిణీ చార్జీలను కలుపుకుంటే యూనిట్ రూ. 4.30పైసలు వరకు ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది.
12 ఏళ్లపాటు చత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థల నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం ఖరారు చేసింది. కాగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ రేటును ఖరారు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి బహిరంగ విచారణను ఇప్పటికే పూర్తి చేసింది. వీలైనంత త్వరలో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాన్ని ప్రకటించాలని తెలంగాణ డిస్కాంలు టిఎస్‌ఇఆర్‌సికి లేఖ రాశాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఏప్రిల్ 1న 166.886 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడగా, కొరత లేనందు వల్ల అంతే విద్యుత్‌ను వినియోగదారులకు సరఫరా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణపట్నం ప్లాంట్, సౌర విద్యుత్ ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులోకి వచ్చినందు వల్ల విద్యుత్ కొరత తలెత్తడం లేదు. ప్రస్తుతం రోజుకు 200 మెగావాట్ల మిగులు విద్యుత్ ఉంది. కాగా ఎండలు ముదిరినా, వినియోగం పెరిగినా గతంలో మాదిరిగా విద్యుత్ కోతల పరిస్థితి లేదు.