ఆంధ్రప్రదేశ్‌

భూ వివాదాలకు ఇక ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: న్యాయస్థానంలో ఉన్న సింహాచల భూముల వ్యవహారంపై అధికారులు శ్రద్ధ చూపి వెంటనే వివాదానికి ముగింపు పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం దేవాదాయ శాఖ సమీక్షలో ఈ అంశంపై ప్రత్యేకంగా అడ్వకేట్ జనరల్ శ్రీనివాసరావుతో ఫోన్‌లో ఆయన మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన అన్ని అంశాలను పరిశీలించి న్యాయస్థానంలో సమర్థ వాదనలు వినిపించాలని సూచించారు. న్యాయస్థానానికి వేసవి సెలవులు రానున్న దృష్ట్యా సాధ్యమైనంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం లభించేలా కృషిచేయాలని ఆదేశించారు. 12వేల మందికి సంబంధించిన ఈ వ్యవహారంలో వారందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని 3 ప్రధాన దేవస్థానాల్లో అమలుచేయాల్సిన మాస్టర్‌ప్లాన్ గురించి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ముఖ్యంగా మహిమాన్విత జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని తిరుపతితో సమానంగా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలని ముఖ్యమంత్రి దేవాదాయ శాఖకు సూచించారు. దేవాలయాల జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనుల్లో ఆయా ఆలయాల ప్రాశస్థ్యం, చరిత్ర, సంస్కృతి, అంతర్జాతీయ రూపశిల్పుల సహాయం తీసుకోవాలని చెప్పారు. సున్నిపెంటలో ఏర్పాటు చేయబోయే టౌన్‌షిప్ ద్వారా స్థానికుల ఆర్థిక శక్తిసామర్థ్యాలు పెంపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. అక్కడ నిర్మించబోయే 7 కిలోమీటర్ల బాహ్య వలయ రహదారి అక్కడి వారి ఆర్థిక స్థితిగతులను మార్చనుందన్నారు. రహదారి లోపలి భాగంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా తగిన వాతావరణం కల్పించాలన్నారు. మహాశివునికి సంబంధించిన పూజాదికాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆప్రాంతం నెలవు కావాలన్నారు. దుర్గగుడి ఘాట్‌రోడ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సిఎం తెలిపారు. కుమ్మరిపాలెంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ లాట్‌ను అక్టోబర్‌లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంద్రకీలాద్రిని ఆక్రమణల బారి నుంచి కాపాడుకోవాలని, అటవీ శాఖతో కలిసి ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలని దేవాదాయ శాఖకు సూచించారు. శ్రీకాళహస్తి మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో ఎదురవుతున్న భూసేకరణ సమస్యల్ని అధిగమించాలని సిఎం చెప్పారు. ఖర్చు పెరిగినా ప్రజలకు మేలు జరగాలని, ప్రభుత్వానికి మంచిపేరు రావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ముఖ్య కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనూరాధ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర పాల్గొన్నారు.
chitram...
దేవాదాయ శాఖపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు