రాష్ట్రీయం

నేడే ప్లీనరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. టిఆర్‌ఎస్ ప్లీనరీ జరిగే కొంపల్లిలోని ఏజిఆర్ గార్డెన్స్‌తోపాటు పరిసరాలు, పక్కనే ఉన్న జాతీయ రహదారి కూడా గులాబీ వర్ణాన్ని పులుముకున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ అధికారాన్ని నిలుపుకునే వ్యూహంలో భాగంగా పార్టీ శ్రేణుల్ని సంసిద్ధపరచే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీ ప్రారంభానికంటే ముందు పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్ ఎన్నికపై ప్రకటన ఉంటుంది. కెసిఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఉదయం 9.55 గంటలకు ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి టిఆర్‌ఎస్ భవన్‌లో ప్రకటిస్తారు. ప్లీనరీ వేదికపైనే ఈ ప్రకటన చేయాలని తొలుత భావించినా, దివ్య ముహూర్తాన్ని దృష్టిలో పెట్టుకుని 9.55కు తెలంగాణ భవన్‌లోనే ప్రకటన చేయాలని తరువాత నిర్ణయించారు. ఉదయం 10:30 గంటలకు కెసిఆర్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటారు. పార్టీ జెండా ఆవిష్కరించి, అమర వీరులకు నివాళి అర్పించిన తరువాత స్వాగతోపన్యాసం చేస్తారు. భోజన విరామానంతరం తీర్మానాలపై చర్చ జరుగుతుంది. ప్లీనరీలో 12 అంశాలపై తీర్మానాలు చేస్తారు. సంక్షేమ కార్యక్రమాలు, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధానమైన అంశాలుగా భావిస్తున్న విద్యుత్ రంగం, భారీ ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతోపాటు గొర్రెల పెంపకం, ఆసరా వంటి పథకాల గురించి ప్రధానంగా చర్చ సాగుతుంది. అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన రెండు ప్లీనరీలకన్నా ఈసారి ప్లీనరీ వినూత్నంగా ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్లీనరీకి దాదాపు10వేల మంది ప్రతినిధులను ఆహ్వానించినా, అంతకుమించి వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే దాదాపు 15వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. దాదాపు మూడేళ్ల కాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని, వచ్చే రెండేళ్లు వివిధ రంగాల్లో సాధించనున్న ప్రగతిని కెసిఆర్ పార్టీ శ్రేణులకు వివరిస్తారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం చీకటిమయం అవుతుందని, శాంతిభద్రతలు క్షీణిస్తాయని అనేక రకాలుగా ప్రచారం జరిగినా, వాటన్నింటిని ఎదిరించి దేశంలోనే అనేక రంగాల్లో మొదటి స్థానంలో నిలిచిన అంశాన్ని కెసిఆర్ పార్టీ గణాంకాలతో సహా వివరిస్తారు. 21శాతం వృద్ధిరేటు ద్వారా దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఏ విధంగా నిలిచిందీ వివరించనున్నారు. ప్రతిష్ఠాత్మక పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటివి ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైన విషయాన్నీ ఆయన ప్రస్తావించనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు సాధించిన అభివృద్ధిని జనంలోకి తీసుకు వెళ్లే బృహత్తర బాధ్యతను కార్యకర్తలు తమ భుజస్తంధాలపై ఎత్తుకోవాల్సిన ఆవశ్యకతను కూడా పార్టీ అధ్యక్షుడి హోదాలో కెసిఆర్ విడమరచి చెప్పనున్నారు.
ప్లీనరీ ఏర్పాట్లలో ఈసారి కెటిఆర్ హడావుడి కనిపిస్తోంది. ఇప్పటివరకు మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉన్న కెటిఆర్‌కు పార్టీలోనూ కీలక పాత్ర వహించే అవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ప్లీనరీలో అధ్యక్షుని ఎన్నిక ప్రకటన మాత్రమే ఉంటుంది. అనంతరం రాష్ట్ర కార్యవర్గం, పొలిట్ బ్యూరో నియామకం ఉంటుంది. దీనిలో కెటిఆర్‌కు స్థానం కల్పించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

చిత్రాలు..ముఖ్యమంత్రి కెసిఆర్ ఫొటోలతో ఏర్పాటు చేసిన స్వాగత తోరణం
*ప్రతినిధుల కోసం ముస్తాబైన ప్లీనరీ ప్రాంగణం