రాష్ట్రీయం

రైతు కంట్లో బోనస్ ‘కారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 22: మిర్చి రైతుకు 1500 రూపాయల బోనస్ పేరుతో ప్రచారం ఊదరకొడుతున్న సర్కారు, నిబంధనల పేరుతో బోనస్ తగ్గించుకునే మాయోపాయానికి తెరలేపడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పొలంలో ఉన్న పంటకే బోనస్ ఇవ్వాలని, అది కూడా ఉద్యానవన- రెవిన్యూ శాఖాధికారులు సంయుక్తంగా ధ్రువీకరణ పత్రం ఇస్తేనే బోనస్ ఇవ్వాలని చేర్చిన నిబంధన, మిర్చి రైతుకు శాపంగా పరిణమించింది. నిజానికి కోల్డ్‌స్టోరేజీల్లో లక్షల క్వింటాళ్లలో మిర్చి ఉండగా, పొలాల్లో వేల క్వింటాళ్లలో ఉంది. ప్రస్తుతం సర్కారు ఇస్తానంటున్న బోనస్ కోల్డ్‌స్టోరేజీల్లో ఉన్న మిర్చికి వర్తించడం లేదు. అంటే సర్కారు చెప్పే బోనస్ అందేది అతి తక్కువేనని, బోనస్‌ను ఎగవేసేందుకే సర్కారు ఈ నిబంధనలను తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది.
ప్రభుత్వం మిర్చి రైతుల కోసం ప్రకటించిన బోనస్ ప్రకటన ప్రచారానికే పరిమితం కానున్నట్లు కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం పొలాల్లో కోత కోయని కాయలకే బోనస్ ఇవ్వాలని, కోల్డ్‌స్టోరేజీల్లో ఉన్న కాయకు బోనస్ వర్తించదని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా పొలంలో ఉన్న కాయ ఎన్ని క్వింటాళ్లు ఉందన్న విషయాన్ని స్థానికంగా ఉన్న రెవిన్యూ- ఉద్యానవన అధికారి కలిసి నిర్ధారించిన తర్వాత ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చిన తర్వాతే రైతుకు బోనస్ వర్తిస్తుందని, అధికారులు ఈ విషయంలో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని శనివారం నిర్వహించిన మార్కెటింగ్, వ్యవసాయ, రెవిన్యూ అధికారుల వీడియో కాన్ఫరెన్సులో ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఈ నిబంధనల వల్ల తమకు అన్యాయం జరుగుతోందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తమ పంట గుంటూరు కోల్ట్‌స్టోరేజీల్లో ఉందని, పొలాల్లో ఉన్నది తక్కువేనని అంటున్నారు. స్టోరేజీల్లో ఉన్న కాయల రికార్డులను మార్కెటింగ్ శాఖ ఏడి 15 రోజుల క్రితమే స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతం పొలంలో ఉన్న కాయలను కోయాలంటే విపరీతమైన ఖర్చని, అందుకే వాటిని వదిలేశామని రైతులు చెబుతున్నారు. ఒక్కో ఎకరానికి కోత కోసినందుకు కూలీలకు అయ్యే ఖర్చు నాలుగువేల రూపాయలు ఉంటుందని, వాటిని బస్తాలో కట్టి మార్కెట్‌యార్డుకు తీసుకువెళ్లాలంటే 200 రూపాయలవుతుందని, ఇంతచేస్తే సర్కారు ఇచ్చే బోనస్ దానికే సగం సరిపోతుందని రైతులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. కాయ కోత ఖర్చు ఎకరానికి 4 వేలుంటే, వాటిని అమ్మితే మార్కెట్‌లో వచ్చే రేటు 3500 రూపాయలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పొలాలకు వెళ్లి నిర్ధారించేంత సిబ్బంది తమకు లేనందున, గతంలో ఆ పనిచేసిన వ్యవసాయశాఖ అధికారులే చూసుకోవాలని ఉద్యావన శాఖ తప్పించుకుంటోంది. అయితే, ఆ పని తమది కాదని వ్యవసాయశాఖ అధికారులు వాదిస్తున్నారు. రెండు శాఖల అధికారులు కలసి పంట ఎంతన్నది నిర్ధారించి, గుర్తింపుకార్డుతో సహా ధ్రువీకరణ ఇస్తేనే బోనస్ అందుతుంది. ప్రభుత్వ ప్రకటన వచ్చిన వెంటనే ఉద్యావనశాఖ అధికారుల వద్దకు వెళ్లిన రైతులకు మీ పొలాల వద్దకు వచ్చేంత సిబ్బంది తమకు లేరని చెప్పడం, అంతకుముందు అదే పనిచేసిన వ్యవసాయ అధికారులు కూడా అదే జవాబివ్వడంతో ఆగ్రహించిన రైతులు తాజాగా గుంటూరు మార్కెట్ యార్డు వద్ద ఆందోళన నిర్వహించారు.
ఇదిలాఉండగా, ఒక సమాచారం ప్రకారం గుంటూరులోని 70 ఏసీ కోల్డ్ స్టోరేజీలన్నీ మిర్చితో నిండిపోయాయి. ఒక్కో కోల్డ్ స్టోరేజీకి 60 వేల బస్తాల (నాలుగువేల క్వింటాళ్లు) సామర్థ్యం ఉంటుంది. అంటే లక్షల క్వింటాళ్లు కోల్ట్‌స్టోరేజీల్లో ఉంటే, పొలాల్లో ఉన్న మిరపకాయ వేల సంఖ్యలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒక్కో రైతుకు 20 క్వింటాళ్లకు మించకుండా బోనస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు కలిగే మేలేమీ లేదన్న పెదవి విరుపు వినిపిస్తోంది.
‘ఇప్పటికే మేం కోసిన మిరపకాయ 90 శాతం కోల్డ్‌స్టోరేజీల్లోనే ఉంది.. నాలుగైదు కోతలయిపోయాయి. 20 ఎకరాలుంటే అందులో ఎకరానికి 15 క్వింటాల కాయే వస్తుంది. ఒక ఎకరానికి క్వింటా, అరక్వింటా కూడా కోతకు రాదు. మరి బోనస్ వల్ల ఏం ఉపయోగమ’ని ఓ రైతు ప్రశ్నించాడు.