రాష్ట్రీయం

అభివృద్ధికి అంకురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 14: రాజధాని ప్రాంతంలో తొలివిడతగా 1691 ఎకరాల్లో ప్రతిపాదించిన స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సోమవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు మందడం గ్రామంలో భూమిపూజ జరగబోతోంది. ఇందుకోసం పరిసర గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలను సమీకరిస్తున్నారు. దీనికి ముందుగా విజయవాడ నగరంలో సింగపూర్ కన్సార్టియం సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఇందుకోసం సింగపూర్ వ్యాపార, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్ తమ ప్రత్యేక మంత్రుల బృందంతో సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, నేరుగా హోటల్ గేట్‌వేకు వస్తారు. అక్కడ సిఆర్‌డిఏ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రతినిధి బృందంతో సమావేశవౌతారు. అనంతరం 1691 ఎకరాల్లో తలపెట్టిన అభివృద్ధి పనులపై ఒప్పంద పత్రాలు మార్చుకుంటారు. ఆపై మధ్యాహ్నం 2.30కి మందడం గ్రామంలో జరిగే భూమిపూజ, బహిరంగ సభలోనూ సింగపూర్ మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం సింగపూర్ ప్రతినిధులు గన్నవరం నుంచి చెన్నై బయలుదేరి వెళతారు. రాజధాని అమరావతి అభివృద్ధికి చోదకశక్తిగా ఉపకరించనున్న ఈ స్టార్టప్ ఏరియా అభివృద్ధి కార్యక్రమం మూడోదశలో పూర్తిగా స్విస్ ఛాలెంజ్ విధానంలో కొనసాగుతుంది. అమరావతి అభివృద్ధి సంస్థ, సింగపూర్ కన్సార్టియం కలిసి అమరావతి అభివృద్ధిలో భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. మొత్తం 1691 ఎకరాలను మూడు దశల్లో 15ఏళ్ల వ్యవధిలో అభివృద్ధిపరచడమే కాకుండా వ్యాపార లావాదేవీలను కూడా నిర్వహిస్తారు. ఇందుకు తొలిదశలో 656 ఎకరాలు, రెండోదశలో 514 ఎకరాలు, మూడోదశలో 521 ఎకరాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రతి దశలోనూ 70 శాతం భూమిని అభివృద్ధి చేసి విక్రయించిన తర్వాతే తదుపరి దశను చేపట్టాల్సి ఉంటుంది. అయితే అభివృద్ధి చేసిన ప్లాట్లను విక్రయించే అధికారం సిఆర్‌డిఏకు మాత్రమే ఉంటుంది.
సింగపూర్ సంస్థకు 1691 ఎకరాల భూమిని ఇవ్వడమేగాక అందులో వౌలిక సదుపాయాల కోసం దాదాపు 6వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చుచేయాల్సి ఉంది. ఇందులో సింగపూర్ సంస్థ పెట్టుబడి కేవలం రూ.300 కోట్లు అయినప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి స్థూల విక్రయాదాయంపై వాటా మొదటి దశలో 5శాతం, రెండో దశలో 7.5శాతం, మూడోదశలో 12.5 శాతం రూపంలో, అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్ ఆర్జించే లాభాల్లో సింగపూర్ సంస్థకు 58 శాతం, రాష్ట్రానికి 42 శాతం లభించడంతో పాటు దాదాపు రూ.2వేల 118కోట్ల వ్యయంతో ఏడిపి కల్పించబోయే వౌలిక సదుపాయాలను అనంతరం సిఆర్‌డిఏకు బదలాయిస్తారు. నూతన రాజధానిలో ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థకు బీజాలు వేయటమే కాకుండా ఏడిపి తొలిదశలో మూడేళ్లలో 8.07 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణకు సింగపూర్ ప్రభుత్వం ఇక్కడ ఒక కార్యాలయాన్ని ప్రారంభించబోతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా అత్యంత క్రియాశీలక ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా, ప్రపంచంలోనే అత్యుత్తమ వౌలిక సదుపాయాలు, జీవన యోగ్యమైన వసతులు కలిగిన నగరంగానూ తీర్చిదిద్దబోతోంది. దీనివల్ల ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పర్యాటకులను ఆకర్షించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నారు.