రాష్ట్రీయం

జిఎస్టీ ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: ఆంధ్రప్రదేశ్ వస్తు సేవల పన్ను (జిఎస్టీ) ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఒప్పంద ఉద్యోగుల వేతనాన్ని 50 శాతం పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీలో జిఎస్టీ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో లాంఛనంగా కేబినెట్‌లో పెట్టి ఆమోదం తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50 శాతం పెంచాలన్న మంత్రుల బృందం సిఫార్స్‌లను ఆమోదించింది. కొత్త పిఆర్‌సి ప్రకారం కనీస వేతనం 12వేల రూపాయలు ఉంటుంది. 2010 పిఆర్‌సి ప్రకారం 12వేల కంటే తక్కువ జీతం అందుకుంటున్న వారికి కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న ఈ నిర్ణయం వలన ప్రభుత్వంపై రూ.200 కోట్లు అదనపు భారం పడనుంది. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ 2017-22కు కూడా మంత్రివర్గం ఆమోదించింది. పౌరుల్లో ఆనందం, క్రీడల్లో నైపుణ్యం సాధించడానికి అవసరమయ్యే సాధనా సంపత్తి సమకూర్చడమే ఈ పాలసీ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టుకు, ఏపిఇపి డిసిఎల్‌లో కొన్ని పోస్టు లు భర్తీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ శాఖలో 20పోస్టులు, ఆర్‌అండ్‌బి లో 18, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో 22, ఉడాలో 9 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్‌ఫర్మేన్ ప్రాజెక్టు కింద 73 పోస్టులకు కూడా భర్తీకి ఆమోదం తెలిపారు. ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో ఒక డైరక్టర్ పోస్టును సృష్టించేందుకు నిర్ణయించారు. దివ్యాంగులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు విజయవాడలో ఏర్పాటుచేసిన స్టడీ సర్కిల్‌లో బోధనా, బోధనేతర సేవలను అవుట్ సోర్సింగ్ విధానంలో సమకూర్చుకునేందుకు కూడా అనుమతి మంజూరు చేసింది. నూతన మంత్రుల పేషీల్లో 88మంది సిబ్బందిని నియమిస్తూ ఇచ్చిన జీవోకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

చిత్రం..కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు