రాష్ట్రీయం

నాట్లకు అంతా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణలో రైతులంతా నాట్లు వేయటానికి సిద్ధమైపోయారు. ఎప్పుడెప్పుడు వానలు వస్తా యా అని ఎదురుచూస్తున్నారు. నైరుతీ రుతుపవనాలు రాగానే వర్షాలు ప్రారం భం అవుతాయని, వెంటనే విత్తనాలు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. అనుకున్న ప్రకారం జూన్ ఏడోతేదీ లోగా వర్షాలు వస్తే తక్షణమే విత్తనాలు వేసే అవకాశం ఉంది. మే 25 న ప్రారంభమైన రోహిణీ కార్తె జూన్ 7 వరకు ఉంటుంది. రోహిణిలో విత్తనాలు వేస్తే పంటలకు చీడపీడ బాధ తొలిగిపోతుందని రైతుల నమ్మకం. అందుకే ఈలోగా వర్షం ప్రారంభమైతే విత్తనాలు వేయాలని ఎదురు చూస్తున్నారు. వర్షాలు రావడంలో జాప్యం జరిగినా విత్తనాలు వేసేందుకు రెడీ అయి ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం నైరుతీరుతుపవనాలు నెమ్మదించాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో మళ్లీ బలంగా మారి, ముందుకు సాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ కేంద్రం ఇంచార్జి డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం తరపున ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో విత్తనాలను సిద్ధంగా ఉంచారు. వరి, కంది, జొన్న తదితర విత్తనాలను సబ్సిడీపై ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నిబంధనల మేరకు విత్తనాలను సరఫరా చేసేందుకు గ్రామస్థాయిలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు(ఎఇఓ), మండలస్థాయి లోని వ్యవసాయ అధికారులకు (ఎఓ) ఆదేశాలు జారీ చేశారు. ఎఇఓలు, ఎఓలు అత్యవసరం ఉంటే తప్ప విత్తనాలు వేయడం పూర్తయ్యేవరకు సెలవులు పెట్టవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా విత్తనాలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. అన్ని ప్రాంతాల్లోని విత్తన విక్రయ దుకాణాల్లో వివిధ రకాల విత్తనాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
నకిలీ విత్తనాలు, నాణ్యతలేని విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వివిధ రకాల విత్తనోత్పత్తి సంస్థలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర విత్తనధృవీకరణ సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని దాదాపు 420 విత్తనోత్పత్తి సంస్థలతో ప్రభుత్వం తరపున అధికారులు సంబంధాలు పెట్టుకుని పనిచేస్తున్నారు.
ఎఇఓలు, ఎఓలు, డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు తమ తమ పరిధిలోని విత్తన దుకాణాలను తరచూ తనిఖీచేస్తున్నారు. రైతులు ప్రైవేట్ సంస్థల విత్తనాలను కొనుగోలు చేస్తే, తప్పక రసీదు తీసుకోవాలని అధికారులు సూచించారు. రసీదు లేకపోతే ఒకవేళ పంటకు ఏమైనా నష్టం జరిగితే నష్టపరిహారం ఇప్పించేందుకు ఇబ్బంది అవుతుందని వివరిస్తున్నారు.
ఆగస్టులోనే సాగు
నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీటి నిలువ డెడ్‌స్టోరేజీకి చేరడంతో ఖరీఫ్ సాగు ఆగస్టులోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతీ రుతుపవనాలు విస్తరించి భారీ వర్షాలు కురిస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి నీరు చేరుతుంది. వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే మరో రెండు నెలల వరకు ఈ ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చే అవకాశం కనిపించడం లేదు. నాగార్జునసాగర్ ఆయకట్టులో ఖరీఫ్‌లో సుమారు 22 లక్షల ఎకరాలు సాగవుతుంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో నీరు డెడ్‌స్టోరేజీకి చేరడంతో ఇప్పట్లో సాగునీరు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. మరో రెండునెలలపాటైనా ఆగాల్సిన అవసరం ఉంటుందని నీటిపారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.