రాష్ట్రీయం

కొంపముంచిన వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 6: రాజుల సొమ్ము రాళ్లపాలయినట్టు, జనం సొమ్ము బడా కంపెనీల పాలవుతోంది. అతి తక్కువ కాలంలోనే తాత్కాలిక సచివాలయం, శాసనసభ నిర్మాణం జరిపామని ప్రచారం చేసుకున్న ప్రభుత్వం డొల్లతనాన్ని భారీ వర్షం బయటపెట్టింది. సీలింగులు పటిష్ఠంగా లేకపోవడంతో సచివాలయం, శాసనసభ చాంబర్లలోకి నీళ్లు వచ్చిన వైనం, డోర్ ర్యాంపులు కూడా నిర్వహించలేని వైఫల్యం భవన నిర్మాణ కంపెనీల పనితనాన్ని, పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపాయి. దాదాపు వెయ్యి కోట్ల వ్యయంతో భవన నిర్మాణంలో లబ్ధప్రతిష్ఠులైన కంపెనీలు సంయుక్తంగా నిర్మించి, మంత్రి నారాయణ స్వీయ పర్యవేక్షణలో పూర్తయిన అసెంబ్లీ, సచివాలయ భవన నిర్మాణాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో తాజా వర్షాలు బయటపెట్టాయి. అసెంబ్లీలో మంత్రుల చాంబర్లు ఇరుకుగా ఉన్నాయని, బాత్‌రూములు కూడా సక్రమంగా నిర్మించని వైనంపై మంత్రులే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిర్మాణ, నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తున్న సీఆర్‌డీఏ వైఫల్యాన్ని కూడా తొలకరి వానలు వేలెత్తిచూపించాయి. మంగళవారం కురిసిన భారీ వర్షం వెలగపూడి తాత్కాలిక సచివాలయం, అందులోని బ్లాకులను నీటితో నింపేశాయి. ఫలితంగా అక్కడ పనిచేసే ఉద్యోగులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. అసెంబ్లీ, సచివాలయం భవనాల్లోకి మీడియాను అనుమతించకపోవడంతో నీటి తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయం లోపల ఉన్న రోడ్లపైనా నీళ్లు నిలిచిపోయాయి. ఇప్పుడే పరిస్థితి ఇలావుంటే, ఇక వర్షాకాలపు సీజన్ మొదలైతే ఇంకెంత భయానకంగా ఉంటుందోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4వ బ్లాకులో వర్షపు నీటి జల్లుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెవిన్యూ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అటు శాసనసభలోనూ దాదాపు ఇదే పరిస్థితి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్రతిపక్ష నాయకుడు జగన్ చాంబరు పైనున్న సీలింగుల నుంచి నీళ్లు లీకవడంతో సిబ్బంది బకెట్లు తీసుకొచ్చి వర్షపు నీటిని తొలగించారు. జగన్ చాంబర్ లోపల, బయట కూడా సీలింగుల నుంచి నీళ్లు వస్తుండటం కనిపించింది. లాబీలో జగన్ రూముకు వెళ్లే దారి అంతా నీళ్లతో నిండిపోయింది. మీడియాను లోపలకు అనుమతించకపోవడంతో వైసీపీఎల్పీ సిబ్బందే నీళ్లు తొలగిస్తున్న వీడియోలను మీడియాకు పంపించారు. లోపలవున్న మరికొన్ని చాంబర్లు కూడా లీకైనట్టు తెలుస్తోంది. దీనితో రంగంలోకి దిగిన సిబ్బంది ముందుగా సీఎం ప్రవేశించే గేటు వద్ద ఉన్న చిన్న భవనంపై నీళ్లు నిలిచిన భాగం వరకూ ఉన్న ప్రాంతాన్ని బద్దలుకొట్టి, నీటి ఉధృతిని క్రమబద్ధీకరించాల్సి వచ్చింది. అయితే, ఇటీవల ఏసి ప్లాంటు రిపేరు కావడంతో దాన్ని మరమ్మతులు చేసే సందర్భంలో పటిష్ఠమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని, తొలి వర్షం కాబట్టి ఇప్పుడు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇకపై జాగ్రత్తగా వ్యవహరిస్తామని అసెంబ్లీ, సచివాలయ నిర్వహణ చూస్తున్న సీఆర్డీఏ అధికారులు సెలవిచ్చారు. జగన్ చాంబరు ఏసి పైప్‌లైన్ల రిపేర్ల వల్ల, నాలుగవ బ్లాకులోని రెవిన్యూ విభాగంలోకి జల్లుల వల్ల నీళ్లొచ్చాయని తేలిగ్గా చెప్పి తప్పించుకున్నారు.

చిత్రాలు.. వెలగపూడి సెక్రటేరియట్‌లోకి వచ్చిన వర్షపు నీటిని శుభ్రం చేస్తున్న సిబ్బంది,
అసెంబ్లీలోని వైఎస్ జగన్ చాంబర్ సీలింగ్ నుంచి ధారాపాతంగా కారుతోన్న వాన నీరు