రాష్ట్రీయం

తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: భూకబ్జా కేసులో తెలుగు దేశం ఏపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి సహకరించిన న్యాయవాదిని, మరో బ్రోకర్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లో విలువైన భూమిని కబ్జా చేసినట్టు ఆ భూమి యజమాని లోగడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సిసిఎస్ పోలీసులు ఇదివరకే ఆయనకు నోటీసు పంపించినప్పటికీ, స్పందించలేదని తెలిసింది. దీంతో మంగళవారం డిసిపి అవినాష్ మహంతి నేతృత్వంలో పోలీసులు దీపక్‌రెడ్డిని అరెస్టు చేశారు. లేని వ్యక్తులను ఉన్నట్టు చూపించి రిజిస్ట్రేషన్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నకిలీ పత్రాలు సృష్టించి విలువైన భూమిని కబ్జా చేసినట్టు అభియోగాలు రావడంతో, సిసిఎస్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
కలకలం రేపిన అరెస్టు
ఏపీ టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్టు పార్టీలో కలకలం సృష్టించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలూ షాక్‌కు గురయ్యారు. మియాపూర్ భూకుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తున్న ఈ సమయంలో సొంత పార్టీకి చెందిన ఏపీ ఎమ్మెల్సీని నగరంలో అరెస్టు చేయడం వెనుక ఆంతర్యం ఏమైనా ఉందా? అనే అనుమానాలనూ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మియాపూర్ భూములను టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ రేవంత్ రెడ్డి పరిశీలించి, ఈ భూకుంభకోణం దేశంలోనే అతిపెద్దదని ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్సీని అరెస్టు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడి చేయకుండా చేతులు కట్టేసినట్లు అయ్యిందని టిటిడిపి నేతలు అంటున్నారు. లోగడ ఓటుకునోటు కేసుతో పార్టీకి నష్టం కలిగించిందంటే, మళ్లీ మరో మచ్చ రావడం బాధాకరమని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వమే కావాలని కక్ష కట్టి కేసులో ఇరికించిందని వాదించినా ప్రజల్లోకి తమ వాదన వెళుతుందో లేదోనన్న అనుమానాలూ వారికి లేకపోలేదు. ఎందుకంటే సిసిఎస్ పోలీసులు బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించి నకిలీ పత్రాలనూ వెల్లడించే అవకాశం ఉన్నందున, తమ వాదన గట్టిగా నిలబడదేమోనని అంటున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో నకిలీ పత్రాలతో విలువైన భూములను కబ్జా చేయడంపై అధికార పార్టీ చేసే దాడిని తట్టుకోవడం కష్టంగానే ఉంటుందన్న భయాన్ని టి.టిడిపి నేతలు వ్యక్తం చేశారు. దీపక్‌రెడ్డి అనంతపురం జిల్లా స్థానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

చిత్రం.. దీపక్‌రెడ్డి