రాష్ట్రీయం

భూములను ‘దండు’కున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, హఫీజ్‌నగర్ రెవెన్యూ పరిథిలోని దండుమైలారంలో తెరాస నేత, ఎంపీ కె. కేశవరావు కుటుంబీకులు ఖరీదు చేసిన భూముల వ్యవహారం వివాదస్పదంగాకాగా, ఈ అభియోగాలను టిఆర్‌ఎస్ ఎంపి కె కేశశరావు ఖండించారు. కెకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి (కార్పోరేటర్), కోడలు జ్యోత్స్న ఖరీదు చేసిన 50 ఎకరాలలో 38 ఎకరాలు ప్రభుత్వ భూమి అని ప్రచారం జరుగుతున్నది. గోల్డ్ స్టోన్ కంపెనీ ఆ భూములను కెకే కుటుంబానికి విక్రయించింది. అయితే కోర్టు ఆదేశంతోనే తమ కుటుంబ సభ్యులు 50 ఎకరాలు భూమి ఖరీదు చేసిన మాట వాస్తవమేనని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. అది ప్రభుత్వ భూమి కాదని, 2013లో తాము అగ్రిమెంట్ చేసుకుని 2015లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని కెకే తెలిపారు. వివాదంలో ఉన్న భూములు కొనలేదని, రెవెన్యూ పత్రాలు కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత, చట్ట ప్రకారమే ఆ భూములు ఖరీదు చేశామన్నారు. ఖరీదు చేసే ముందు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అభిప్రాయం కూడా తీసుకున్నామని ఆయన తెలిపారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అభిప్రాయం కూడా తీసుకున్నామని అన్నారు. అది ప్రభుత్వ భూమి కాదని చెప్పినందుకే కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. తమ భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తే హైకోర్టుకు, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని ఆయన చెప్పారు.
అదే నిజమైతే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్రహీంపట్నం మండలం ఇన్‌ఛార్జీ సబ్-రిజిస్ట్రార్ సలేహ ఖదీర్‌ను ఎందుకు సస్పెండ్ చేసిందన్న ప్రశ్న అందరినీ తొలిచి వేస్తున్నది. అలా సస్పెండ్ చేయడం కూడా తప్పేనని, కోర్టు ధిక్కారం అవుతుందని కెకే అన్నారు. ప్రభుత్వం క్లియరెన్స్ తర్వాత కోర్టు ఆదేశంతో ఖరీదు చేశాం కాబట్టి సబ్-రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేయడం కోర్టు ధిక్కారం అవుతుందని, అయితే తనకు తెలిసినంత వరకూ ఈ అంశంలో ఎవరినీ సస్పెండ్ చేయలేదని ఆయన చెప్పారు. సోలార్ ప్లాంట్ నెలకొల్పేందుకు భూమి ఖరీదు చేసినట్లు కెకే తెలిపారు.
కథనాలు ఈ విధంగా ఉన్నాయి
హఫీజ్‌పూర్‌లో 2244.22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 422.29 ఎకరాలు అటవీ భూమి ఉంది. 1965 సంవత్సరంలో ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు ఇచ్చిన తర్వాత 1821.33 ఎకరాలు ప్రభుత్వ అధీనంలో ఉంది. కాగా గోల్ట్ స్టోన్ టెక్నాలజీస్, మరి కొన్ని కంపెనీలు 50 ఎకరాలపై వాటా ఉన్నట్లు ప్రకటించాయి. 2015 సంవత్సరంలో గద్వాల విజయలక్ష్మి జ్యోత్స్న, కె. నవజ్యోతి గోల్డ్‌స్టోన్ నుంచి ఖరీదు చేశారు. ఆ సంవత్సరమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నా, అప్పటి సబ్-రిజిస్ట్రార్ పక్కన పెట్టారని, ఆ తర్వాత ఆయన సెలవుపై వెళ్ళడంతో ఇన్‌ఛార్జీ సబ్-రిజిస్ట్రార్ ఖాదీర్ 2016 మే 12న రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు మియాపూర్ భూముల కుంభకోణంపై జరుపుతున్న విచారణలో భాగంగా ఈ విషయం కూడా వెలుగు చూసింది.
ఇలాఉండగా శంషాబాద్‌లో కూడా గోల్డ్ స్టోన్ యజమాన్యం కెకే కుటుంబ సభ్యులకు కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది.
అధికార పార్టీలో కలకలం
ఇలాఉండగా మియాపూర్ భూముల కుంభకోణమే రాష్ట్రంలో దుమారం కలిగించగా, తాజాగా అధికార పార్టీ ఎంపి, సీనియర్ నాయకుడైన కెకే కుటుంబంపై ఆరోపణలు రావడంతో అధికార పార్టీలో కలకలం చెలరేగింది. ఇది ప్రభుత్వ ప్రతిష్టకు దెబ్బ అని కొందరు నాయకులు అన్నారు. దీంతో ప్రతిపక్షాలన్నీ కస్సుమంటున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న భూ కుంభకోణాల గురించి వివరించేందుకు గవర్నర్ అప్పాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వలేదని ఎఐసిసి నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు తెలిపారు.
దేశంలోనే అతి పెద్ద కుంభకోణం
కేంద్ర మంత్రి దత్తాత్రేయ విమర్శ
ఇలాఉండగా కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మియాపూర్ భూకుంభకోణం దేశంలోనే పెద్దదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సిబిఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరుతారా? అని ప్రశ్నించగా, అటువంటి ఆలోచన ఏమీ చేయలేదన్నారు. బదిలీలు, సస్పెన్షన్లతో పరిష్కారం కాదని ఆయన తెలిపారు.
సిబిఐ విచారణ జరిపించండి
షబ్బీర్, జీవన్‌రెడ్డి డిమాండ్
భూముల కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కూడా ఈ అంశంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని వారు శనివారం విలేఖరుల సమావేశంలో గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే కుంభకోణం జరిగిందని విమర్శించారు.