రాష్ట్రీయం

పెండింగ్ బిల్లులు 10వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదటి త్రైమాసికంలోనే దారుణంగా ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గత సంవత్సరానికి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు 10వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆర్థికశాఖ అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది నాలుగో త్రైమాసికం, ఈ ఏడాది మొదటి త్రైమాసికం కలిపి దాదాపు 49వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉండటంతో రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. కొన్ని శాఖల విభాగాలు తమకు కేటాయించిన నిధుల కంటే అదనపు నిధులు కోరటం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కొద్ది రోజుల్లో మొదటి త్రైమాసికం ముగియనున్న నేపథ్యంలో చెల్లింపులు కష్టసాధ్యంగా మారిందన్నారు. ఉన్న వనరులను సమీకరించుకుని నిరుడు పెండింగ్‌లో ఉన్న బిల్లులను ముందుగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇరిగేషన్, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్, తదితర శాఖలు కేటాయింపులకు కన్నా ఎక్కువ నిధులు ఖర్చుచేశాయని, ఆ శాఖల బిల్లులే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఖర్చు, ఆదాయాల మధ్య చాలా తేడా ఉందన్నారు. ఆర్థిక లోటు జిఎస్‌డిపిలో -0.14 శాతం ఉందని, రెవెన్యూ లోటు కూడా -0.1శాతం ఉందని తెలిపారు. మొదటి త్రైమాసికంలోనే ఇంత లోటు ఉండటం ఇబ్బందికరంగా ఉందన్నారు. అదనపు నిధులు కోరవద్దని అన్ని శాఖలకు స్పష్టం చేశామని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో పేరుకుపోయిన బకాయిల విలువ 2.16లక్షల కోట్ల రూపాయలు కాగా ప్రస్తుతం అది 2.06 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపారు. గ్రోత్ రేటు, జిఎస్‌డిపి మెరుగ్గానే ఉన్నాయని, ఇవి తగ్గితే రాష్ట్ర ప్రతిష్ఠ పడిపోతుందని తెలిపారు. ఖర్చులను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కేంద్రం నుంచి మొదటి త్రైమాసికానికి సంబంధించి రూ.10వేల కోట్లు విడుదల కావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.9వేల కోట్లు విడుదల చేశారని అన్నారు. త్వరలోనే ఆ మిగిలిన నిధులు రావచ్చని భావిస్తున్నామన్నారు. ఆర్థిక వెసులుబాటు కోసం ఈ ఏడాది ఇప్పటికే నాలుగువేల కోట్ల రూపాయలను మార్కెట్ నుండి అప్పు చేశామని తెలిపారు. ఈనెల 27న మరో 1200కోట్ల రూపాయలను మార్కెట్ నుండి అప్పు తీసుకుంటున్నట్టు తెలిపారు. గతంలో ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీకి బదలాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ విధానాన్ని ఆర్టీసీలో అమలుచేశామని, మిగిలిన కార్పొరేషన్లలో కూడా అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ బండి నడుపుతున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివిధ శాఖల అధికారులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అదనపు బడ్జెట్ కోరే ముందు ఆలోచించాలని సూచించారు. ఈనెల 22న జిఎస్‌టి నోటిఫికేషన్‌ను జారీచేయనున్నామని, మొదట్లో కొన్ని ఇబ్బందులున్నా భవిష్యత్‌లో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం తప్పు
రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించడంపై స్పందిస్తూ ప్రభుత్వం నియమించిన వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు గత ఏడాది 70కోట్ల రూపాయలను, ఈసారి 100 కోట్ల రూపాయలను కేటాయించామని గుర్తుచేశారు. సమస్య ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని, కార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూనే సొసైటీ ఏర్పాటు చేసుకుంటామని తమ దగ్గరికి వచ్చినప్పుడు తాను వ్యతిరేకించానని తెలిపారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు