రాష్ట్రీయం

ప్రజలే మా బాసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 20: తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచి అధికారం అప్పగించిన రాష్ట్ర ప్రజలే ప్రభుత్వానికి బాసులు. ప్రజాశీస్సులు ఉన్నన్ని రోజులు ఎవరికి భయపడేది లేదు. బంగారు తెలంగాణ సాధనకు నిరంతరం కృషి చేస్తానని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఆర్థిక పరిపుష్టి ఎక్కడో ఉండదని, మానవ సంపదకు మించిన సంపద లేదన్నారు. కుల వృత్తుల ప్రోత్సాహంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సిద్దిపేట జిల్లా కొండపాకలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతకాలం నిరాదరణకు గురైన గొల్ల, కురుమ, యాదవులు వచ్చే మూడేళ్లలో 25 వేల కోట్ల ఆదాయం గడించి సంపన్నులవుతారని జోస్యం చెప్పారు. గొర్రెల యూనిట్ల కోసం 7.61 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే, వాటి సంరక్షణకు గొల్ల, కురుమల్లోవున్న ఆసక్తి తెలియేజేస్తోందన్నారు. ఈ యేడాది పంపిణీ చేసిన గొర్రెలు మూడేళ్లలో ఏడు కోట్లకు పెరుగుతాయని, ఫలితంగా 25 వేల కోట్ల ఆదాయాన్ని గొల్ల కురుమలు సాధిస్తారన్నారు. తెలంగాణకు యాదవులు గొప్ప సంపదని, రెండు వందల గొర్రెల్లో ఎవరి గొర్రెను వారే సునాయాసంగా గుర్తించగల నేర్పురులన్నారు. గొర్రెల వ్యాధుల నివారణకు సంచార వైద్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు వంద బస్సులు కొనుగోలు చేసి, 1962 నెంబర్‌కు ఫోన్ చేసిన వెంటనే మంద వద్దకే అంబులెన్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పండ్ల తోటల్లో స్టైలో హేమాట గడ్డి సాగు చేయడం వల్ల తోటల్లో మందలు వేస్తే సేంద్రీయ ఎరువు లభిస్తుందన్నారు. గొర్రెలకు మేత, తోటలకు ఎరువు.. మిశ్రమ లాభం చేకూరుతుందన్నారు. ఈ విషయంలో అధికారులు పండ్ల తోటల యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా మూడేళ్లలో రోజుకు 6 వేల గొర్రెలు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలోని కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్దమైతే కొంత మంది చిల్లర రాజకీయాల కోసం కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని, అలాంటి వారు ఎవరో రైతులకు తెలుసునని మీరే నిలదీయాలని పిలుపునిచ్చారు. చిల్లర రాజకీయాలకు ఎప్పుడు బయపడేది లేదని, తన సంకల్పాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో ఉద్యమానికి వెళ్లిన తనను అపహాస్యం చేసారని, తన సంకల్పం నెరవేరడంతో అలాంటి వారి నోరు మూతపడిందని, ఇప్పుడు కూడా ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాలకు నీరందించి తీరుతామని శపథం చేసారు. ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి హెలిక్యాప్టర్‌లో తిరిగినప్పుడు ఎడారిగా మారిన తెలంగాణ భూములను చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని, ఇప్పుడు తెలంగాణాలోని కోటి ఎకరాల్లో పచ్చదనం కనిపించాలన్నదే తన కోరిక అనే పునరుద్ఘాటించారు. తనలోని ఏకాగ్రతను ఎవరు కూడా దెబ్బ తీయరని, భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో దూసుకుపోతుందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలు అనేకంగా చవిచూసామని, రాష్ట్ర సాధన అనంతరం ఆ పీడ విరగడయ్యిందన్నారు. వచ్చే యాసంగి నుంచి వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు సరఫరా చేసి తీరుతామన్నారు. మానవ తప్పిదాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు బోర్లు వేసి బోర్లా పడి అప్పుల పాలయ్యారని, సాగునీటిని అందించి రైతుల కష్టాలను నెరవేరుస్తామన్నారు. పిరికి పరకల్లా బయపడి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వచ్చే యేడాది జూన్ నాటికి గోదావరి జలాలను కొండపాకకు తీసుకువచ్చి తీరుతామన్నారు. గతంలో మానవ వనరులు ఏ విధంగా ఉత్పత్తి అయ్యాయో ఇప్పుడు కూడా అదే తరహాలో చేపట్టడానికి అన్ని రకాల కుల వృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మానవ సంపదను మించిన సంపద ఎక్కడ లేదన్నారు. రైతులు, కుల వృత్తులు బాగుపడితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్నారు. 2024 సంవత్సరం నాటికి రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లకు చేరుకుంటుందని సిఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేసారు. పాడి, పంటలు, సాగు, తాగునీరు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు దీటుగా ఐటి రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. పారిశ్రామికీకరణ మెరుగుపడటం ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని స్పష్టం చేసారు. నేల విడిచి సాము చేస్తే సాధించలేనిదంటూ ఉండదని, తెలంగాణ రాష్ట్రం 1948-56 మద్య కాలంలో ధనిక రాష్ట్రంగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు అది మరో మారు నిరూపితమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, కార్పోరేషన్ల చైర్మన్లు నర్సారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, దేవిప్రసాద్‌తో పాటు దేశపతి శ్రీనివాస్, కలెక్టర్ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రభూమి సంపాదకీయం గుర్తు చేసిన సిఎం
గొర్రెల పెంపకం వల్ల కలిగే బహుళ ప్రయోజనాలపై ఆంధ్రభూమిలో ప్రచురితమైన సంపాదకీయాన్ని సిఎం కెసిఆర్ మంగళవారం సభలో గుర్తు చేశారు. గొర్రెల పెంపకం వల్ల సేంద్రీయ ఎరువుల లభ్యత, కుల వృత్తుల అభివృద్ధిపై ఆంధ్రభూమి సంపాదకులు చక్కని కథనం ప్రచురించారని గుర్తు చేసుకున్నారు. అదేస్థాయిలో అభివృద్ధి సాధించి బంగారు తెలంగాణకు బాసటగా నిలవాలని సిఎం గొల్ల కాపరులకు పిలుపునిచ్చారు.

చిత్రం.. గొల్ల కుర్మలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్