రాష్ట్రీయం

రిజర్వాయర్ల నిర్మాణానికి ముందే చెరువులకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు పూర్తికాకముందే ప్రాజెక్టు పరిధిలోని కాల్వల నిర్మాణం పూర్తిచేసి చెరువుల నింపి పొలాలకు సాగునీరు అందించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. గత ఏడాది శ్రీరామ్‌సాగర్ కాల్వల ద్వారా చెరువులు నింపడంవల్ల 9 లక్షల ఎకరాల్లో రూ.4,725 కోట్ల విలువ చేసే పంటలు పండాయన్నారు. నిర్మాణంలోవున్న ప్రాజెక్టులపై రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే, దానికి వందల రెట్ల పంట చేతికి వస్తుందన్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ఈఎన్‌సి మురళీధర్‌రావు, సిఎంఒ అధికారులతో సిఎం సమీక్ష జరిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి నదుల కలయిక తర్వాత దిగువప్రాంతంలో ఎంతో నీరు లభ్యమవుతుందని, వాటిని వినియోగించుకుంటే భవిష్యత్‌లో నీటి కొరతే ఉండదన్నారు. ప్రాజెక్టుల ద్వారా నీరందించలేని ప్రాంతాల్లో చిన్ని నీటి వనరులను అభివృద్ధి చేయాలని సూచించారు. మొత్తంగా తెలంగాణలో ఏడాదికి రూ.లక్షా 25 వేల కోట్ల విలువ చేసే పంటలు పండుతున్నాయని, ఇది రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో సమానమన్నారు. కొండపోచమ్మ సాగర్ నిల్వ సామర్థ్యం పెంచిన తర్వాత రూపొందించిన డిజైన్లను సిఎం పరిశీలించి ఆమోదించారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు వెంటనే టెండర్లు ఆహ్వానించి 8నుంచి 10 నెలల్లో పనులు పూర్తిచేయాలన్నారు. కోటి ఎకరాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ అందించేందుకు ట్రాన్స్‌కో ఏర్పాట్లు చేసిందన్నారు. ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులను నీటిపారుదల శాఖ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
వ్యవసాయ ఖర్చును రైతుల కోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోంది తప్ప, భారంగా భావించడం లేదన్నారు. ప్రాజెక్టులు నిర్మించే పనిలోవున్న నీటిపారుదల శాఖ భవిష్యత్‌లో ప్రాజెక్టుల నిర్వహణ కోసం పని చేస్తారన్నారు. దీనికి కార్యాచరణ రూపొందించాలని, ఎంతమంది ఈఎన్‌సిలు, సిఇలు ఉండాలి, ఎవరెవరు ఎక్కడ పని చేయాల్సి ఉంటుందో అవగాహనకు రావాలన్నారు. అధికార యంత్రాంగమంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కాకుండా క్షేత్రస్థాయికి విస్తరించాలన్నారు. గతంలో నీటిపారుదల శాఖ ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేశారని, ప్రస్తుతం దానిని 31 జిల్లాలకు అనుగుణంగా వ్యవస్థను మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణ క్రమబద్ధంగా జరగడానికి ప్రణాళిక ఉండాలని, నీటిపారుదలశాఖలో ఖాళీలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేయాలన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కేవలం సాగునీటి అవసరాలకు మాత్రమే కాకుండా మంచినీటి అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలన్నారు. పాలమూరుకు శ్రీశైలం నీళ్లను ఎలా ఉపయోగించుకోగలమో పూర్తి స్థాయి అధ్యయనం చేయాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు మాత్రమే ఉపయోగించుకునే విధంగా చూడాలన్నారు. పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా పథకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అన్నారు.