రాష్ట్రీయం

కదం తొక్కిన పోలవరం నిర్వాసితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఆగస్టు 1: పోలవరం ప్రాజెక్టుతో సర్వం కోల్పోనున్న విలీన మండలాల నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం అంతర్రాష్ట్ర దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు. చింతూరు మండలం చట్టి వద్ద 30వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆంధ్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమానికి అఖిలపక్షం మద్దతు పలికింది. ముందుగా చింతూరు నుంచి చట్టి వరకూ భారీ ర్యాలీ నిర్వహించిన నిర్వాసితులు, చట్టి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ విలీన మండలాల ప్రజల త్యాగాలవల్లే పోలవరం నిర్మాణం జరుగుతోందని చెప్పిన చంద్రబాబు, నేడు వారిని మాయమాటలతో ముంచేస్తున్నారని ధ్వజమెత్తారు. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్న బాబు, నేటికీ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందించక పోవడమేమిటని ప్రశ్నించారు. సిపిఎం నేతలు అరుణ్, మిడియం బాబూరావు, కృష్ణమూర్తి మాట్లాడుతూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండు చేశారు. ప్రభుత్వ మాయమాటలకు నిర్వాసితులు విసిగిపోయారని, ఇక తిరుగుబాటు బావుటా ఎగరేయడం తథ్యమన్నారు. 2019 డిసెంబర్ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు గంటల పాటు దిగ్బంధం నిర్వహించడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను కలిసిన ఐటిడిఎ పిఒ చినబాబు, భూనిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాగా 17, 18 తేదీల్లో విలీన మండలాల బంద్‌నకు సిపిఎం పిలుపునిచ్చింది. కార్యక్రమంలో సిహెచ్ మురళి, కొమరం పెంటయ్య, కారం శిరమయ్య, శేషావతారం తదితరులు పాల్గొన్నారు.
సొమ్మసిల్లిన మాజీ ఎంపీ
మండుటెండలో మూడు గంటలపాటు దిగ్బంధ కార్యక్రమం సాగటంతో మాజీ ఎంపీ మిడియం బాబూరావు సొమ్మసిల్లి పడిపోయారు. కొద్దిసేపటికే కోలుకున్న ఆయన, మళ్లీ ఆందోళనలో పాల్గొన్నారు.

చిత్రం.. చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపై బైఠాయంచిన ఆందోళనకారులు