రాష్ట్రీయం

ఆపండి మహాప్రభో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఆగస్టు 1: వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు సరఫరా వద్దేవద్దంటూ అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం విద్యుత్ సమస్య ఎదుర్కొన్న రైతాంగం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత ఏడు నుంచి తొమ్మిది గంటల విద్యుత్ అందుకుంటున్నారు. విద్యుదుత్పత్తిని పెంచిన ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించి మొదటి విడతలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఎంపిక చేసి గత 19 నుంచీ సరఫరాను ప్రారంభించింది. నిరంతర విద్యుత్ సరఫరాతో భూగర్భజలాలు అడుగంటి వేసిన పైర్లు ఎండిపోయి పెట్టుబడులు మట్టిలో కలిసిపోతున్నాయి. పంటలను దక్కించుకునేందుకు అన్నదాతలు తంటాలు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి నీటి కాలువలు లేవు. పూర్తిగా భూగర్భజలాలపైనే అధారపడి సాగు చేస్తున్నారు. నిరంతర విద్యుత్‌తో పక్షం రోజుల్లోనే పైభాగంలో ఉన్న నీటిని తోడెయ్యడంతో గంగమ్మ పాతాళానికి వెళ్లిపోయింది. పాతాళంలో ఉన్న గంగమ్మను పైకి తెచ్చి పంటలను కాపాడుకునేందుకు అదనపు పైప్‌లు వేస్తున్నారు. కొత్త బోర్లు వేసి మోటార్లు బిగిస్తున్నారు. అయినా ఆశించిన ప్రయోజనం లభించకపోవడంతో అన్నదాతలు బోరుమంటున్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కావడంతో డ్రమ్ము నీళ్లకోసమైనా రోజంతా నడిపిస్తున్నారు. పాతాళంలో ఉన్న ఊట దారి మళ్లుతోందని నిరంతరం మోటార్లు
నడిపిస్తున్నారు. దీంతో వేడెక్కి మోటార్లు, స్టాటర్లు, ఆటోమెటిక్‌లు కాలిపోయి రైతుకు ఆర్థికంగా భారమవుతోంది.
గత పాలనలో విద్యుత్ సమస్య, లోఓల్టేజీ, కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కే పరిస్థితి. కానీ నేడు అందుకు విరుద్ధంగా 24 గంటల విద్యుత్ వద్దే వద్దంటూ రోడ్డు ఎక్కుతున్నారు. 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తే సరిపోతుందని, అంతగా అనుకుంటే 12 గంటలు ఇస్తే చాలని రైతులు అంటున్నారు. 24 గంటలు ఇస్తే భూగర్భజలాలు అడుగంటి రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు ట్రాన్స్‌కో అధికారులకు కలిసి వినతి పత్రాలు అందజేశారు. సంస్థాన్‌నారాయణపురంలో రైతులు రాస్తారోకో చేసి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి 12 గంటల కరంటు మాత్రమే సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై వత్తిడిపెంచి 12 గంటల కరంటు సరఫరా కోసం రైతులు ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రైతు సంఘాలు 24 గంటల కరెంటుపై వెనుకాముందు ఆలోచనలు చేస్తున్నాయి.

మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న రైతులు (ఫైల్‌ఫొటో)