రాష్ట్రీయం

కొలువులు 84,876

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: నిరుద్యోగులకు సిఎం కెసిఆర్ స్వాతంత్య్ర దినోత్సవ కానుక ప్రకటించారు. 84,876 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు సిఎం చంద్రశేఖర్ రావు గోల్కొండ కోట నుంచి ప్రకటించారు. గోల్కొండ కోటపై మంగళవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడేళ్లలో తెలంగాణ అభివృద్ధిని గణాంకాలతో వివరించారు. 2016-17లో 21.7 శాతం ఆదాయ వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. ‘తెలంగాణ సిద్ధిస్తే లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని ఉద్యమ సమయంలో భావించాం. పవిత్ర స్వాతంత్య్ర దినోత్సవవేళ నిరుద్యోగ యువతకు శుభవార్త ప్రకటిస్తున్నా. ఇప్పటివరకు చేపట్టిన 27,600 నియామకాలతోపాటు, మరో 84,876 ఉద్యోగాల నియామక ప్రక్రియ సత్వరమే చేపట్టబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ ఆశించిన దానికంటే మిన్నగా 1,12,536 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికీ ఈ ఏడాదే నియామక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ‘మా ప్రయత్నాన్ని దెబ్బతీయటానికి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేస్తున్నా, ప్రజాశీర్వాదంతో ముందుకు వెళ్తున్నా’ అని ప్రకటించారు. ప్రభుత్వ పారదర్శక విధానాలు, పటిష్టమైన ఆర్థిక క్రమ శిక్షణే వృద్ధిరేటులో అగ్ర భాగాన నిలవడానికి కారణమన్నారు. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయని, ప్రజల మద్దతు,
ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతతోనే ఇది సాధ్యమైందన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాల మీద సుపరిపాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 90 శాతంగావున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎదుగుదలకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు చెప్పారు. పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తున్నామని, పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.
మిషన్ భగీరథ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించే అపురూప పథకమన్నారు. ఈ పథకం లక్ష్యాన్ని ముద్దాడే దిశగా గ్రామీణ నీటి సరఫరా అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌కే అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన నదీ జలాలు అందించే అవకాశాలు ఉన్నాయన్నారు.
కేజీ టు పీజి ఉచిత విద్యలో భాగంగా మెరుగైన వసతులతో 522 గురుకుల పాఠశాలలు కొత్తగా ప్రారంభించామన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురి కావద్దని వేతనాలు పెంచామన్నారు. జిల్లాల్లోనూ షీ టీమ్స్ ప్రారంభించామని, ప్రజల కోరిక మేరకు వాటి సంఖ్య పెంచుతున్నట్టు చెప్పారు. మన రాష్ట్రంలోవలె ఇతర రాష్ట్రాల్లోనూ షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. నూతన జిల్లాల ఏర్పాటువల్ల ప్రజలకు పాలన చేరువైందన్నారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తామని, మొత్తం 46,500 చెరువుల్లో ఇప్పటికే 20వేల చెరువుల పునరుద్ధరణ జరిగిందన్నారు. చెరువుల్లో నీటి నిల్వ పెరగడం, విద్యుత్ సరఫరా మెరుగు పడటంతో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి పంటలు పండాయన్నారు. దాదాపు 96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతాంగం నూతన చరిత్రను లిఖించిందన్నారు. నదీ జలాల్లో మన వాటాను ఉపయోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోందని, ఏటా 25వేల కోట్లు ప్రాజెక్టులకు కేటాయిస్తున్నట్టు కెసిఆర్ తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు.
81ఏళ్ల తరువాత భూ సర్వే
రైతులను సంఘటిత పరిచి వారి ప్రయోజనాలు వారే రక్షించుకునే విధంగా రైతు సంఘాలను, సమాఖ్యలను ఏర్పాటు చేయనున్నట్టు కెసిఆర్ తెలిపారు. సమగ్ర భూ సర్వేతో తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించ బోతున్నదని , 1936లో నిజాం కాలంలో మాత్రమే ఒకసారి భూ సర్వే జరిగినట్టు చెప్పారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ సర్వేకు పూనుకోలేదని, మళ్లీ ఇన్నాళ్లకు 81ఏళ్ల తర్వాత ప్రభుత్వం భూ సర్వే నిర్వహిస్తోందని చెప్పారు. రాబోయే కొద్ది నెలల సమయంలోనే జరిగే ఈ భూ సర్వే విజయవంతం కావడానికి రాష్ట్రంలోని రైతులే సారథ్యం వహించాలని కోరారు. ఎక్కడి రైతులు అక్కడే వారివారి గ్రామాలకు కథానాయకులు కావాలి. ఇది ఎవరి పనిగానో భావించి ప్రేక్షక పాత్ర వహించకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రైతు సంఘాలు సర్వేను విజయవంతం చేయాలని కెసిఆర్ కోరారు. సర్వే పూర్తయిన తరువాత భూ రికార్డులన్నీ పూర్తిగా సరి చేయనున్నట్టు, రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం రైతాంగం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దూరమవుతుందని , అవినీతికి ఆస్కారం లేని పారదర్శక విధానం అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కెసిఆర్ చెప్పారు. ఐదువేల కోట్ల రూపాయలు వెచ్చించి గొర్రెలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కోటి 47లక్షల గొర్రెలు అందించే ప్రక్రియ సాగుతోందని, ఇప్పటికే 12లక్షల గొర్రెలను 57 వేల కుటుంబాలకు అందజేసినట్టు చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకునే పథకాలు చేపట్టినట్టు చెప్పారు. బతుకమ్మ పండుగకు 93లక్షల మంది మహిళలకు చీరలు అందజేయనున్నట్టు చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ చేనేత చీరలు ఇవ్వనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.

చిత్రం.. గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేదిక నుంచి మాట్లాడుతున్న సిఎం కెసిఆర్