రాష్ట్రీయం

విశాఖ- చెన్నై కారిడార్‌కు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 21: విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. కారిడార్ పరిధిలో ముందుగా కాకినాడ పోర్టు నుంచి రాజానగరం వరకు రోడ్డును విస్తరించి 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. కారిడార్ పరిధిలో మొదటిగా రోడ్డును విస్తరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు అవసరమైన నిధులను ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎడిబి) విడుదల చేసింది. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కాకినాడ పోర్టునుంచి రాజానగరం జంక్షన్ వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి జంక్షన్ వరకు రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరణకు మొత్తం రూ.730 కోట్లు అంచనాతో పనులు చేపడుతున్నారు. రెండు ప్యాకేజీలుగా చేపట్టే రోడ్డు నిర్మాణం మొదటిదశ పనులు మరో నెలలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పిలిచిన టెండర్లలో ఏజెన్సీని ఖరారు చేయాల్సి ఉంది.
సామర్లకోట నుంచి రాజానగరం వరకు మొదటి దశగా 30 కిలోమీటర్ల రోడ్డును నాలుగు లేన్లుగా రూ.230 కోట్ల అంచనాతో రూపొందించారు. ఇందుకు అవసరమైన 72 ఎకరాల భూసేకరణ పూరె్తైంది. ఈ 30 కిలోమీటర్ల పరిధిలో సామర్లకోట వద్ద ప్రస్తుతంవున్న రైల్వే ఓవర్ బ్రిడ్డి (ఆర్‌ఒబి) పక్కనే నాలుగు లేన్ల ఆర్‌ఓబిని నిర్మించనున్నారు. సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ చెరువు పైభాగంలో ప్రస్తుతంవున్న బ్రిడ్జి పక్కనే ఈ నాలుగు లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్నారు. దీంతో సామర్లకోట జంక్షన్‌లో ఏళ్ల తరబడి జఠిలంగావున్న ట్రాఫిక్ సమస్యకు మోక్షం లభించనుంది.
కాకినాడ పోర్టునుంచి సామర్లకోట వరకు రెండో ప్యాకేజీగా 26 కిలోమీటర్లమేర రూ.500 కోట్లతో రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తారు. ఈ రోడ్డుకు డిపిఆర్ తయారవుతోంది. మూడుచోట్ల ఆర్‌ఓబిలను నిర్మించనున్నారు. సామర్లకోట దాటిన తర్వాత కాకినాడ వెళ్లే రోడ్డులోని వికె రాయపురం సమీపంలో అచ్చంపేటరోడ్డు ఆర్‌ఒబికి పక్కనే నాలుగు లేన్ల మరో ఆర్‌ఓబి, కాకినాడ పోర్టుకు అతి సమీపంలో మరో రెండు ఆర్‌ఓబిలు మొత్తం 56 కిలోమీటర్ల పొడవు కలిగిన విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ రోడ్డులో నాలుగు లేన్ల నాలుగు ఆర్‌ఓబిలు నిర్మిస్తారు. రెండోదశ పనులకు రోడ్డు విస్తరణకు సంబంధించి అవసరమైన 89 ఎకరాల భూమికి సంబంధించి సర్వే జరుగుతోంది. త్వరలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఎడిబి రుణ సహకారంతోనే దాదాపు రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రోడ్డు పోర్టు కార్యకలాపాలకు, విస్తరణకు ఎంతో దోహదపడింది. ఇపుడు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా రూ.730 కోట్లతో విస్తరించడంతో పారిశ్రామిక పురోభివృద్ధికి ఆలంబనగా మారనుంది. కాకినాడ పోర్టు నుంచి రాజానగరం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయడంతో ఈ ప్రాంతాలన్నీ బహుముఖంగా అభివృద్ధి చెందనున్నాయి. మరో నెలలోగా మొదటి ప్యాకేజీ పనులు మొదలు కానున్నట్టు ఆర్‌డిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్ సుధాకర్ ఆంధ్రభూమికి చెప్పారు.

చిత్రం..ఆర్‌ఒబి నిర్మించనున్న సామర్లకోట చక్కెర ఫ్యాక్టరీ చెరువు ప్రాంతం