రాష్ట్రీయం

మందకొడిగా పోలింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 29: చెదురు మదురు ఘటనలు వినా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా సాగింది. పోలింగ్ మందకొడిగా కేవలం 64.78 శాతంగా నమోదయ్యింది. ఉదయం 7నుంచి నగరంలోని 48 డివిజన్లలో ఏర్పాటుచేసిన 196 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం కాగా, కొన్ని పోలింగ్ స్టేషన్లలో మధ్యాహ్నం వరకు ఓటర్లు కనిపించకపోవడం విశేషం. నగరపాలక సంస్థలోని 48 డివిజన్లలో 2 లక్షల 29వేల 373 మంది ఓటర్లకుగాను లక్ష 48వేల 598 మంది ఓటు హక్కు వినియోగించున్నారు. పోలింగ్ ప్రారంభం నుంచి కొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. 9వ డివిజన్‌లో బిజెపి అభ్యర్థి ఓటర్లకు నగదు పంచుతున్నారంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో కేంద్ర బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. జగన్నాథపురంలోని 14వ డివిజన్‌లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పోలింగ్ బూత్ పరిశీలనకు
వెళ్ళడంతో వైసిపి నేతలు అడ్డుకుని ఆందోళనకు దిగారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిబంధనలను అతిక్రమించిన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలన్న వైకాపా ఫిర్యాదుపై విచారిస్తామని ఎస్పీ చెప్పారు. నగరంలోని 14,15 డివిజన్లలో పోలింగ్ కేంద్రాల వద్ద పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎస్ వర్మ ఓటరు స్లిప్‌లు పంచుతుండగా గమనించిన పోలీసులు ఆయనను వారించారు. కాకినాడ మాజీ మేయర్ కె సరోజ 49వ డివిజన్‌లో ఓటు వేసేందుకు వెళ్ళగా ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో అవాక్కయ్యారు. దీనిపై ఆమె సంయుక్త కలెక్టర్ మల్లికార్జునకు ఫిర్యాదు చేయగా, విచారిస్తామని చెప్పారు.
నోటా లేకపోవడంపై అభ్యంతరం
పోలింగ్ సందర్భంగా ఇవిఎంలపై నోటా లేకపోవడం పట్ల కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. అయితే ఎన్నికల అధికారులు దీనిపై స్పష్టత ఇస్తూ కార్పొరేషన్ ఎన్నికల్లో నోటా ఓటు ఉండదని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే ఆ అవకాశం ఉంటుందన్నారు.
సెప్టెంబర్ 1న అభ్యర్థుల భవితవ్యం
అభ్యర్థుల జాతకాలు సెప్టెంబర్ 1న తేలిపోనున్నాయి. మొత్తం 241 మంది పోటీలో ఉన్నారు. వీరిలో టిడిపి- బిజెపి అభ్యర్థులు 48 మంది, వైసిపి నుండి 48మంది, కాంగ్రెస్ నుండి 17మంది బరిలో ఉన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

చిత్రం..పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు