రాష్ట్రీయం

స్మాల్‌స్కేల్‌పై చిన్నచూపా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: చిన్నతరహా పరిశ్రమలకు ఆశించిన మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సహకారం లభించడం లేదని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె తారకరామారావు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఊర్జిత్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి చిన్నతరహా పరిశ్రమల నుంచే పారిశ్రామిక ఉత్పత్తులు 45శాతం, ఎగుమతులు 40 శాతం ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. సోమవారం ముంబయిలో ఆర్బీఐ గవర్నర్, పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. చిన్నతరహా పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని, వీటికి ఆర్బీఐ నుంచి తగినంత ప్రోత్సహం, సహకారం అవసరమని మంత్రి సూచించారు. చాలా సందర్భాల్లో చిన్నతరహా పరిశ్రమలను సిక్ యూనిట్లుగా గుర్తించి వేలం వేస్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఒక జాతీయ బ్యాంక్ ఒక చిన్నతరహా పరిశ్రమను ఎన్‌పిఏగా గుర్తించిన 15 రోజుల్లోనే వేలం వేసిన ఉదంతాన్ని ఊర్జిత్ దృష్టికి తీసుకొచ్చారు. చిన్నతరహా పరిశ్రమల బకాయిలపై నిర్ణయం తీసుకోవడానికి జిల్లాస్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకోవాలని ఆర్బీఐ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ బ్యాంకులు పాటించడం లేదని మంత్రి వివరించారు. తెలంగాణలో సుమారు 69,120 గుర్తింపు పొందిన సూక్ష్మ మరియు చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయని, వీటిలో సుమారు 8618 పరిశ్రమలు సిక్ యూనిట్లుగా గుర్తించారన్నారు. చిన్నతరహా పరిశ్రమలు మూతపడకుండా ఆదుకోవడానికి తమ పారిశ్రామిక విధానంలో ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ప్రారంభించి దానికి రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్నారు. అయితే ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను ప్రత్యేక ఆర్థిక సంస్థగా గుర్తించి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ఆర్బీఐ అందించాలని మంత్రి కోరారు.
ఐసిఐసిఐ చైర్‌పర్సన్ చందా కొశ్చర్‌తోనూ మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్, ఉమెన్ ఏంట్రప్రెన్యూర్ షిఫ్, డిజిటల్ ఇనిషియేటివ్స్ తదితర అంశాలను మంత్రి చర్చించారు. తమ ప్రభుత్వం ఏర్పాటు
చేసిన టి-్ఫండ్‌లో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. అనంతరం జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండి సజ్జన్ జిందాల్‌ను మంత్రి కెటిఆర్ కలిసి తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానంలోని హైలెట్స్‌ను మంత్రి వివరించారు. అలాగే లూపిన్ ఎండి నీలేష్ గుప్తను కలిసి ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అనంతరం సాయంత్రం వార్షిక గ్లోబల్ పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొని ‘స్టార్ట్ అప్ స్టేట్‌గా మూడేళ్ల తెలంగాణ ప్రయాణం’ అనే అంశంపై మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఒక స్టార్టప్ కంపెనీ మాదిరిగా ఉన్నతమైన నిబద్దత, పట్టుదలతో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి వివరించారు. తమ పారిశ్రామిక విధానానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని, ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, పెట్టుబడుల సేకరణ వంటి బహుముఖ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని అన్నారు.

చిత్రం..చిన్న పరిశ్రమలకు బ్యాంకుల సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్‌కు విజ్ఞప్తి చేస్తున్న మంత్రి కెటిఆర్