రాష్ట్రీయం

ఇక రియల్‌టైమ్ పాలిటిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 5: ‘బలం పెంచుకోండి.. బలహీనత సరిదిద్దుకోండి. ఇప్పటిదాకా రియల్ టైమ్ గవర్నెన్స్ చేశాను, ఇకపై రియల్ టైమ్ పాలిటిక్స్ చేస్తాను. రాజకీయం అంటే నిరంతర ప్రజామోదం పొందడం. రాబోయే ఆరు నెలల్లో 10శాతం ఓట్లు పెరగాలి. ప్రజల్లో సంతృప్తి మరో 10శాతం పెరగాలి’ అని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ వర్క్‌షాప్‌లో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. కుప్పం, కాకినాడ, నంద్యాల ఎన్నికల్లో అనుసరించిన రాజకీయ వ్యూహాల గురించి బాబు వివరించారు. ‘ఈ మోడల్ అనుసరిస్తే మనం ఎంత మెజారిటీ కావాలో అంత మెజారిటీ తెచ్చుకోవచ్చు. 39ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, 30ఏళ్ల నుంచి కుప్పంలో పోటీచేస్తున్నా, ఆరు ఎన్నికలు ఎదుర్కొన్నా, 45వేల నుంచి 60వేల మెజారిటీతో గెలుస్తున్నా. రేపే ఎన్నిక పెట్టినా 60వేల ఆధిక్యతతో గెలుస్తా. ఇప్పటివరకు 72సార్లు మాత్రమే కుప్పం వెళ్లాను. అయినా నిరంతరం కుప్పం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటం వల్లే విజయాలు సాధించగలుగుతున్నా. మీరు కూడా నిరంతరం మీ నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలి.’అని చంద్రబాబు స్పష్టం చేశారు. కాకినాడ, నంద్యాల ఎన్నికలు ఒక నమూనా. దీని స్ఫూర్తితో టార్గెట్ 2019 లక్ష్యం చేసుకుని మొత్తం 175సీట్లు కైవసం చేసుకోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం అన్ని ప్రాంతా ల్లో ఏకరీతిగా చేస్తున్నప్పుడు ఫలితాలు కూడా అన్ని నియోజకవర్గాల్లో యూనిఫామ్‌గా రావాలన్నారు. ఒకచోట ఆధిక్యత 20వేలు ఉండటం, మరోచోట వెనుకబడటం కరెక్ట్ కాదన్నారు. నాయకత్వ లోపం ఉంటే సరిదిద్దుకోవాలన్నారు. ఎన్నిక అంటే సవాల్‌గా తీసుకోవాలి తప్ప దైవాధీనంగా తీసుకోరాదు. కాకినాడలో ప్రతిపక్షం సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని అనుకున్నాం. 10 డివిజన్లు రావడం కూడా వైకాపాకు ఎక్కువే అని వ్యాఖ్యానించారు. రాబోయే ఆరు నెలలకు యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సెప్టెంబర్ 11 నుంచి రెండు నెలలు ఉంటుందన్నారు. సంక్షేమంలో ఎక్కడా వివక్ష చూపరాదని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా రూ.50వేల కోట్లతో పేదలకు 18 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పటికే 12,500 కిమీ సిసి రోడ్లు వేశామన్నారు. ఈ ఏడాది మరో 4వేల కిమీ వేస్తున్నట్లు తెలిపారు.
‘ఒక యజ్ఞంలాగా అభివృద్ధి చేస్తున్నాం. ఒక బాధ్యతగా సంక్షేమం చేస్తున్నాం. ఈ ఫలితం కష్టంతో వచ్చింది, ఊరికే రాలేదని’ చంద్రబాబు అన్నారు. బీసీ ఆడపిల్లల వివాహానికి రూ.25వేల చొప్పున 40వేల మందికి ఈ ఏడాది పెళ్లికానుకగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
‘5కోట్ల ప్రజల చూపు, ఆలోచన తెలుగుదేశం పార్టీపై ఉన్నాయి. దీన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు అందరికీ ఎవరి పాత్ర ఏమిటనే స్పష్టత ఉండాలి. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారు, మీ స్థానం ఎక్కడ ఉంది? అనే దానిపై ప్రతి నాయకుడికి క్లారిటీ ఉండాలి. నాకు అన్నీ తెలుసు అని అనుకోను.. అతి విశ్వాసం అనేది ఎప్పుడూ నా దరిచేరదు. మీరు కూడా అలాగే ఉండాలి. అతి విశ్వాసం, అవిశ్వాసం రెండూ మంచిది కాదని’ హితవు పలికారు.
‘ఒకసారి గెలుపు, మరోసారి ఓటమి అనే సాంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది. సానుకూలత సాధిస్తే శాశ్వత అధికారం సాధ్యమే. ప్రజల అవసరాలు మనమే తీర్చినప్పుడు వేరేవాళ్ల అవసరం ఏముంటుంది? దీన్ని ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలని’ చంద్రబాబు అన్నారు.
‘వాళ్లు వాళ్లు గొడవపడి రాజధాని ప్రాంతంలో అరాచకం చేయాలని చూస్తున్నారు. మా పార్టీలో వెధవలను ప్రోత్సహిస్తున్నారు అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అలాంటి నాయకుడు కాబట్టే అలాంటి వాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. తప్పుడు పనులు చేయడం, టిడిపిని విమర్శించడం, శాంతిభద్రతల సమస్య సృష్టించడం ప్రతిపక్షానికి రివాజుగా మారింది. నెల్లూరు క్రికెట్ బెట్టింగ్ మాఫియాగా మారింది. వైకాపా ఎమ్మెల్యేలు బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాకినాడలో క్రికెట్ బెట్టింగ్‌లో మాజీ ఎమ్మెల్యే పాత్ర తెలిసిందే. నేర చరిత్ర ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో వైకాపానే ఉదాహరణ’ అంటూ ప్రతిపక్షంపై చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఈ కార్యగోష్టిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సోషల్ మీడియా గురించి, కమ్యూనికేషన్స్ స్కిల్స్ గురించి, బూత్ మేనేజ్‌మెంట్ గురించి ప్రజంటేషన్ ఇచ్చారు. పరిష్కార వేదిక 1100 ద్వారా ఇటీవల చేసిన సర్వే వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించారు.

చిత్రం..టిడిపి రాష్టస్థ్రాయి వర్క్‌షాప్‌లో దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు