రాష్ట్రీయం

జలమే జీవనాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు/రెడ్డిగూడెం, సెప్టెంబర్ 7: జలమే జీవనాధారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గోదావరి నదిలో వృథాగా పోతున్న జలాలను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించి రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామం వద్ద చింతలపూడి ఎత్తిపోతల విస్తరణ పథకం పైలాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఆవిష్కరించారు. గోదావరి జలాలను మెట్ట ప్రాంతాలకు చేర్చేందుకు గాను 3,208 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన విస్తరణ పథకం పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ముందుగా ఎన్‌ఎస్‌పి కాలువలో జలసిరికి ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రకృతిలో అందరూ భాగమని, వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రకృతి ఎంతో పచ్చగా ఉండేదని ప్రస్తుతం దీనికి భిన్నంగా మారిందని అన్నారు. వర్షాలు సకాలంలో కురవటం లేదని భూగర్భ జలాలు అడుగంటిపోయాయని అన్నారు. జలమే జీవనాధారమని దీనిని దృష్టిలో ఉంచుకుని గోదావరి నది నుండి వృథాగా పోతున్న మూడు వేల టిఎంసిల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించామన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి గోదావరి జలాలు తీసుకువచ్చి నదులను అనుసంధానం చేశామన్నారు. కృష్ణాడెల్టాకు గోదావరి జలాలు అందించి కృష్ణారైతుల కళ్ళలో ఆనందం చూశామని
చెప్పారు. దేశంలో తొలిసారిగా నదులను అనుసధానం చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చెప్పారు. దీని స్ఫూర్తితో అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా, గోదావరి జిల్లాలకు తరలించే పథకం మదిలోకి వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టి ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఈ పథకం ద్వారా రెండు జిల్లాల పరిధిలో తొమ్మిది నియోజకవర్గాలు, 33 మండలాలు, 2.80 లక్షల స్థిరీకరించిన ఆయకట్టుకు, మరో రెండు లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుతో పాటు 200 చెరువులకు, 410 గ్రామాలకు సాగు, మంచి నీటి సౌకర్యం కలుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఏడాదిన్నర కాలంలో దీనిని పూర్తి చేసి మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు విడుదల చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను, అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే విధంగా పలు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అధునాతన సాంకేతిక వ్యవస్థలను ప్రజల ముందు ఉంచామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటు అవినీతి రహిత పాలన అందించేందుకు విశేష కృషి చేస్తున్నామన్నారు. తాను చేస్తున్న శ్రమకు, కృషికి ప్రజల ఆశీర్వాదం ఉంటే భవిష్యత్‌లో రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా అవతరించటం ఖాయమన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ప్రజల సహకారం ఉంటే ఏదైన చేయగల సత్తా తనకు ఉందని చెప్పారు. మనం సాంప్రదాయం ప్రకారం ఎన్నో పండుగలు చేసుకుంటున్నామన్నారు. అయితే జలం జీవనాడి, ప్రాణాధారామని, దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పండుగలుగా జలసిరి హారతి, ఏరువాక, వనం-మనం కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రజల పండుగల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని, ప్రకృతిని ఆరాధించాలని పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు అమలులో వివక్ష చూపకుండా, అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు లేని సమాజం కావాలని, ప్రతి కుటుంబానికి పెద్దగా ఉంటానని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినప్పటకీ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మూడో విడత రైతు రుణమాఫీ నిధులను ఈనెలాఖరులోగా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కోటి ఎకరాలలో పండ్ల తోటలు పెంపకం, కోటి ఎకరాల్లో బిందు సేద్యం జరిగేవిధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక అధిక ధరలకు విక్రయిస్తూ దందా చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఇసుక దందా చేస్తారా.. ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. అదేవిధంగా బెల్టు షాపులు కొనసాగిస్తే ఎంతటి వారినైనా వదిలేదని లేదని, మహిళల ఆత్మరక్షణే ముఖ్యమని స్పష్టం చేశారు. మర్యాదగా దారికి వస్తే సంతోషమని, లేకుంటే చర్యలు తప్పవని ఇసుకాసులు, మద్యం బెల్టు షాపుల నిర్వాహకులకు సూచించారు.
పిట్టలవానిపాలెంకు గ్రీన్ సిగ్నల్
చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్న గోదావరి జలాలను నాగార్జున సాగరు కాలువ పరిధిలోని పిట్టలవాని పాలెంకు సరఫరా చేయాలని, దీని కోసం మరో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరగా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి దీని కోసం ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తానని ప్రకటించారు. నీటి కోసం ఎంత ఖర్చు అయినా వెనకాడే ప్రసక్తి లేదన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూస్తూ, జీవన ప్రమాణాలు పెరగటం ప్రధాన లక్ష్యమని అన్నారు.

చిత్రం..చింతలపూడి ఎత్తిపోతల రెండోదశ శంకుస్థాపన పైలాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి