రాష్ట్రీయం

రాజకీయ రగడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: కొత్త సచివాలయ నిర్మాణం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రస్తుత సచివాలయాన్ని అన్ని వసతులతో బైసన్ గ్రౌండ్స్‌కు తరలించేందుకు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చేసిన నేపథ్యంలో రగులుకున్న ఈ వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. మంత్రులకు వసతులు, పాలనా పరమైన అవసరాలు తీర్చడంతో పాటు కొత్త సచివాలయం ఆర్థిక భారం కూడా మరింత తగ్గుతుందన్న వాదన ప్రభుత్వానిదైతే.. విపక్షాలు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నాయి. కొత్త సచివాలయాన్ని ఎలా నిర్మిస్తారో చూస్తాం అని కాంగ్రెస్ హెచ్చరించింది. ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో భవనాలకు చెల్లించే పదేళ్ల అద్దెతో కొత్త సచివాలయాన్ని నిర్మించవచ్చునని చెబుతోంది. కాంగ్రెస్ నాయకులు బైసన్ పోల్‌ను గ్రౌండ్‌ను సందర్శించి ఇక్కడ కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తెగేసి చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ముఖ్యమా? కొత్త సచివాలయం ముఖ్యమా? అని టిడిపి ప్రశ్నించింది.
అయితే ప్రభుత్వం మాత్రం బైసన్‌పోల్‌లో కొత్త సచివాలయ నిర్మాణం ఎందుకు అవసరమో బలమైన వాదన వినిపిస్తోంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తరువాత కొత్త సచివాలయం అవసరం గురించి వివరిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 38 ఎకరాల భూమిని రక్షణ శాఖ నుంచి రాష్ట్రానికి బదిలీ చేయించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ విజయం సాధించారని, అభినందించాల్సింది పోయి విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అధికార పక్షం చెబుతోంది. అయతే బైసన్ ఫోల్ గ్రౌండ్‌పై రాజకీయ ఆందోళన ఉధృతం చేయాలని కాంగ్రెస్, టిడిపిలు నిర్ణయించాయి. కొత్త సచివాలయం కట్టే నిర్ణయంలో మార్పు లేదని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని 38 ఎకరాల బైసన్ పోల్ గ్రౌండ్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో కృషి చేసి రాష్ట్రానికి సాధించి పెట్టారని అధికార పక్షం వివరించింది. గతంలో ఇక్కడ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ప్రతి సారి రక్షణ శాఖ అనుమతి తీసుకోవలసి వచ్చేదని, ప్రస్తుతం ఉన్న పాత సచివాలయం నిజాం కాలంలో నిర్మించిన భవనాలతో ఉందని అధికార పక్షం చెబుతోంది. నిజాం కాలం నాటి భవనాలు, 50ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం పిట్ట గూళ్లలా కట్టిన భవంతులు ఉన్నాయని చెప్పారు. సచివాలయానికి అనుబంధంగా హైదరాబాద్ నగరంలో వేరువేరు చోట్ల 119 శాఖాధిపతుల కార్యాలయాలు, 89తర కార్యాలయాలు ఉన్నాయని ఆ భవనాల అద్దెకు, విద్యుత్, రవాణా ఇతర సౌకర్యాలకు ఏటా 32 కోట్ల రూపాయల వరకు వ్యయం చేస్తున్నట్టు చెప్పారు. కొత్త సచివాలయ నిర్మాణ వ్యయం 200 కోట్ల రూపాయల నుంచి 250 కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పారు. పదేళ్ల అద్దెతో శాశ్వత సచివాలయం వస్తుంటే విపక్షాలకు కడుపు మంట ఎందుకని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. సచివాలయానికి గుండెకాయ వంటి సాధారణ పరిపాలనా శాఖ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రధాన కార్యాలయాలు కూడా ఇప్పటికే సచివాలయంలో లేవని, ఇతర చోట్ల ఉన్నాయని చెప్పారు. సచివాలయంలో రెండువేల మంది ఉద్యోగులు పని చేస్తుంటారు, వారికి ఇప్పటికీ భవనంలో కనీస సౌకర్యాలు లేవు, ప్రధాన కార్యదర్శి వెయ్యి మంది ఉద్యోగులతో సమావేశం నిర్వహించాలి అంటే దానికి సరిపోయే కాన్ఫరెన్స్ హాలు లేదని చెప్పారు. ఏదైనా శిక్షణ నిర్వహించాలంటే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ప్రస్తుతం సచివాలయంలో డిస్పెన్సరీ, గ్రంధాలయం, బ్యాంకు, పోస్ట్ ఆఫీసు లాంటివి అక్కడక్కడ విసిరివేసినట్టు ఉన్నాయని అన్నారు. విభజనలో భాగంగా తెలంగాణ సచివాలయానికి పది ఎకరాల 29 గుంటల ప్రాంగణంలో ఉన్న నాలుగు బ్లాకులే కేటాయించారని చెప్పారు. మూడు లక్షల 85వేల 550 చదరపు అడుగుల సచివాలయాన్ని ప్రస్తుతం వినియోగిస్తున్నట్టు చెప్పారు. అన్ని సౌకర్యాలతో సచివాలయ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కావాలంటే ఆరులక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే నిర్మాణం జరగాలని అధికార పక్షం చెబుతోంది. అన్ని ప్రస్తుత సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగినా ఫైర్ ఇంజన్ తిరిగేందుకు కనీసం స్థలం కూడా లేదని , అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే సచివాలయ నిర్మాణం బైసన్ పోల్ గ్రౌండ్‌లో చేపట్టాలని నిర్ణయించినట్టు ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌కు నలువైపులా ఉన్న పటాన్‌చెరు, ఎల్‌బి నగర్, పహాడీ షరీఫ్, అల్వాల్ నుంచి వచ్చే వాహనాలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. మెట్రో రైలు సౌకర్యం, బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విశాలమైన పార్కింగ్ కూడా కొత్త సచివాలయానికి అందుబాటులో ఉంటుదని చెప్పారు. కొత్త సచివాలయం చుట్టూ విశాలమైన రోడ్లు వస్తే ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. తెలంగాణ కొత్త సచివాలయం దేశంలోని అన్ని సచివాలయాలకు రోల్ మోడల్‌గా నిలువడం ఖాయం అని అన్నారు. విపక్షాలు కొత్త సచివాలయాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం మాని నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే వారికే మంచిదని ప్రభాకర్ సూచించారు.