రాష్ట్రీయం

అభివృద్ధి పథకాల అమలు అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: వెనుకబడిన వర్గాలు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత సహాయ మంత్రి రాందాస్ అథావాలే పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన ఆయన కులరహిత సమాజం ఏర్పడే దిశగా, కులాంతర వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సమీక్షించేందుకు ప్రత్యేక సమావేశాన్ని కేంద్రమంత్రి నిర్వహించారు. రాష్ట్ర మంత్రి జోగురామన్నతో కలిసి ఆయన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సవివరంగా అధికారులతో చర్చించారు. సామాజిక సంక్షేమం, ఎస్‌సి, ఎస్‌టి అభ్యున్నతికి సంబంధించి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలపై సవివరంగా చర్చించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వివిధ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. మహాత్మా జ్యోతిపూలే పేరుతో 119 బిసి గురుకుల పాఠశాలలు ప్రారంభించడం గొప్పవిషయమన్నారు. బిసి సంక్షేమ కార్యక్రమాలకోసం తెలంగాణకు 702.83 కోట్ల రూపాయలు కేంద్రం నుండి ఇప్పించాలంటూ రాష్ట్ర మంత్రి జోగురామన్న చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, వెంటనే ఈ మేరకు నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంబిసి కార్పోరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బిసి సంక్షేమ ముఖ్యకార్యదర్శి అశోక్‌కుమార్, బిసి గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.
బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలి:కృష్ణయ్య
చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కోరారు. కేంద్ర మంత్రి అథావాలేను కృష్ణయ్యతో పాటు బిసి సంఘాల నేతలు గుజ్జకృష్ణ, డాక్టర్ ర్యాగఅరుణ్, జి. రమేష్, నర్సింహగౌడ్, అంజి తదితరులు కలిసి చర్చించారు. పార్లమెంట్, అసెంబ్లీలలో బిసిలకు జనాభా దామాషాగా ప్రాతినిధ్యం లేదని కేంద్ర మంత్రిదృష్టికి వారు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అథావాలే మాట్లాడుతూ, రిపబ్లికన్ పార్టీ తరఫున కేంద్రానికి బిసి రిజర్వేషన్లపై లేఖ రాయడంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో కూడా చర్చిస్తానని హామీ ఇచ్చారు.

చిత్రం..కేంద్రమంత్రి రామ్‌దాస్ అథావాలేతో మాట్లాడుతున్న జోగు రామన్న