రాష్ట్రీయం

కృష్ణాడెల్టాను ఆదుకున్న గోదావరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: కృష్ణాడెల్టాలో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన 13 లక్షల ఎకరాల ఆయకట్టును డెల్టా చరిత్రలోనే తొలిసారిగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో గోదావరి తల్లి ఆదుకుంది. కృష్ణానదిపై ఎగువన అక్రమంగా నిర్మితమవుతున్న ప్రాజెక్టుల కారణంగా గత దశాబ్దకాలంగా కృష్ణాడెల్టాలో ఏనాడూ ఖరీఫ్‌కు వరినాట్ల సమయానికి అంటే జూన్‌లో సాగు నీరందని స్థితి కొనసాగుతూ వస్తోంది. ఆలస్యంగా వరినాట్లు వేయాల్సి రావటంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే అకాల వర్షాలు, తుఫాన్ల ధాటికి ప్రతి ఏటా పంట కొట్టుకుపోయే దుస్థితి ఎదురవుతోంది. దీనివల్ల గత ఐదేళ్లలో సాధారణ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల పుణ్యాన తరలివస్తున్న గోదావరి జలాలతో తొలిసారిగా సాధారణ విస్తీర్ణానికి మించి ఇప్పటికే సాగు పనులు ప్రారంభం కావటంతో రైతుల్లో సర్వత్రా హర్షాతిరేకం వ్యక్తవౌతోంది. ఇప్పటివరకు కృష్ణాడెల్టాకు వివిధ కాలువల ద్వారా దాదాపు 50 టిఎంసిల నీరు లభిస్తే ఇందులో పులిచింతల నుంచి వచ్చిన కృష్ణానీరు కేవలం 1.64 టిఎంసిలు కూడా లేదు. వరినాట్ల సమయంలో వర్షభావ పరిస్థితుల వల్ల ఏడాది పొడవునా కనీసం 12 అడుగుల నీటిమట్టంతో కళకళలాడాల్సిన ప్రకాశం బ్యారేజ్ దయనీయంగా 8 అడుగుల దిగువకు పడిపోయింది. ఇదే సమయంలో గోదావరి జలాలు తరలించటం ద్వారా కృష్ణాడెల్టాను పట్టిసీమ కాపాడింది. మునేరు, కీసర, ఇతర వాగుల ద్వారా 7 టిఎంసిలు చేరితే ఒక్క పట్టిసీమ ద్వారానే నేటికి దాదాపు 40 టిఎంసిలు చేరటం వల్ల ప్రకాశం బ్యారేజీ 12 అడుగుల నీటిమట్టంతో కళకళలాడటమే కాకుండా, డెల్టా ప్రాంతంలో తొలిసారి సముద్రతీరం చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు చేర్చింది. ప్రస్తుతం బ్యారేజీకి వచ్చి చేరుతున్న నీటిని వచ్చినట్లే కాలువలకు వదులుతున్నారు. భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ చివరి భూములను దృష్టిలో ఉంచుకుని మొత్తం దాదాపు 14వేల క్యూసెక్కులను కాలువలకు వదులుతున్నారు.
రికార్డు స్థాయిలో పంటల సాగు
కృష్ణా జిల్లాలో గడచిన ఐదేళ్లుగా సాధారణ సాగు విస్తీర్ణం 3లక్షల 30వేల 760 హెక్టార్లు కాగా, గత ఏడాది కేవలం 3లక్షల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. ఈ దఫా అన్ని పంటలు కలిపి సాగు విస్తీర్ణం 3లక్షల 35వేల హెక్టార్లు దాటబోతోంది. ప్రధానంగా వరిసాగు సగటు విస్తీర్ణం 2లక్షల 35వేల హెక్టార్లు కాగా, గత ఏడాది అది 2లక్షల 50వేల హెక్టార్లు. ప్రస్తుతం 2లక్షల 40వేల హెక్టార్లను దాటబోతోంది. పత్తి సాగు గత ఏడాది 37వేల హెక్టార్లు కాగా, ప్రస్తుతం 49వేల హెక్టార్లు. చెరకు గత ఏడాదితో సమానంగా 9వేల 863 హెక్టార్లు, మినుము 4వేల 632 హెక్టార్లు, వేరుశనగ 969 హెక్టార్లు, కంది 1021 హెక్టార్లు, పెసర, నువ్వులు 30 హెక్టార్లు, జొన్న 34 హెక్టార్లు, పసుపు 1686 హెక్టార్లు, మిర్చి 5వేల 400 హెక్టార్లు. ఇలా అన్ని పంటల సాగు గత ఐదేళ్ల సగటు విస్తీర్ణానికి మించి సాగులోకి వచ్చాయి. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పట్టుదలతో తొలిసారిగా కృష్ణా జలాలతో నిమిత్తం లేకుండా గోదావరి జలాలతోనే కృష్ణాడెల్టాలో సిరులు పండించబోతున్నారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.