రాష్ట్రీయం

విదేశాల్లోనూ వెంకన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 16: విదేశాల్లోనూ వెంకన్న ఆలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవాసాంధ్రుల ప్రయోజనాల కోసం ఏపి నాన్ రెసిడెంట్ తెలుగు (ఎపిఎన్‌ఆర్‌టి) పాలక మండలి ‘ప్రవాసాంధ్రుల సంక్షేమం- అభివృద్ధి పాలసీ’ని ప్రకటించింది. ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్, ప్రవాసాంధ్ర భరోసా, ప్రవాసాంధ్ర సహాయ నిధి వంటి పథకాల ప్రారంభానికి సిఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఎపిఎన్‌ఆర్‌టిలో సభ్యులుగా ఉన్న 42,600 మందికి పాలసీ ద్వారా బహుళ ప్రయోజనాలు కలిగేలా చూడాలని శనివారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన పాలక మండలి తొలి సమావేశంలో అధికారులను ఆదేశించారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి ‘ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్’ పేరిట కాల్ సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తేవాలని సూచించారు. అలాగే ప్రమాదవశాత్తూ మరణించిన, అంగవైకల్యం కలిగిన వారికి ‘ప్రవాసాంధ్ర భరోసా’ పథకం కింద రూ.10 లక్షల బీమా కల్పించాలన్నారు. విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి కోల్పోయినవారికి తక్షణ సాయం కోసం ‘ప్రవాసాంధ్ర సహాయ నిధి’ని కోటితో ఏర్పాటు చేయాలన్నారు. ‘ప్రవాసాంధ్రుల సంక్షేమం- అభివృద్ధి పాలసీ’ అమలుకు ప్రభుత్వం తొలివిడతగా రూ.40 కోట్లు కేటాయిస్తున్నట్టు సిఎం చెప్పారు. తక్షణం రూ.20 కోట్లు ఇచ్చేందుకు
అంగీకరించారు. ఎపిఎన్‌ఆర్‌టికి విరాళాలు ఇచ్చేవారి కోసం ఆదాయపు పన్ను మినహాయింపు లభించేలా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పాలసీని సైతం తీసుకురావాలని అధికారులకు సిఎం సూచించారు. ఎపిఎన్‌ఆర్‌టిల కోసం హర్యానా తరహాలో స్పెషల్ ఇనె్వస్ట్‌మెంట్ జోన్, ప్రత్యేక సెల్ వంటివి ఏర్పాటుకు అధ్యయనం చేయాలన్నారు. ప్రవాస తెలుగువాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. ఇందుకు అవసరమయ్యే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులన ఆదేశించారు.
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల నియామకం
ఎపిఎన్‌ఆర్‌టి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా సుబ్బారాయుడు, రూపారాజు, మహ్మద్ బోరాలను నియమించేందుకు సిఎం అంగీకరించారు. రానున్న రోజుల్లో ఎపిఎన్‌ఆర్‌టి మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. మొత్తం 106 దేశాల్లో సుమారు 30 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారని, మార్చి నాటికి సభ్యత్వాల సంఖ్యను లక్షకు పెంచేందుకు ప్రయత్నస్తున్నామని ఎపిఎన్‌ఆర్‌టి సిఈవో కోగంటి సాంబశివరావు సిఎంకు వివరించారు.
వచ్చే నెలలో మరో 21 ఐటీ కంపెనీలు
ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రవాసాంధ్రులకు కావాల్సిన కార్యాలయ సముదాయాలను నగరంలో సరిపడా విస్తీర్ణంలో కేటాయించాలని సిఎం సూచించారు. ఇకపై రాష్ట్రం నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారిపై దృష్టి పెట్టాలన్నారు. అమరావతిలో ఎపిఎన్‌ఆర్‌టి నిర్మించే ఐకానిక్ బిల్డింగ్ ఆకృతులకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. అమరావతిలోని మొదటి ఆంగ్ల అక్షరం ‘ఎ’ని ప్రతిబింబించేలా నిర్మాణం చేపట్టనున్నారు. భవనం మధ్యలో ఏర్పాటు చేసే డిజిటల్ గ్లోబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనికి సిఆర్‌డిఏ 4.6 ఎకరాల భూమిని కేటాయించగా 10 ఎకరాల వరకు అవసరం ఉందని పాలక మండలి సభ్యులు కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని సిఎం హామీ ఇచ్చారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి, కూచిపూడి నృత్యం తెలుగుజాతి సంపదలని, ప్రపంచమంతా మన గురించి తెలిసేలా వేంకటేశ్వరుని ఆలయాలు వివిధ దేశాల్లో నిర్మించాలని చెప్పారు. ఇందుకు అవసరమయ్యే భూమిని ఇచ్చేందుకు ప్రవాసాంధ్రులు ముందుకొస్తే ఆలయ నిర్మాణానికి టిటిడి సహకరిస్తుందన్నారు. కూచిపూడిని విదేశీయులూ అభ్యసించేందుకు కృషి చేయాలని, నృత్య ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో ఎపిఎన్‌ఆర్‌టి వ్యవహారాల మంత్రి కొల్లు రవీంద్ర, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవి రాజవౌళి, ఎపిఎన్‌ఆర్‌టి వ్యవహారాల సలహాదారు వేమూరు రవికుమార్ పాల్గొన్నారు.

చిత్రం..ఏపి నాన్ రెసిడెంట్ తెలుగు పాలక మండలి సభ్యులతో సమావేశమై మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు