రాష్ట్రీయం

మహిళా శక్తి మరువద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: దేశం మరింతగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం అవసరం ఎంతైనా ఉందని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఉప్పల్‌లోని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ప్రాంతీయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై సంస్థ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
దేశంలో మహిళలకు సైతం సమాన అవకాశాలు కల్పించినపుడే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి వ్యక్తిలో దాగివున్న ప్రతిభకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పదును పెడితే అద్భుత ఫలితాలను సాధించవచ్చన్నారు. ఆర్ధికంగా, రాజకీయంగానే కాకుండా ప్రతి ఒక్క రంగంలోనూ సాధికారతను కలిగి ఉండేట్టు చేయడం కోసం శాయశక్తుల కృషి జరగాలని వెంకయ్య వివరించారు. వేదకాలం నుంచి మహిళలకు భారతదేశం పెద్ద పీట వేస్తూ వస్తోందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి మహిళలకు విద్య, ఆస్తి హక్కు వంటి అన్ని విషయాల్లో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భేటి బచావో- భేటీ పడావో కార్యక్రమం ఆడపిల్లలకు చదువు చెప్పించి, సాధికారతను అందించే దిశగా వేసిన ముందడుగు అవుతుందన్నారు. భారతదేశంలో మొత్తం శ్రామికుల్లో 47 శాతం మాత్రమే నైపుణ్యం పొందిన వారని తేలిందని, అదే జర్మనీలో 73 శాతం, జపాన్‌లో 80 శాతం, దక్షిణ కొరియాలో 96 శాతం నైపుణ్యవంతులు ఉన్నారని వివరించారు. వృత్తి విద్యా శిక్షణ అందించడం ద్వారా నైపుణ్య కొరతను తీర్చవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక శిక్షణ సంస్థల ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని కూడా సుశిక్షితులుగా తీర్చిదిద్దగలుగుతున్నామని చెప్పారు. అయితే వీటిలో ఆరోగ్య సంరక్షణ, యాత్ర పర్యటన పరిశ్రమ, ప్యాకేజింగ్ ఇంకా ప్రింటింగ్‌లలోనూ శిక్షణ అందించాలని ఉప రాష్టప్రతి సూచించారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అండదండలు అందించడంలో ముద్రా బ్యాంకు ప్రముఖ పాత్ర పోషించగలదని ఉప రాష్టప్రతి అన్నారు. బ్యాంకులు సిడ్బీ వంటి సంస్థలతో సైతం అనుబంధం ఏర్పరుచుకోవాలని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ వృత్తి విద్య శిక్షణ సంస్థలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం 17 శిక్షణ సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఆర్‌విటిఐ తొలి సంస్థ అని దీనికి 19.5 కోట్ల రూపాయిలు కేటాయించనట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి, హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి, సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఉప్పల్‌లో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ప్రాంతీయ శిక్షణ
సంస్థను ప్రారంభిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు