రాష్ట్రీయం

నవ భారతమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 17: నవ భారత నిర్మాణమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం సాగుతోందని, తెలంగాణ ప్రజలు అందులో భాగస్వాములు కావాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. అప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి సార్థకత చేకూరుతుందన్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి గడిచిన మూడేళ్లలో సాధించిన విజయాలను రాజ్‌నాథ్ వివరించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన సంకల్ప సభలో హోంమంత్రి రాజ్‌నాథ్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో నిజాం పాలన చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించినా, మరో 13నెలలపాటు తెలంగాణ ప్రజలు రజాకార్ల అరాచకాలకు గురికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ సైనిక చర్యతో నిజాం నవాబును లొంగదీసి రజాకార్ల అకృత్యాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ విముక్తి కోసం సాగించిన ప్రజాపోరాటాన్ని చరిత్ర మరువదంటూ, అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిన సెప్టెంబర్ 17వ తేదీనే, ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు కావడం కాకతాళీయమే అయినప్పటికీ, ఇదెంతో మహత్తరమైన
దినమని అన్నారు. కుల, మత, భాషల ప్రాతిపదికన దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విచ్ఛిన్నం కానివ్వబోమని, భారత సుస్థిరతను కాపాడేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.
భారత్ అహింసా విధానానికే కట్టుబడి ఉందని అంటూనే, ఎదుటి వారు కాల్పులు మొదలెడితే మాత్రం లెక్కలేనన్ని తూటాలతో జవాబు చెప్పాలని సైన్యానికి సూచించినట్టు చెప్పారు. పొరుగు దేశాల మైత్రికోసం భారత్ ప్రయత్నిస్తుంటే, పాకిస్తాన్ తన ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపి, దేశాన్ని అస్థిపర్చేందుకు కుట్రలు సాగిస్తోందని దుయ్యబట్టారు. ఉగ్రమూకల చొరబాట్లు నిలిపివేసేంత వరకు పాక్‌తో చర్చల ప్రసక్తి ఉండదని తల్చిచెప్పారు. గత మూడేళ్ల పాలనలో ఏ ఒక్క కేంద్ర మంత్రిపైనా చిన్నపాటి అవినీతి మరక లేదని, గత ప్రభుత్వంలో సాగిన లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగుచూస్తూ, పలువురు మంత్రులు జైలుకు సైతం వెళ్లారని రాజ్‌నాథ్ ఆక్షేపించారు. బిజెపికి ఓట్లు, సీట్లు ముఖ్యం కాదంటూనే, దేశం, సమాజం కోసమే తమ పార్టీ తాపత్రయ పడుతుందన్నారు. 2022నాటికి దేశంలోని ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో మోదీ సర్కార్ పని చేస్తుందన్నారు. అవినీతి రహిత భారత్ కేంద్రం లక్ష్యమని అంటూ, మూడేళ్ల స్వల్ప వ్యవధిలో 800 కోట్ల పైచిలుకు బినామీ ఆస్తులు జప్తు చేశామని, ఎన్నో బోగస్ కంపెనీలకు తాళాలు వేయించామన్నారు. మోదీ ప్రభుత్వ తీరుకు ప్రభావితమై అనేకమంది బిజెపి వైపు ఆకర్షితుల అవుతున్నారన్నారు. సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బిజెపి సంకల్ప సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్