రాష్ట్రీయం

మోదీ వచ్చినప్పుడే మెట్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఇతర నగరాల్లోని మెట్రోరైలు కన్నా హైదరాబాద్ మెట్రోరైలు భిన్నమైందని, ఈ ప్రాజెక్టును ప్రదాని నరేంద్రమోది సమయమిచ్చినపుడే మియాపూర్ యార్డులో ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఇందుకు అవసరమైతే నవంబర్ 28 ముహూర్తాన్ని మళ్లీ మార్చుతామని కూడా ఆయన స్పష్టం చేశారు. మెట్రోరైలు పనులను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లోని నగరాల్లోని మెట్రోకు దీటుగా మన మెట్రోరైలు నిర్మించినట్లు తెలిపారు. మన దేశంలో కూడా చెన్నై, లక్నో, బెంగుళూరు వంటి నగరాల్లో మెట్రోరైలును మన నగరం తర్వాత పనులు ప్రారంభించి, అందుబాటులోకి తెచ్చినా, ఏకంగా ఒకే సారి 30 కిలోమీటర్ల మెట్రోరైలు ప్రాజెక్టును అందుబాటులోకి తేవటం హైదరాబాద్‌లోనే ప్రథమమని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక హంగులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రారంభించేందుకు నవంబర్ 28తేదీని ఖరారు చేసి, ఆ రోజు ప్రదానమంత్రి షెడ్యూల్ బిజీగా ఉంటే, ఆయనకు అనుకూలంగా ఉన్న సమయానికి మెట్రో ప్రారంభించనున్నట్లు
తెలిపారు. మెట్రోరైలు ప్రారంభోత్సవానికి రావాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వం తరపున లేఖ పంపామని, అయితే మనం నిర్ణయించిన నవంబర్ 28వ తేదీ సమయాన్ని ప్రదానమంత్రి కార్యాలయం ఖరారు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. పాతబస్తీలో మెట్రోరైలు విషయమై ఇప్పటికే పలు సార్లు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దిన్ ఓవైసీతో చర్చించామని, పాతబస్తీలో కూడా మెట్రో నిర్మిస్తామని వివరించారు. మియాపూర్-అమీర్‌పేట, నాగోల్-అమీర్‌పేట కారిడార్లను నవంబర్‌లో ప్రారంభించిన తర్వాత దశల వారీగా 2018 మార్చి, జూలై మాసాల్లో అన్ని కారిడార్లను పూర్తి చేస్తామని, రెండో దశ మెట్రో పనులు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఇందుకు త్వరలోనే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి కెటిఆర్ వివరించారు. మెట్రోరైలుకు సంబంధించి స్టేషన్లు, రూట్‌ను చూసుకునేందుకు ప్రజల సౌకర్యార్థం త్వరలో ప్రత్యేకంగా మెట్రోరైలు యాప్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. దీనికి తోడు నగరంలో ఆర్టీసి, ఎంఎంటిఎస్‌లతో పాటు సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లోని రైళ్ల రాకపోకలకు మెట్రోరైలును అనుసంధానం చేయనున్నట్లు, ఈ మూడింటికి కలిపి ఒకే స్మార్ట్ కార్డును జారీ చేయనున్నట్లు తెలిపారు. మంత్రితో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్ అండ్ టి సిఈవో శివానంద్ నంబుర్జీ, మెట్రోరైలు ఎండి డా.ఎన్వీఎస్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..మెట్రో పనులు పరిశీలిస్తున్న మంత్రి కెటిఆర్