రాష్ట్రీయం

పంథా మార్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 22: ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకింగ్ రంగానిదే కీలకపాత్ర అని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం సచివాలయంలో రాష్టస్థ్రాయి ద్విశత (200వ) బ్యాంకర్ల సమావేశాన్ని ప్రారంభిస్తూ, బ్యాంకులు, ప్రభుత్వం మధ్య సమన్వయం అవసరమన్నారు. రుణ మంజూరు పత్రాలతో వెళ్లినా బ్యాంకులు స్పందించడం లేదన్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ, బ్యాంకులు ఈ విషయంలో పనితీరు మార్చుకోవటానికి అక్టోబర్ 31 వరకు సమయం ఇస్తున్నామని హెచ్చరించారు. ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ఈ క్రమంలో బ్యాంకుల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులతో సమన్వయ కమిటీ నియమించనున్నట్లు సిఎం వివరించారు. రుణ మంజూరు పత్రాలు ఇచ్చినా చెల్లించడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు స్పందిస్తూ సమన్వయానికి కమిటీ అవసరమని సూచించారు. కమిటీలో ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, ఆర్థికశాఖ, వ్యవసాయశాఖ, పరిశ్రమలు, సంక్షేమ శాఖల నుంచి ఒక్కొక్కరు, ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆర్‌బిఐ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం పది మంది కమిటీలో సభ్యులుగా ఉంటారు. బలహీన వర్గాల ప్రజలు రుణాలు తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని సిఎం చెబుతూ ‘రుణాలు తీసుకోవటం, తిరిగి చెల్లించటం ఉండాలి. తిరిగి చెల్లిస్తేనే బ్యాంకులు రీషెడ్యూల్ చేసుకుంటాయి. లేకుంటే బ్యాంకులు పనిచేయటం సాధ్యం కాదు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల చెల్లింపు విషయంలో మాకు స్పష్టత ఉంది. అధికారులు సకాలంలో స్పందిస్తూ, సత్వర చెల్లింపులతో బ్యాంకులు సాఫీగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు’ అని బాబు హామీ ఇచ్చారు.
కౌలు రైతులకు రూ.లక్ష వరకు వడ్డీ లేకుండా రుణాలు చెల్లిస్తున్న విషయాన్ని సమావేశంలో ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్, ఆంధ్రాబ్యాంక్ సర్కిల్ జనరల్ మేనేజర్ జిఎస్‌వి కృష్ణారావు ప్రస్తావించగా ముఖ్యమంత్రి స్పందిస్తూ వ్యవసాయ రుణాల్లో 10 శాతం కౌలు రైతులకు చెల్లించాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. భూమి యజమానులైన రైతుల ప్రయోజనాలు దెబ్బతినకూడదని, వారికి మేలు జరిగేలా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. రాష్ట్రం 15 శాతం వృద్ధిరేటు సాధించే దిశగా తాము అనేక చర్యలు తీసుకున్న విషయాన్ని సమావేశంలో సిఎం ప్రస్తావించారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం లేదన్న అంశం తమ దృష్టికి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఒక్క రైతు పేరిట కూడా ఆ బ్యాంకులు ఖాతాలను ప్రారంభించలేదన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతూ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం సరికాదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆయా బ్యాంకుల దగ్గరకు వెళ్లవద్దని తాము కూడా ప్రజలకు తెలియజేస్తామని, ఆయా బ్యాంకుల్లో అకౌంట్లు ప్రారంభించవద్దని సూచిస్తామని సిఎం హెచ్చరించారు.
అదనపు చార్జీలు మానుకోవాలి
కొన్ని బ్యాంకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి అదనపు చార్జీల విధింపు పద్ధతులను మానుకోవాలని బ్యాంకులకు సిఎం సూచించారు. 30వేల రూపాయలతో గేదె కొనుగోలుకు రుణం ఇవ్వడానికి తనిఖీ ఛార్జీల కింద ఓ బ్యాంకు రూ.12వేలు ఛార్జి చేసిందని ఓ అధికారి చెప్పినప్పుడు సమావేశంలో సిఎం స్పందిస్తూ తగిన ఆధారాలతో వస్తే సదరు బ్యాంకు అధికారుల మీద చర్య తీసుకునేందుకు వీలవుతుందన్నారు. రుణ ఉపశమనం కింద మంజూరు చేసిన మొత్తంలో ఇంకా రూ.16 కోట్లు బ్యాంకర్ల దగ్గరే ఉన్నాయని, వెంటనే లబ్ధిదార్లకు అందజేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎకె రథ్, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్, ఆంధ్రాబ్యాంక్ సర్కిల్ మేనేజర్ జిఎస్‌వి కృష్ణారావు, హైదరాబాద్ ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్ ఎం.సత్యనారాయణరెడ్డి, విశాఖపట్నం సర్కిల్ జనరల్ మేనేజర్ శ్యామల్ ఘోష్ రే, ఇతర బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఉన్నారు.

చిత్రం..బ్యాంకర్ల రాష్టస్థ్రాయ సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు