రాష్ట్రీయం

గోదావరిపై జాతీయ జలమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, సెప్టెంబర్ 28: గోదావరి నదిపై జల రవాణాకు మార్గం సుగమమైంది. బ్రిటిష్ కాలం నాడే గోదావరి నదిలో సాగిన జలరవాణా కాలక్రమేణా రహదారులు, రైలు మార్గాలు ఏర్పడటంతో కనుమరుగైంది. ఐదు దశాబ్దాలుగా గోదావరిపై జల రవాణాను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు నడుస్తుండగా, గోదావరిని జలమార్గంగా ప్రకటించి అందుకు తగిన పనులు చేపట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జల రవాణాను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా ఆమోదం తెలిపింది. జాతీయ జలమార్గ రవాణా పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భద్రాచలం - రాజమండ్రి (171 కి.మీ), భద్రాచలం - నాసిక్ (1184 కి.మీ) మధ్య జల రవాణాకు కేంద్రం పచ్చజెండా ఊపింది. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రంతో జల రవాణాపై పలుమార్లు చర్చించిన ఫలితంగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఉపరితల, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పర్యటించి జలమార్గం పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. డిసెంబర్‌లో టెండర్లు పిలిచి 2018 మార్చి నాటికి పనులు ప్రారంభించే
అవకాశం కనిపిస్తోంది. 1987లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఈ ప్రతిపాదనను తెరపైకి తేగా అప్పట్లో రూ.78 కోట్లతో అంచనాలు రూపొందించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ జలమార్గం ప్రకటించే ప్రాజెక్టు పరిశీలనలోకి వెళ్లింది. ఆయన ఆసక్తి చూపి అధికారులతో పూర్తి స్థాయి సర్వే చేయించారు. 1993లో కేంద్ర జల సంఘం అధికారి ఎస్‌ఎస్ ఏచూరి ఆధ్వర్యంలో రాజమండ్రి నుంచి పాపికొండల వరకు సర్వే చేశారు. నది నీటిమట్టం లోతు కొలుచుకుంటూ జలమార్గం నిర్మాణానికి అనుకూల పరిస్థితి గుర్తించారు. సానుకూల సర్వే నివేదికలు కేంద్రానికి అందజేశారు. ప్రధాని పివి నరసింహారావు పదవి నుంచి దిగిపోవడంతో ఆ తర్వాత జలమార్గం ప్రాజెక్టు మరుగున పడింది. చాలాకాలం తర్వాత గోదావరిపై జలమార్గం రవాణాకు కేంద్రం ఆమోదం తెలపడంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆనందం నెలకొంది.

బహుళ ప్రయోజనాలు
చర్ల నుంచి రాజమండ్రి వరకు జలమార్గం ద్వారా లాంచీలు, ఓడలపై సింగరేణి బొగ్గు, ఐటిసి కర్మాగారం నుంచి కాగితాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కలప, వెదురు, వ్యవసాయ ఉత్పత్తులు, వ్యాపారుల ముడి సరుకు రవాణా చేసే వీలు కలుగుతుంది. తద్వారా రవాణా చార్జీల భారం తగ్గడమే కాకుండా కాలుష్య ప్రభావం, రహదారులపై వాహనాల రద్దీ తగ్గించవచ్చని భావిస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే గోదావరి నదిపై మహారాష్ట్ర నుంచి రాజమండ్రి వరకు కలప, బొగ్గు, ఇతర ముడి సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ సంపద, ఖనిజ సంపదను పడవలు, లాంచీల ద్వారా, కర్ర తెప్పలతో జల రవాణా చేశారు. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద నదిలో రవాణాకు వీలుగా ఉండేందుకు ఆనకట్ట నిర్మించడమే కాకుండా ప్రత్యేకంగా నావిగేషన్ కెనాల్ నిర్మించారు. 1860 ప్రాంతంలో హేగ్ అనే ఇంజనీర్ నదీ ప్రవాహానికి అడ్డంగా 49 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మించారు. అప్పట్లో రహదారులు, రైలు మార్గాలు లేకపోవడం వల్ల జలమార్గం ప్రధాన రవాణా మార్గం అయింది. దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట నిర్మాణం ద్వారా లాంచీలు, పడవలు వర్షాకాలంలో ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలోని ఏటూరు నాగారం వరకు తిరిగేవి. కలపను తెప్పలపై రాజమండ్రి వరకు రవాణా చార్జీలు లేకుండా తీసుకెళ్లేవారు. అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు ఖనిజ, అటవీ సంపద తరలించేవారు. ప్రస్తుతం రహదారుల సౌలభ్యం పెరగడం, లారీలు, ఇతర వాహనాలు తిరగడం వల్ల వేగవంతంగా ప్రయాణ సౌలభ్యం కలగడటంతో కాలక్రమేణా జలమార్గంలో రవాణా తగ్గింది. పెరిగిపోతున్న రవాణా చార్జీలు, రహదారులపై వాహనాల భారం, జరుగుతున్న ప్రమాదాలు, తదితర అంశాలతో మళ్లీ జలమార్గం అవసరాన్ని పాలకులు గుర్తిస్తున్నారు. రహదారుల రవాణా కంటే జలమార్గం రవాణా చార్జీల్లో సగానికి సగం వ్యత్యాసం ఉండటం వల్ల గోదావరి జలమార్గం అభివృద్ధి చేయాలన్న ఆలోచన అందరిలో ఉంది. జల రవాణా అందుబాటులోకి వస్తే ఏటా గోదావరి ద్వారా 100 మిలియన్ టన్నుల సరుకును చౌకగా రవాణా చేసే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా తెలంగాణలో సముద్ర తీరం లేనందున రాష్ట్రంలో తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న భద్రాద్రి జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో..
పదేళ్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు సాగుతుండటంతో మళ్లీ జల రవాణాపై ఆశలు చిగురించాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరిలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా జల రవాణా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న నివేదికలు కేంద్రానికి వెళ్లాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చురుగ్గా సాగుతుండటంతో జల రవాణా ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని విధాలా నష్టపోయిన భద్రాద్రికి జల రవాణా వల్ల మేలు చేకూరుతుందని విశే్లషకులు భావిస్తున్నారు. కేంద్రం రామాయణ సర్క్యూట్‌లో భద్రాద్రిని చేరుస్తూ ఇప్పటికే రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. భద్రాద్రి కేంద్రంగా టూరిజం హబ్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. జల రవాణా వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారు. భద్రాచలం గోదావరి తీర పరిసరాల్లో రామాయణ థీమ్ పార్కు, టూరిజం హోటళ్లు వంటి వాటిని అభివృద్ధి చేసి భద్రాద్రికి పూర్వ వైభవం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

చిత్రం..జలరవాణాకు అత్యంత అనుకూలమైన గోదావరి