రాష్ట్రీయం

ముత్తిరెడ్డి మహాముదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్జాల చంద్రశేఖర్
హైదరాబాద్, సెప్టెంబర్ 28: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ కబ్జాలపై జనగామ కలెక్టర్ దేవసేన బహిరంగంగా ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాలలో సంచలనం రేపింది. తమ ఎమ్మెల్యే భూ కబ్జాను స్వయంగా ఒక కలెక్టరే బహిర్గతం చేయడం అధికార టిఆర్‌ఎస్ పార్టీకి ఇబ్బందికర, మింగుడుపడని పరిస్థితిని కల్పించింది. తనకు ఏ పాపం తెలియదని, తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని, కలెక్టర్ ఆరోపణల వెనుక ఏదో దురుద్దేశం ఉందంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. పైగా అలాంటిదేమైనా ఉంటే ముఖ్యమంత్రి ఏ చర్య తీసుకున్నా శిరస్సావహిస్తానని తన సచ్ఛీలతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముత్తిరెడ్డి గత చరిత్ర తెలిసిన వార్వెరూ ఆయన మాటలను విశ్వసించే పరిస్థితి లేదు. తప్పు చేసినట్టు రుజువు అయితే ఏ శిక్షకైనా సిద్ధమనంతటి సచ్ఛిలుడేమి కాదని ఆయన గత చరిత్ర తెలిసిన వారి వాదన. ముత్తిరెడ్డి భూ కబ్జాలపై ఆరోపణలు రావడం ఇప్పుడేమి కొత్త కాదు. టిఆర్‌ఎస్ పార్టీ పుట్టక ముందు, ఆ పార్టీలో చేరకముందే ముత్తిరెడ్డికి బోల్డంత నేర చరిత్రను మూట గట్టుకున్నారని అనడానికి బలమైన సాక్ష్యాధారాలను ‘ఆంధ్రభూమి’ పరిశోధనలో బయటపడ్డాయి. ముత్తిరెడ్డిపై తాజాగా వచ్చిన భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు 17 ఏళ్ల కిందటనే హైదరాబాద్‌లో పలు పోలీసు స్టేషన్లలో ఆయనపై కిడ్నాప్, భూ కబ్జాలు, ఫోర్జరీ, మోసం వంటి నేరాలపై కేసులు నమోదు అయ్యాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 17 సంవత్సరాల కిందట 73 సంవత్సరాల వృద్ధుడు, స్వాతంత్ర సమరయోధుడు మందాడి రామచంద్రారెడ్డిని కిడ్నాప్ చేసి, చంపుతానని బెదిరించి ఆయనకు చెందిన 4.8 ఎకరాలను తన పేరుపై రాయించుకున్న కేసు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదు అయింది. (ఎఫ్‌ఐఆర్ నంబర్ 1285/2002, ఐపిసి సెక్షన్ 365, 347, 379, 384, 506 కేసు నమోదు). అలాగే రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సిహెచ్ రవిబాబు అనే వ్యక్తికి చెందిన 26.2 ఎకరాలను బలవంతంగా ఆక్రమించుకున్నాడని రాయదుర్గ పోలీసు స్టేషన్‌లో తేదీ 21-04-2000లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 35/2000 సెక్షన్ 419, 468, 471 (ఐపిసి) కింద కేసు నమోదు అయింది. అదే గ్రామంలో మరో సర్వే నంబర్‌లో సురేశ్ అనే వ్యక్తికి చెందిన 5.18 ఎకరాలను ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో ఇద్దరు బలవంతంగా తమ భూమిలోకి ప్రవేశించి కడీలు, ఫెన్సింగ్ తొలగించి భూ కబ్జాకు పాల్పడినట్టు రాయదుర్గ పోలీస్ స్టేషన్‌లో తేదీన 22-04-2000 చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నంబర్ 38/2000 సెక్షన్లు 447,427,506, 504 ఐపిసి కింద కేసు నమోదు అయింది. బేగంపేటకు చెందిన దామోదర్‌దాసు అనే వ్యాపారవేత్త కూడా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో ఇద్దరు తన సంతకాన్ని పోర్జరీ చేసి జనరల్ పవర్ ఆఫ్ అథారిటీని సృష్టించి భూ కబ్జాకు యత్నించినట్టు చేసిన ఫిర్యాదుపై రాయదుర్గ పోలీస్ స్టేషన్‌లోనే మరో కేసు (ఎఫ్‌ఐఆర్ నంబర్ 43/2000 సెక్షన్లు 420, 465, 471 ఐపిసి 468) నమోదు అయింది. అయితే కొసమెరుపు ఏమిటంటే ముత్తిరెడ్డిపై ఫిర్యాదు చేసిన వారు తమ మధ్య సామరస్యపూర్వకమైన, సంతృప్తికరమైన ఒప్పందం కుదరడంతో కేసులను ఉపసంహరించుకుని రాజీ చేసుకున్నట్టు కోర్టులకు తెలియపరచడం గమనర్హం. తనను కిడ్నాప్ చేసినట్టు కేసు పెట్టిన స్వాతంత్య్ర సమరయోధుడు కేసుల ఉపసంహరణకుగల కారణాలను కూడా తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. మాజీ నక్సలైట్లు, రౌడీలతో కేసులు ఉపసంహరించుకోవాలని లేకపోతే చంపుతామని ముత్తిరెడ్డి తనను బెదిరించిన విషయంపై కూడా ఫిర్యాదు చేయడం ఇక్కడ గమనర్హం.
ఇలా ఉండగా హబ్సిగూడలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెందిన స్వాగత్ గ్రాండ్ హోటల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మించినట్టు ఏడాది కిందట విద్యార్థి సంఘాలు సదరు హోటల్ ఎదుట ఆందోళన చేసారు. అలాగే నాచారం మల్లాపూర్‌లో యాదగిరిరెడ్డికి చెందిన నోమా ఫంక్షన్ హాల్‌కు రైల్వే స్థలాన్ని ఆక్రమించి పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు కూడా అభియోగం ఉంది. రెండు నెలల కిందట ఉప్పల్ ప్రాంతంలో ముత్తిరెడ్డికి చెందిన ఒక వెంచర్‌లో ప్లాటు కొనుగోలు చేసిన వారిని మోసం చేసినట్టు ఆరోపిస్తూ బాధితులు ఆయన ఇంటి ముందట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తప్పు చేస్తే తన సొంత కూతురైనా, కుమారిడినైనా వదిలిపెట్టనని ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో కరాకండిగా తేల్చి చెప్పారు. మరీ తమ పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్య తీసుకుంటారో వేచి చూడాలి.