రాష్ట్రీయం

కోటి ఎకరాల సాగు దిశగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: కోటి ఎకరాల మాగాణి సంకల్పంతో తెరాస సర్కారు వేగంగా అడుగులేస్తోంది. పెద్ద, చిన్న ప్రాజెక్టులే కాదు.. వాగు వంకలనూ కలుపుకుని సాగుభూముల విస్తరణ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టిపెట్టిన ప్రభుత్వం, భారీగా నిధుల కేటాయింపులతో రికార్డుస్థాయిలో ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉంది. పర్యావరణ అనుమతులు సాధించి పెద్ద ప్రాజెక్టు కాళ్వేశ్వరానికి అడ్డంకులు తొలగించుకున్న ప్రభుత్వం, మధ్యతరహా ప్రాజెక్టులను మరోవైపు శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగానే కినె్నరసాని ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్, పాలేరు పాత కాల్వ పునరుద్ధరణ పూర్తిచేసి మొత్తంగా 35వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రెండు కాల్వలను నేడు ప్రారంభిస్తోంది. కోటి ఎకరాల మాగాణి సంకల్పంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటడటంతో ఆయా ప్రాంతాల ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
రికార్డుస్థాయిలో పాలేరు పునరుద్ధరణ
తెలంగాణలో ప్రధానమైన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటైన పాలేరు కాల్వ (ఖమ్మం జిల్లా) ఆధునీకరణ పనులు, పాలెం రిజర్వాయర్ నిర్మాణం రికార్డుస్థాయిలో కేవలం నాలుగు నెలల్లో పూర్తిచేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పాలేరు కాల్వ ఆధునీకరణ సాధారణంగా అయితే 20 నెలల సమయం పడుతుంది. సిఎం కె. చంద్రశేఖరరావు, నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు, రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తయ్యాయి.
పాలేరు రిజర్వాయర్ సామర్థ్యం 2.5 టిఎంసి కాగా, దాదాపు 24 కిలోమీటర్ల పొడవున్న కాల్వ శిథిలావస్థకు చేరింది. 1922లో నిజాం పాలనలో నిర్మించిన పాలేరు ప్రాజెక్టు, కాలువల ఆధునీకరణపై గత ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. 320 క్యూసెక్కుల నీరు ప్రవహించాల్సి ఉండగా ఈ సామర్థ్యం
200 క్యూసెక్కులకు పడిపోయింది. దాంతో కాల్వ చివరి భూములకు నీరు అందేది కాదు. ఈ పరిస్థితిలో పాలేరు కాల్వ ఆధునీకరణకు తెలంగాణ ప్రభుత్వం 64 కోట్లు విడుదల చేసింది. కాల్వలో పూడిక తొలగించారు. గుర్రపుడెక్కలు లేకుండా చేశారు. ఆధునీకరణలో భాగంగా కాల్వ ఇరువైపులా రాళ్లను బ్లాస్టింగ్ ద్వారా తొలిగించారు. దారిలోవున్న 9 వంతెనలను తీసివేసి డబల్‌లైన్ రోడ్ బ్రిడ్జిలు నిర్మించారు. 32 తూములకు సిమెంట్ కాంక్రీట్ చేస్తూ, వీటికి కొత్త గేట్లు ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న తొమ్మిది అండర్ టనె్నల్‌లను తొలిగించి, వాటి స్థానంలో కొత్తగా అండర్ టనె్నల్స్ నిర్మించారు. కాల్వపైనున్న 22 ఇన్‌లెట్, ఔట్‌లెట్‌లకు సిమెంట్ కాంక్రీట్ చేశారు. శిథిలావస్థలో ఉన్న 3.9 కిలోమీటర్ల కాలువకు ఇరువైపులా సిమెంట్ కాంక్రీట్ చేశారు.
పాలేరు రిజర్వాయర్ ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎడమ కాల్వతో అనుసంధానించటంతో నీటికి కొరత లేకుండాపోయింది. ఆధునీకరణ పనులు పూర్తయిన పాలేరు కాల్వకు ట్రయల్ రన్ పూర్తయింది. దాంతో సోమవారం కాల్వను ప్రారంభిస్తున్నారు. పాలేరు కెనాల్ కింద 25 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి.
ప్రాజెక్టు నేడు ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి మండలంలోని పాలెం వాగు ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో సోమవారం నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తున్నారు. వెంకటాపురం మండలంలోని 32 గ్రామాలు, వాజేడు మండలంలోని 7 గ్రామాల్లోని 10,132 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. 2005లో 70 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటికీ, నిర్మాణంలో లోపాలవల్ల రెండు పర్యాయాలు నిర్మాణ పనులు వరదల్లో కొట్టుకుపోయాయి. 1.260 టిఎంసి నీటి నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2015లో చేపట్టి అటవీ అనుమతులు కూడా సంపాదించి 228 కోట్ల వెచ్చించి పూర్తిచేసింది.
కినె్నరసాని లెఫ్ట్ కెనాల్ రెడీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కినె్నరసాని ప్రాజెక్టుకు మహార్దశ పట్టింది. సుమారు 11 ఏళ్లుగా పెండింగ్‌లోఉన్న పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి ముస్తాబైంది. సోమవారం కినె్నరసాని ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ నుంచి మంత్రులు టి హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వర రావు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కెనాల్ కింద 10 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 8.4 టిఎంసి. అయితే 2006లో ప్రాజెక్టు కాల్వల నిర్మాణం చేపట్టినప్పటికీ పనులు పూర్తికాలేదు. జరిగిన కొద్దిపాటీ పనులూ లోపభూయిష్టమేనని ప్రభుత్వం గుర్తించింది. 2012లో ఈ ప్రాజెక్టు కుడి కాల్వ నుంచి కేవలం 2 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందించగలిగారు. ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు 10 వేల ఎకరాలకూ నీళ్లివ్వాలన్న సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు భారీ నీటి పారుదల మంత్రి హరీశ్ రావు, ఇంజనీరింగ్ అధికార్లు, ఏజెన్సీ ప్రతినిధులను ఉరుకులు పరుగులు పెట్టించారు. కొత్తగూడెం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 20.06 కిలోమీటర్ల మేర కినె్నరసాని లెఫ్ట్ కెనాల్ నుంచి సాగు నీరు అందించే పనులు పూర్తిచేసి నేడు ప్రారంభిస్తుండటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

చిత్రం..ప్రారంభానికి సిద్ధమైన పాలేరు పాత కాల్వ