రాష్ట్రీయం

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిసి బిల్లుకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో బిసి బిల్లుకు ఆమోదం లభిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ భరోసా ఇచ్చారు. బిసిల పట్ల కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రధాని నరేంద్రమోదీ కూడా బిసిల డిమాండ్ల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు. త్వరలోనే బిసిల సమస్యలపై జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ఆదివారం నాడిక్కడ ఒక హోటల్‌లో ఒబిసి ఉద్యోగ సంఘాలు, బిసి సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఒబిసి సంఘాల సమావేశంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. జాతీయ బిసి కమిషన్ సిఫార్సులను అమలు చేసేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. ఒబిసిలను వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న మాదిరిగా వర్గీకరించి అందరికీ సమన్యాయం చేయాలని కేంద్రం భావిస్తోందని అన్నారు. బిసిలు ఇతర కులాలతో పోల్చుకోకుండా, తమకు ఏది అవసరమో దాని సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో బిసిలకు తగినన్ని నిధులు కేటాయిస్తామని, బిసి ఉద్యోగుల పదోన్నతులు, రిజర్వేషన్ల కోసం తన వంతు కృషి చేస్తానని హన్సరాజ్ హామీ ఇచ్చారు. బిసిల ఆకాంక్షలకు ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని, బిసి వర్గానికి చెందిన మోదీ దేశానికి ప్రధానిగా ఉండడం అదృష్టమని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ బిసిలు ఐక్య పోరాడి తమ సమస్యలను సాధించుకోవాలని అన్నారు. చేతి వృత్తుల వారికి తగిన సహాయం చేస్తే తప్ప వారు అభివృద్ధి చెందరని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం బడుగులకు నిలయం ఉందని, వారిని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ బిసిలకు బిజెపి అండగా ఉంటుందని చెప్పారు. బిసిల డిమాండ్లపై బిజెపి దేశాధ్యక్షుడు అమిత్‌షాతో చర్చిస్తానని అన్నారు. డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ మహిళా బిల్లులో బిసి మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బిసిల డిమాండ్ల కోసం రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ఇంకా పలువురు బిసి సంఘాల నేతలు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

చిత్రం..ఒబిసి సంఘాల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్