రాష్ట్రీయం

5 నుండి ఓపెన్ స్కూల్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 3: ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ థియిరీ పరీక్షలను ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుండి 12.30 వరకూ, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. ఎస్సెస్సీ పరీక్షలు 88 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా, 25,143 మంది పరీక్ష రాస్తున్నారు. అలాగే ఇంటర్ పరీక్షలు 63 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా 19203 మంది రాస్తున్నారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఎస్సెస్సీ ఇంటర్ పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశామని, అభ్యాసకులకు పరీక్ష కేంద్రాలను జంబ్లింగ్ చేశామని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సదుపాయం కూడా సమకూర్చామని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా గట్టి చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు.
4 నుండి తెలుగు వర్శిటీ పరీక్షలు
తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం నిర్వహించే పరీక్షలు 4వ తేదీ నుండి 24వ తేదీ వరకూ యథాతథంగా జరుగుతాయని రిజిస్ట్రార్ డాక్టర్ వి సత్తిరెడ్డి చెప్పారు. ఉదయం 10 నుండి ఒంటి గంట వరకూ, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకూ యథాతథంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సమగ్ర షెడ్యూలును పరిశీలించుకుని పరీక్షలకు హాజరుకావాలని ఆయన చెప్పారు.
సిపిసి రద్దుకు డిసెంబర్‌లో మహాప్రదర్శన
సిపిసి రద్దుకు డిసెంబర్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఛలో హైదరాబాద్ పేరుతో మహా ప్రదర్శన నిర్వహించాలని జాక్టొ స్టీరింగ్ కమిటీ మంగళవారం నాడు నిర్ణయించింది. ఎస్‌టియు భవన్‌లో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై విస్తృతంగా చర్చించినట్టు జాక్టో నేతలు భుజంగరావు(ఎస్‌టియు) , రఘునందన్ (టిటిఎఫ్), జి చెన్నయ్య (టిపిఆర్‌టియు), ఎస్ రాజేందర్ (టిడిటిఎఫ్), చంద్రమోహన్ (ఎస్‌ఎల్‌టిఎ), మహ్మద్ అబ్దుల్లా (టిఎస్‌టియు), జయబాబు (ఎటిఎ) తదితర నేతలు చెప్పారు. ఈ మేరకు జాక్టో నేతలు పలు తీర్మానాలు చేశారు.
స్పెషల్ డిఎస్సీ ప్రకటించాలి
షెడ్యూల్డు ఏరియాలో ఐటిడిఎ పరిధిలో అన్ని యాజమాన్యాల కింద ఉన్న టీచర్ పోస్టులను స్పెషల్ గిరిజన డిఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు భూక్యా చందు నాయక్, ప్రధానకార్యదర్శి మూడ్ శోభన్ నాయక్‌లు కోరారు.

ఎస్పీ, ఎస్సైపై ఎఫ్‌ఐఆర్ ఏది?

నేరేళ్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 3: నేరేళ్ల ఘటనపై సిరిసిల్ల జిల్లా ఎస్పీ, నేరేళ్ల ఎస్సై, మరో 18 మంది పోలీసు సిబ్బందిపై ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఘటనపై పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గెడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జి గంగారావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో పిటిషనర్ల తరఫున న్యాయవాది వి రఘునాథ్ వాదనలు వినిపిస్తూ బాధితులు పోలీసులపై డిజిపికి ఫిర్యాదు చేశారని, తమను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని లిఖితపూర్వకంగా వినతిపత్రం ఇచ్చారన్నారు. ఐజి ఎదుట ఈ మేరకు తమ బాధను కూడా తెలియచేశారన్నారు. కాని ఇంతవరకు బాధ్యులైన పోలీసు అధికారులపై రాష్ట్ర పోలీసు శాఖ కేసు నమోదు చేయలేదన్నారు. ఈ విషయమై అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో బాధితుల ఆరోగ్య పరిస్ధితిని కోర్టుకు వివరించారు. ఈ కేసులో బాధితులు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను వాయిదా వేశారు.

6-7 తేదీల్లో
జాతీయ విత్తన సదస్సు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తికి జాతీయ స్థాయిలోనే ప్రత్యేకత సంతరించుకుంటోంది. ఇందులో భాగంగా 2017 అక్టోబర్ 6-7 తేదీల్లో రాష్ట్ర విత్తన కార్పోరేషన్ల సదస్సుకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. వ్యవసాయ శాఖ, రాష్ట్ర విత్తన కార్పోరేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అందరి ఆమోదం మేరకు హైదరాబాద్‌లోని పార్క్‌హోటల్‌లో రెండురోజుల విత్తన సదస్సు నిర్వహిస్తున్నామని వ్యవసాయ కమిషనర్, రాష్ట్ర విత్తన కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అయిన డాక్టర్ ఎం. జగన్‌మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిషా, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన వివరించారు. కేంద్రప్రభుత్వ సంస్థలు కూడా ఈ సదస్సులో పాల్గొంటాయని వివరించారు.

కాంట్రాక్ట్‌పై వైద్య శాఖలో 2100 పోస్టుల భర్తీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ వైద్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై 2100 పోస్టులను భర్తీ చేయాలని సంబంధిత అధికారులకు వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైద్య విధాన పరిషత్, వైద్య సంచాలకులకు ఈ మేరకు మంగళవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. వాస్తవంగా ఈ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించామని, అయితే సాంకేతిక కారణాల వల్ల పిఎస్‌సి ద్వారా భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్నారు. దాంతో ప్రజలకు ఇక్కట్లు కలగకుండా ఉండేందుకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో పాటు ఇతర పోస్టులను కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయాలని మంత్రి సూచించారు.