రాష్ట్రీయం

జల వివాదాలే సీమకు శాపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 4 : కృష్ణా, తుంగభద్ర జలాలపై నెలకొని ఉన్న వివాదాలు కరవు ప్రాంతమైన రాయలసీమకు శాపంగా మారాయని చెప్పవచ్చు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రాయలసీమకు తుంగభద్ర, కృష్ణా జలాలే ఆధారం. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ నెలాఖరు వరకూ ఆ రెండు నదుల నుంచి దిగువకు నీరు రాని పరిస్థితి ఉండగా నీరు వచ్చినా వివాదాల కారణంగా రాయలసీమ రైతులు కరవు కోరల నుంచి బయట పడలేకపోతున్నారు. దశాబ్దాల తరబడి తుంగభద్ర జలాలపై ఉన్న వివాదం పరిష్కారానికి నోచుకోకపోగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు రాయలసీమ రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తుంగభద్ర నదీ జలాలను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో కర్నాటకలోని తుంగభద్ర జలాశయంలో అనంతపురం జిల్లాలోని తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలు, కర్నూలు, కడప జిల్లాలకు ఉపయోగపడే కెసి కాలువకు కేటాయించిన నికర జలాలను తుంగభద్ర జలాశయంలో భద్రపరచుకుంటూ వస్తున్నారు. అయితే తమ ఆధీనంలో ఉన్న జలాలను కర్నాటక తమ రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తూ రాయలసీమ జిల్లాలకు వేసవిలో కనీసం తాగడానికి కూడా నీరు లేకుండా చేస్తున్నారు. ఎగువ కాలువకు 35, దిగువ కాలువకు 25, కెసి కాలువకు 39 టిఎంసిల నీరు వినియోగించుకోవచ్చని అధికారిక కేటాయింపులు ఉన్నా ప్రతి ఏటా 20టిఎంసిలకు పైగా నష్టపోతున్నామని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర జలాలను సద్వినియోగం చేసుకోవడానికి రాయలసీమలో జలాశయాలు నిర్మించాలని ఏళ్ల తరబడి ప్రజలు కోరుతున్నా పట్టించుకున్న ప్రభుత్వం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కృష్ణా జలాలను శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీ-నీవా కాలువకు తరలించడానికి పొరుగున ఉన్న తెలంగాణ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. పట్టిసీమ కారణంగా మిగిలే కృష్ణా జలాలను రాయలసీమకు తరలిస్తామని ప్రభుత్వం ప్రకటనలు జారీ చేస్తున్నా అది సాధ్యపడదన్న అభిప్రాయం నిపుణుల్లోనే కాకుండా సామాన్య రైతుల్లోనూ వ్యక్తమవుతోంది. పోతిరెడ్డిపాడు నుంచి 11, హంద్రీ-నీవా నుంచి 4టిఎంసిల నీరు మాత్రమే ఇప్పటి వరకూ తరలించగలిగామని ఈ మాత్రానికే తెలంగాణ అడ్డుచెప్పడం రాయలసీమ రైతులను నాశనం చేయడమేనని నిపుణులు భావిస్తున్నారు. తమకు అదనపు కేటాయింపులు కావాలంటే కేంద్రంతో పోరాడవచ్చు కానీ పొరుగున ఉన్న కరవు సీమపై వారు పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని నిపుణులు అసంతృప్తి చెందుతున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం 190 టిఎంసిల నీరు ఉన్నా వాడుకునేందుకు ఎదురవుతున్న అభ్యంతరాలతో రైతులు వ్యవసాయం మానేయడం మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే రాయలసీమలో పంటలు పండే అవకాశం లేకుండా పోతుందని వారంటున్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పంటలకు అనువైన సారవంతమైన భూమి కర్నూలు జిల్లాలో ఉందని, అయితే ఆ భూమి నీరు లేని కారణంగా బీడుగా మారితే ప్రజలకు తినడానికి తిండి కూడా లభించదని వారు హెచ్చరిస్తున్నారు. జలవివాదాలను పరిష్కరించుకోవడానికి కేంద్రం ప్రత్యేకంగా ఒక ట్రిబ్యునల్ వేసి వీలైనంత తక్కువ సమయంలో ఏ రాష్ట్రానికి ఎంత వాటా నీరు ఇవ్వాలో తేల్చి చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే రాయలసీమలో విపరీత పరిణామాలు చోటు చేసుకుని ప్రజలకు దుర్భర పరిస్థితులు ఎదురవుతాయని వారంటున్నారు.