రాష్ట్రీయం

శ్రీవారి పాదాలు తాకే భాగ్యమూ ప్రముఖులకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 8: కోటికి పడగెత్తిన ధనవంతుడు.. నీ ముంగిట సామాన్యుడే.. అన్న ఓ సినీ రచయిత చెప్పిన వాస్తవం తిరుమల నారాయణ గిరి కొండలపై ఉన్న స్వామివారి పాదాల సాక్షిగా వాస్తవ దూరంగా మారింది. తిరుమలో సముద్రమట్టానికి 2500 అడుగుల ఎత్తులో శ్రీవారి పాదాలు ఉన్నాయి. వైకుంఠం నుంచి స్వామివారు భూలోకానికి విచ్చేసినప్పుడు తన తొలి అడుగును నారాయణగిరి కొండలపై పెట్టారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆ కొండలకు నారాయణగిరి కొండలని పేరు వచ్చిందని కూడా ఒక నానుడి. ఈక్రమంలో తిరుమలలో అత్యంత ఎతె్తైన ప్రాంతంలో నారాయణగిరి ప్రాంతంలో ఉన్న శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి పెద్దలు పెద్దఎత్తున తరలివెళ్లి అక్కడున్న స్వామివారి పాదాలుగా భావిస్తున్న రాతిపాదముద్రలకు పూజలు చేసి తాకి నమస్కరించుకుంటారు. ఇటీవల ఆ పాదాలకు సంబంధించిన బొటన వేలు విరిగిపోయింది. ఈక్రమంలో ఆ పాదాల పరిరక్షణ కోసం టిటిడి పాదముద్రలకు అద్దాల బాక్సును అమర్చారు. దీంతో అక్కడకు వెళ్లిన భక్తులు ఆ అద్దాల బాక్సును దర్శించుకుని వస్తుంటారు. అంతేకాదు అక్కడ కానుకలు కూడా సమర్పిస్తారు. శ్రీవారి పాదాలను దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఇక్కడ చిరువ్యాపారం చేసుకునే ఎంతోమందికి జీవనోపాధి కూడా కలుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శ్రీవారి పాదాలు దర్శించడానికి వెళ్లారు. దీంతో టిటిడి అధికారులు శ్రీవారి పాదాలున్న అద్దాల పైబాక్సును తొలగించారు. దీంతో ఆయన శ్రీవారి పాదాలను స్ఫ్రుసించి నమస్కరించుకున్నారు. అయితే ఆయన అటు వెళ్లగానే అధికారులు శ్రీవారి పాదాలపై తొలగించిన గ్లాస్‌ను యథావిధిగా అమర్చేశారు. అటు తరువాత వచ్చిన సామాన్య భక్తులు యథావిధిగా అద్దాలకే నమస్కరించుకుని వెళ్లారు. ఏదేమైనా ఎందరో మహానుభావులు.. అందరూ ఆ పాద సేవకే అన్న నానుడి.. ఎందరో మహానుభావులు.. కొందరే శ్రీవారి పాదాలు తాకడానికి అర్హులన్న చందాన తయారైందని సగటు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆవేదన టిటిడి అధికారులకు ఎప్పటికి చేరుతుందో వేచి చూడాల్సిందే.

చిత్రాలు..నారాయణగిరి కొండపై వెలసిన స్వామివారి పాదాలను శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తాకడానికి వీలుగా అద్దం గ్లాసు పైభాగాన తొలగించిన దృశ్యం.
*అటు తరువాత దానిపై గాజు మూతను అమర్చడంతో అద్దాలకు నమస్కరించుకుంటున్న సామాన్య భక్తులు