రాష్ట్రీయం

సినీ రచయిత, నటుడు హరనాథరావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 9: ప్రముఖ సినీ, నాటక రచయిత, నటుడు ఎం.వి.ఎస్ హరనాథరావు(69) గుండెపోటుతో సోమవారం ఒంగోలులోని తన స్వగృహంలో కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన సోమవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో స్ధానిక దేవుడి చెరువు వద్ద ఉన్న తన సొంత ఇంటిలో అపస్మారక స్ధితిలోకి వెళ్లగా వెంటనే ఆయనను రిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య కోటేశ్వరమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 27 జూలై 1948లో జన్మించిన ఒంగోలుకు చెందిన హరినాథరావు దాదాపు 150 చిత్రాలకుపైగా డైలాగ్స్ రాశారు. టి. కృష్ణ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు వంటి అవార్డు పొందిన చిత్రాలకు కథ, మాటలను అందించారు. మాటల రచయితగా రాక్షసుడు సినిమా కూడా ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయికాపురం చిత్రాలకు నంది బహుమతులను అందుకున్నారు. సూత్రధారులు, స్వయంకృషి తదితర చిత్రాల్లో నటించి చక్కటి నటనను కనబరిచారు. హరనాథరావు ప్రతిఘటన, భారతనారి, ఇదా కాపురం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, రేపటి పౌరులు, మంచిదొంగ, యుద్ధ్భూమి, రాక్షసుడు, రామాయణం, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, ధర్మచక్రం మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశారు. అదేవిధంగా స్వయంకృషి, దేవాలయం, రాక్షసుడు వంటి పలు సినిమాల్లో ఆయన సహాయ నటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. రక్తబలి, జగన్నాథ రథచక్రాలు, క్షీరసాగర మథనం, అంతం కాదిది ఆరంభం, యక్షగానం, రెడ్‌లైట్ ఏరియా, మీ పేరేమిటి?, ప్రజాకవి వేమన వంటి పలు నాటికల్లో ఆయన నటించారు. నంది జ్యూరీ పురస్కారంతో పాటు, ఉత్తమ సంభాషణా పురస్కారం, కందుకూరి పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ప్రముఖ సినీ నాటక రచయిత మరుదూరి రాజాకు హరనాథరావు స్వయానా తమ్ముడు. హరనాథరావుమృత దేహానికి అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి.
ఎంతగానో బాధించింది: హీరో గోపీచంద్
ఆయన మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మా నాన్నగారికి మాత్రమే కాక, నాకు కూడా ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉండేది. నేను ‘బాబాయ్’అని పిలుచుకునే వ్యక్తి నేడు మా మధ్య లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకొంటున్నాను అని హీరో గోపీచంద్ తన సంతాపాన్ని ప్రకటించారు.
మోహన్‌బాబు సంతాపం
మా బ్యానర్‌లో రూపొందిన ‘పుణ్యభూమి నా దేశం’ చిత్రానికి మాటలు సమకూర్చిన హరనాథరావు మా కుటుంబ సభ్యుడు లాంటి వారు. ఆయన మరణం నన్ను ఎంతగానో కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నటుడు మోహన్‌బాబు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

చిత్రాలు..ఎం.వి.ఎస్ హరనాథరావు మృతదేహం, హరనాథరావు ఫైల్‌పొటో