రాష్ట్రీయం

సీమలో కుండపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, కర్నూలు, కడప, అక్టోబర్ 12: గత రెండు రోజులుగా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదులు, వాగులు, పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతపురం జిల్లా పామిడి, ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పెన్ననదికి వరద వచ్చింది. పామిడి పట్టణంలోని చాలా కాలనీలు జలమయమయ్యాయి. పోలీసులు రంగంలో దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కల్లూరు వద్ద రైల్వేట్రాక్ కోతకు గురవడంతో పలు రైళ్లు రద్దుచేశారు. ఉరవకొండ పట్టణంలోని పలు కాలనీల్లోకి మోకాళ్లలోతు నీరు చేరింది. భారీ వర్షానికి నింబగల్లు వద్ద ఉన్న పెద్దవంక పొంగింది. ఉరవకొండ-కణేకల్లు రహదారిలో వంక ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. చాగల్లు రిజర్వాయర్‌కు 15 అడుగుల మేర నీరు చేరింది. కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హొళగుంద, బనగానపల్లె, పాణ్యం, అవుకు, దేవనకొండ, పత్తికొండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హొళగుంద మండలంలో వేదావతి నదికి వరద పోటెత్తింది. వంతెనపై పది అడుగుల ఎత్తున నీరు పారింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. దేవనకొండ మండలంలో హంద్రీనది వరద నీటితో పోటెత్తింది. ఉల్లిపంట కోసేందుకు వెళ్లిన రైతులు వరద నీటిలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు
అధికారులు రంగంలోకి దిగి వారిని ఒడ్డుకు చేర్చారు. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామం వద్ద కర్నాటక బస్సు వరదనీటిలో చిక్కుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బనగానపల్లెలో భారీ వర్షం కురిసింది. దద్దనాల ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది. అవుకు జలాశయం నుంచి గండికోటకు మంత్రి ఆది నీరు విడుదల చేశారు. బనగానపల్లె సమీపంలో శ్రీశైలం కుడిగట్టు కాలువకు మరోసారి గండి పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలువలో నీటి ప్రవాహం తగ్గించి గండి పూడ్చే పనులు చేపట్టారు. జిల్లాలో వేల ఎకరాల్లో పంటపొలాలు నీటి మునిగాయి. దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది.
కడప జిల్లాలో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కుందూ, చెయ్యేరు, పెన్నానదుల్లో వరద పోటెత్తింది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.

16 మంది సురక్షితం
ఆదోని:కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లో హంద్రీ, హగరి నదులు పొంగిపొర్లడంతో వరద నీటిలో చిక్కుకున్న 16మంది కూలీలను పోలీసులు, రెవెన్యూ అధికారులు రక్షించారు. మరికొంత మంది జాడ తెలియలేదు. బుధవారం రాత్రి నుంచీ కురిసిన భారీ వర్షానికి ఆదోని డివిజన్‌లో హగరి, హంద్రీ నదులు ఉద్ధృతంగా ప్రవహించాయి. దేవనకొండ మండలం అలారుదినె్నకు చెందిన 16 మంది కూలీలు గురువారం ఉదయమే ఉల్లిపంట కోసేందుకు కైరుప్పల గ్రామానికి వెళ్లారు. హంద్రీనదికి వరద పోటెత్తడంతో వారంతా ప్రవాహంలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు రెవెన్యూ, పోలీసుల అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది తాళ్లు, జాకెట్ల సాయంతో కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా గొనెగండ్ల మండలం గంజహళ్ళి గ్రామానికి చెందిన 8 మంది కూలీలు పనుల కోసం వెళ్లి హంద్రీనది వరదలో చిక్కుకున్నారు. దీంతో అప్రమత్తమైన రెవెన్యూ సిబ్బంది వారి కోసం గాలింపుచర్యలు చేపట్టారు. వీరి ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది.

చిత్రం..కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వేదవతి నది