రాష్ట్రీయం

ఇక ఉద్యానాంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 13: రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిని ఆయన సమీక్షించారు. కోటి ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు అంటే ఆషామాషీ కాదని, అత్యధిక ఉత్పాదన ద్వారా అధికాదాయం సాధించాలన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉద్యాన రంగంలో వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని, పంట వేయక ముందు నుంచి పంట దిగుబడి వచ్చాక కూడా ఏమేం చేయాలో ప్రణాళిక వేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అధికోత్పాదనకు ఎక్కడా రాజీ వద్దని, కరవు నివారణకు ముందు జాగ్రత్త చర్యలతో సంసిద్ధతతో ఉండాలన్నారు. ఎగుమతికి అనువైన నాణ్యమైన ఉత్పత్తులు కావాలని, ఉన్న ఆదాయానికన్నా 20 రెట్లు అధికాదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అధిక దిగుబడులు సాధించేందుకు ప్రపంచంలోని ఉత్తమ సేద్యపు పద్ధతులను తీసుకురావాలని కోరారు. ఉద్యాన రైతులు అధిగ దిగుబడులతో ఆదర్శ రైతులుగా నిలుస్తున్నారన్నారు. వారిని ప్రోత్సహించేలా చూడాలని, ఉద్యాన పంటల ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలని, మిరప, పసుపు, నువ్వుల పంట సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 39.67 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయని, 259.85 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి
వచ్చిందన్నారు. మేలిమి పద్ధతులను అనుసరిస్తేనే అధికోత్పత్తి సాధ్యమన్నారు. పంట దిగుబడి, ఎగుమతులు, శుద్ధి ప్రక్రియను క్లస్టర్ల వారీగా ప్రణాళికాబద్ధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. క్లస్టర్ల వారీ విభజనతో ఒక్కో క్లస్టర్‌లో ఒక్కో పంటను సాగు చేయవచ్చని చంద్రబాబు అన్నారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి మూడేళ్లుగా కృష్ణాడెల్టాకు కరవు రాకుండా కాపాడిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నార్లు పోసుకోవాలని రైతాంగానికి పిలుపునిచ్చామని, జూన్ నెలాఖరుకే గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణాడెల్టా కర్షకులకు భరోసా ఇచ్చామని గుర్తుచేశారు. ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటి కోసం ఎదురు చూడటం వల్ల ఏటా ఒక పంట నష్టపోయిన చేదు అనుభవాలు, పంటలు పండినా నవంబరులో తుఫాన్లతో దెబ్బతిన్న పీడకలలున్నాయని చంద్రబాబు చెప్పారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలతో ఈ సమస్యలు అధిగమించామని చెప్పారు. ఆక్వా రంగంలో యాంటీ బయోటిక్స్ వాడటంతో సమస్యలు వస్తున్నాయని, వాతావరణ కాలుష్యం లేకుండా చేయాలని, రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దేందుకు విశ్వవ్యాప్తంగా ఉన్న మేలిమి పద్ధతులను రాష్ట్రానికి తేవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
వర్ష సూచనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అందిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఏపీలో పైర్లు వేసిన 98 శాతం భూమిని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా జియో ట్యాగింగ్ చేయడం విశేషమని ముఖ్యమంత్రి వివరించారు. గత ఖరీఫ్ సీజన్‌లో 76 శాతం మాత్రమే జియో ట్యాగింగ్ చేయగలిగామని చెప్పారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలను అనుసరించి పంటల దిగుబడి ఉంటుందని వివరించారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల ప్రభావం వాస్తవికంగా ఎంత ఉందో తెలుసుకోవచ్చన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవటం మీద రైతాంగానికి అవగాహన కలిగించాలని చెప్పారు.
ఖరీఫ్‌లో సాగుకాని భూమిని రబీలో కచ్చితంగా సాగులోకి తేవాలని, రబీకి సాగునీటి కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అటువంటి భూమిని వ్యవసాయ అనుబంధ రంగమైన ఉద్యాన రంగాన్ని, సామాజిక వనాల ప్రోత్సాహానికి కేటాయిస్తున్నామన్నారు. ఉద్యానానికి, సామాజిక వనాలకు 0.20 లక్షల హెక్టార్లు, చేపల చెరువులకు 0.25 లక్షల హెక్టార్లు, పోలవరం ప్రాజెక్టుకు 0.04 లక్షల హెక్టార్లు మళ్లించినట్లు తెలిపారు. సబ్సిడీ మీద ఈ ఏడాది పంపిణీ చేసిన విత్తనాలు గత ఏడాది కంటే స్వల్పంగా తక్కువ అని, పొడి వాతావరణం, జూన్, జూలై మాసాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడం ఇందుకు కారణమన్నారు. అందువల్ల వేరుశనగ, వరి, పప్పు్ధన్యాల పంటల సాగు విస్తీర్ణం తగ్గిందని వివరించారు. రాయితీపై విత్తన సరఫరా లక్ష్యం 11.58 లక్షల క్వింటాళ్లు కాగా, 6.86 లక్షల క్వింటాళ్లను పంపిణీ చేశామన్నారు.
భూసార పరిరక్షణతో అధికోత్పత్తి
అధిక దిగుబడులను సాధించి రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు భూసార పరీక్ష, సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం మూడేళ్ల క్రితమే ప్రారంభించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. భూసార పరీక్షల వల్ల ఏఏ సూక్ష్మ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకుని ముందు జాగ్రత్త చర్యలకు అవకాశం ఉందని, పంట దిగుబడి తగ్గకుండా, రైతు నష్టపోకుండా సూక్ష్మ పోషకాలు తోడ్పడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
వ్యవసాయ రుణాల లక్ష్యం 87,471 కోట్లు
2017-18లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.87,471 కోట్లు కాగా ఖరీఫ్ వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.50,919 కోట్లు అని, రూ.47,156 కోట్ల మేర లక్ష్యం సాధించామని (93 శాతం) ముఖ్యమంత్రి చెప్పారు. 2016-17 ఖరీఫ్‌లో కౌలు రైతులకు ఇచ్చిన రుణాలు రూ.1141.60 కోట్లు అని, 4,98,529 మంది కౌలు రైతులు లబ్ధి పొందారన్నారు. ఖరీఫ్ సీజన్‌లో వృద్ధిరేటును 12 శాతం వస్తుందన్న అంచనాలున్నాయని చెప్పారు. పంటల బీమాపై రైతాంగంలో మరింత చైతన్యం నింపాలని కోరారు. 2016లో పంటల బీమా కింద రైతులు రూ.656.52 కోట్లు పొందారని, క్లెయిముల కింద విడుదల చేసిన మొత్తం రూ.633.82 కోట్లు అని వివరించారు. ఇవ్వాల్సిన బకాయిలు రూ.18.74 కోట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. పంటల బీమా కింద 19.77 లక్షల రైతులు నమోదు చేసుకున్నారన్నారు. రైతుల్లో ‘ప్లాంటిక్స్ యాప్’పై అవగాహన కలిగించాలని, పంటలకు వచ్చే చీడపీడలను ఆకుల ద్వారా గుర్తించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.
విశాఖలో వచ్చే నవంబరు 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే సదస్సుకు బిల్‌గేట్స్ రానున్నారని, ఆ సదస్సుకు అధికారులు పెట్టిన ‘స్మార్ట్ ఫార్మింగ్, సంపన్న రైతు సమ్మిట్’ అనే పేరుకు ముఖ్యమంత్రి మార్పులను సూచించారు. ప్రోగ్రెస్ ఆఫ్ ఫార్మర్, స్మార్ట్ ఫార్మర్, స్మార్ట్ ఫామింగ్ సంపన్న రైతు సమ్మిట్‌కు ప్రోగ్రెస్ ఆఫ్ ఫార్మింగ్ ప్లాట్‌ఫామ్ అనే పేర్లను పరిశీలించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల ఉన్నత కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..వ్యవసాయ, అనుబంధ రంగాలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు